Apr 15,2022 06:53

    రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్‌టిసి బస్‌ చార్జీలను పెంచడం దారుణం. నిరుపేదల, సాధారణ ప్రజల ప్రయాణ సాధనాలుగావున్న పల్లె వెలుగు, సిటీ సర్వీసుల కనీస చార్జీలతోపాటు అన్ని స్టేజిలకూ భారం పెంచడం ద్వారా సర్కారు సామాన్యులను సమిధల్ని చేస్తోంది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీస్‌ ప్రయాణికులపై టిక్కెట్‌కు రూ.2, ఎక్స్‌ప్రెస్‌, సిటీమెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌్‌ సర్వీసుల్లో రూ.5, సూపర్‌ లగ్జరీ, ఎసి సర్వీసుల్లో రూ.10 చొప్పున ఈ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డనరీ సర్వీసుల్లో కనీస ధర రూ.10గా చేయడంతో పాటు సేఫ్టీ సెస్‌ పేరుతో అదనంగా మరో రూపాయి వసూలు చేస్తున్నారు. రిజర్వు బ్యాంకుతో, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి చిల్లర కొరత నివారించవలసిందిపోయి కొరత పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రౌండప్‌ చార్జీలను వసూలు చేస్తామనడం మోసపూరితం. తాజా పెరుగుదల వల్ల ఆర్‌టిసికి అదనంగా రోజుకు రెండు కోట్లు, లేదా ఏడాదికి రూ.720 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నా అది వాస్తవంలో పన్నెండు వందల కోట్లు దాటుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఇప్పటికే విద్యుత్‌ చార్జీలను పెంచిన ప్రభుత్వం తాజాగా ఆర్‌టిసి ఛార్జీలు పెంచి జనానికి గోరుచుట్టుపై రోకటి పోటు వేసినట్టయింది.
    2019లో చార్జీలు పెరిగాయని, అప్పుడు లీటర్‌ డీజిల్‌ ధర రూ.67గా ఉండగా ప్రస్తుతం రూ.107కి పెరిగాయని అధికారులు చెబుతున్న మాట నిజం. అయితే, ఈ పెరుగుదలకు కేవలం మోడీ ప్రభుత్వ విధానాలే కారణం తప్ప వేరేమీ కాదు. అలాంటిది కేంద్ర ప్రభుత్వంతో తలపడి, ప్రజా రవాణా వాహనాలకైనా తక్కువ ధరకు డీజిల్‌ సాధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నమూ చేయకుండా ఆ భారాన్ని ప్రజలపైకి మళ్లించడం సబబు కాదు. కనీసం కేంద్రంతో పోరాడి, సాధించలేని స్థితిలో దాన్ని ప్రజలముందు దోషిగా నిలిపినా కొంతవరకు సబబుగా వుండేది. సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగావున్న ఆర్‌టిసి ఖాళీ స్థలాలను బిఓటి పద్ధతిలో ప్రైవేటువారికి అప్పగించాలనడం మోసపూరిత ఆలోచన. వివిధ నగరాలు, పట్టణాల నడిబొడ్డునవున్న ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు దఖలుపర్చడం ప్రజల సంపదను అస్మదీయులకు కట్టబెట్టే దుష్ట తలంపే! కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌ పథకానికి ఇది ప్రతిరూపమే. ఆర్‌టిసి స్థలాలను సంస్థ విస్తరణకు, ప్రయాణికుల సౌకర్యాలకు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ రూపంలోనూ ప్రైవేటుకు అప్పగించడానికి వీల్లేదు. ప్రభుత్వం అందుకు ప్రయత్నిస్తే ప్రజలు, ఆర్‌టిసి ఉద్యోగులు ఉద్యమించి ప్రజల ఆస్తిని కాపాడుకోవాలి.
    ఇప్పటికే ధరలు పెరిగి పన్నుల భారంతో సతమతమవుతున్న ప్రజలకు ఇది కోలుకోలేని దెబ్బ. పేద, మధ్యతరగతి, నిరుద్యోగులు, విద్యార్థులు బస్సు ప్రయాణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నందున పెంచిన బస్సు చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. సంస్థ నష్టాలకు కారణాలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం అవసరం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బల్క్‌ డీజిల్‌ ధర పెంచినపుడు ఆర్‌టిసి బస్సులకు తక్కువ ధరకు రిటైల్‌ బంకుల్లో డీజిల్‌ ఫిల్లింగ్‌ చేయించి ఎంతో కొంత పొదుపు చేయగలిగారు. సరుకు రవాణా (కార్గో)పై మరింత కేంద్రీకరిస్తే ఆదాయం పెరచుకోవచ్చు. ముఖ్యంగా స్టేజి క్యారేజిలుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులను అదుపు చేస్తే ఆర్‌టిసి ఆక్యుపెన్సీ పెరగడంతోపాటు ఆదాయమూ వృద్ధి చెందుతుంది. అలాగే లాభసాటిగా వుండే అంతర్రాష్ట్ర సర్వీసుల విస్తరణకు కృషి చెయ్యాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో తగు ఒప్పందాలు చేసుకోవాలి. అన్ని విధాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, సంస్థ ఆదాయం పెంచుకోవడం, దుబారా ఖర్చులు తగ్గించడానికి సకల చర్యలు చేపట్టడంతోపాటు అవినీతి, లీకేజిలను అరికట్టడంపై సర్కారు కేంద్రీకరిస్తే ప్రజలపై భారాలు వేయాల్సిన అవసరమే లేదన్న నిపుణుల మాట ప్రత్యక్షర సత్యం.