అనంతపురం ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై మరో గుదిబండ మోపింది. వంట గృహ వినియోగానికి వాడే సిలిండర్‌పై ఏకంగా రూ.50 పెంచింది. ఇక కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచేసింది. పెరిగిన ధరలతో సామాన్యుడి గుండె దబేల్ మంటోంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు, కరోనా కష్టాలతో సతమతం అవుతున్న జనంపై గ్యాస్ బండను వేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్యులపై భారాలు వేస్తూ, కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆరు మాసాలుగా గ్యాస్ ధరలో పెరుగుదల లేదని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోమారు గ్యాస్ భారాన్ని పెరిగింది. ఈసారి ఏకంగా సిలిండర్‌పై గృహ వినియోగానికి రూ.50 పెరిగితే వాణిజ్యానికి సిలిండర్‌పై ఏకంగా రూ.350 పెంచేశారు. సామాన్యుల ఆదాయాలు తగ్గి ఇప్పటికే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్యాస్ భారాన్ని మోపడం పట్ల సర్వత్రా ఆందోళనలు, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనంతపురంలో బుధవారం నుంచి సిలిండర్ ధర రూ.1220కు చేరుకుంది. కరోనా సంక్షోభం నుంచి ఇంకా కోలుకోక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న క్రమంలో గ్యాస్ ధరలను పెంచడంపై పేదలు గగ్గోలు పెడుతున్నారు. కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్యుడి జీవనంపై భారం పడుతోంది. నిత్యం పెరుగుతున్న ఈ ధరలతో రోజు కూలీలు, చిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.
గృహ వినియోగదారులపై
నెలకు అదనంగా రూ.3.45 కోట్ల భారం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 88 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి.ఉమ్మడి జిల్లాలో సుమారు 16 లక్షల వరకు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 60 వేల వరకు వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. నెలకు సగటున ఐదు లక్షల సిలిండర్ల వరకు వినియోగంలో ఉంటున్నాయి. ఈ లెక్కన గృహ సిలిండర్లపై నెలకు రెండున్నర కోట్ల వరకు భారం ప్రజలపై పడనుంది. ఇక వాణిజ్య సిలిండర్లపై వ్యాపారులపై మరింత అదనంగా భారం ఉండనుంది. సగటున అర కోటి వరకు భారం వాణిజ్య సిలిండర్లు వాడే వారిపై పడనుంది. దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో బుధువారం నాడు నిరసన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆయా కంపెనీలు సర్వీసు ఛార్జీల పేరుతో వసూలు చేసే అదనపు బాదుడు కూడా సామాన్యుడిపై పడుతోంది. తెస్తోంది.
మోయలేని భారాలు
ఆరీఫా , గృహిణి అనంతపురం నగరం.
నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ భారాలను మోయలేని స్థితిలో ఉంటున్నాం. ఏదీ కొనాలన్న ధరలు అధికంగానున్నాయి.ఇటువంటి తరుణంలో తిరిగి గ్యాస్ ధరలు పెంచడం సరైంది కాదు. సామాన్యులకు వెసలుబాటు కల్పించే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలి. ఒకవైపు పెట్రోల్, మరో వైపు విద్యుత్ ఛార్జీలు , నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ పెరుగుతూపోతే సామాన్యుడి జీవనం దుర్బరంగా మారుతోంది.
గ్యాస్ ధరలను తగ్గించాలి
వి.రాంభూపాల్, సిపిఎం జిల్లా కార్యదర్శి.
ప్రజలపై భారాలు మోపేలా కేంద్రం ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తక్షణం ఉప సంహకరించుకోవాలి. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన జీవనం గడపుతున్నారు. గ్యాస్ ధరలను రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు పెంచడం దారుణం. 4 సంవత్సరాల క్రితం రూ.417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధర నేడు రూ.1200కు పైగా పెరిగింది. గ్యాస్‌పై ప్రభుత్వం సబ్సిడీ వేయడం రెండు సంవత్సరాల నుంచి నిలిపేసింది. ఇలా ధరలు పెంచడం పూర్తిగా పేద, మధ్య తరగతిపై దాడి తప్ప మరొకటి కాదు. వాణిజ్య సిలెండర్‌్ ఒక్కసారిగా రూ.350 పెంచడం వల్ల స్వయం ఉపాధి పొందుతున్నవారు.. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండులా భారాలు మోపడం గర్హనీయం. కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్న బిజెపి పాలకులు సామాన్యులపై భారాలు వేసి నడ్డి విరుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గురించి పెంచిన సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలి.










