క్యాన్సర్ ప్రాణాలను బలితీసుకుంటోంది. ఆన్‌లైన్ బెట్టింగ్ కుటుంబాలకు కుటుంబాలనే రోడ్డుపై పడేస్తోంది. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. హత్యలకూ వెనకాడకుండా చేస్తోంది. ధనార్జనే ధ్యేయంగా ఉన్న కొన్ని కంపెనీలు సమాజంలో అశాంతికి కారణమవుతున్నాయి. అలాంటి కంపెనీలకు సినీతారలు, క్రీడాకారులు ప్రచార సాధనాలుగా మారుతున్నారు. వినోద పరిశ్రమ అయినా, క్రీడా రంగమైనా ప్రజల ఆదరణ తోనే ఎదుగుతుందని, ప్రజల అభిమానంతోనే నటీనటులు, క్రీడాకారులు సెలబ్రిటీలుగా వెలుగొందుతారనే వాస్తవాన్ని మరిచి, సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనల్లో నటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుట్కా, మద్యాన్ని ప్రోత్సహించేలా...
భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు, వ్యాధులకు పొగాకు వాడకం ఒక ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. కోట్లాది మంది భారతీయులు పొగాకు ఆధారిత ఉత్పత్తులను వాడుతున్నారు. వీటిలో పొగ రహిత పొగాకు ఉత్పత్తులైన ఖైనీ, గుట్కా, జర్దా వంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి గుట్కాతో పాటు మద్యాన్ని ప్రోత్సహించేలా కొందరు నటులు, క్రీడాకారులు ఆ కంపెనీల ప్రకటనల్లో నటిస్తున్నారు. గుట్కా అనేది పొగాకు నుంచి తయారవుతుంది. ఈ గుట్కాను పాన్ మసాలా పేరుతో కొన్ని బ్రాండ్లు ప్రచారం చేస్తున్నాయి. పాన్ మసాలా పేరుతో విమల్ ప్రకటనలో షారుఖ్ ఖాన్, అజరు దేవగన్ కనిపిస్తారు. అదే తరహాలో కమలా పసంద్ ప్రకటనల్లో హిందీలో అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్, తెలుగులో మహేష్ బాబు, ఆయా భాషల్లోని స్థానిక హీరోలను వాడుకుంది. రాయల్ స్టాగ్ మద్యం కంపెనీ నీళ్ల ప్రకటన అంటూ పలువురు క్రీడాకారులు, సినీతారలతో నటింపజేసింది. అంతేకాకుండా ఐపీఎల్‌లో 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు' అనే ఒక జట్టు ఉంది. రాయల్ చాలెంజర్స్ ఒక ప్రముఖ మద్యం కంపెనీ. జట్టుతో పాటు సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్ చేసేలా క్రీడాకారులు, నటులతో యాడ్స్‌ను రూపొందించారు.
విమర్శలు రావడంతో...
పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు, పాన్ మసాలా ప్రకటనల్లో నటించవద్దని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్‌ఓటీఈ) అమితాబ్‌ను కోరడంతో పాన్ మసాలా బ్రాండ్ ప్రమోషన్ నుంచి అమితాబ్ బచ్చన్ తప్పుకున్నారు. పాన్ మసాలా యాడ్‌లో నటించడం లేదని, ఆ బ్రాండ్ ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేసినట్టు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా జేమ్స్ బాండ్ నటుడు పియర్స్ బ్రాస్నన్‌ను ఓ భారత పాన్ మసాలా కంపెనీ తమ ఉత్పత్తుల బ్రాండింగ్‌కు వాడుకోగా, భారత అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు. మౌత్ ఫ్రెషర్‌కే మోడలింగ్ చేశానని, కానీ ఆ సంస్థ పాన్ మసాలాలు అమ్ముతుందని తెలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అంతేగాకుండా, ఆ ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నారు.
సరోగేట్ అడ్వర్‌టైజింగ్
భారతదేశంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం ద్వారా ఆల్కహాల్, సిగరెట్లు, ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారు. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ రూల్స్, 1994లో సెక్షన్ 7 (2) (V) ప్రకారం.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, వైన్, మద్యం.. ఉత్పత్తి, అమ్మకం లేదా వినియోగానికి సంబంధించిన ఏ ప్రకటనను అనుమతించరాదు. సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూచించే లేదా ప్రోత్సహించే ఏ ప్రకటనలోనూ ఎవరూ పాల్గొనరాదని 'సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్ 2003, సెక్షన్ 5' సూచిస్తుంది. దీంతో చట్టాలకు చిక్కకుండా సరోగేట్ అడ్వర్‌టైజింగ్ ద్వారా ఆ కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తున్నాయి. దీని కోసం సెలబ్రిటీలను వాడుకుంటున్నాయి. కేవలం డబ్బు కోసం మాత్రమే అలాంటి ప్రకటనల్లో క్రీడాకారులు, హీరోలు కనిపిస్తున్నారు. గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారతదేశంలో చట్టారీత్యా నేరం. దీంతో విమల్, కమలా పసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నాయి.
బెట్టింగ్ కంపెనీలకు కూడా...
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అన్నీ కోల్పోయిన వారు కొన్ని సార్లు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొన్ని సార్లు ఇది హత్యలకు సైతం దారితీస్తోంది. అయితే అలాంటి ఓ బెట్టింగ్ కంపెనీ అయిన డ్రీమ్ 11 ను బీసీసీఐ తన ఐపిఎల్ స్పాన్సర్‌గా ఎంపిక చేసింది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఐపిఎల్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో టీములకు వేలంపాట నిర్వహించగా, ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ పార్టనర్స్ సంస్థ బెట్టింగ్, గేమింగ్‌ను అధికారికంగా నిర్వహించే కంపెనీ. ఆన్ లైన్ లో రమ్మీ సర్కిల్‌తోపాటు చాలా బెట్టింగ్ విధానాల్లో యువత పాల్గొని ఎంతో నష్టపోతోంది.
దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని... అలాంటి వాటిని కేవలం డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని... నటులు, క్రీడాకారులపై మద్రాస్ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ స్పాన్సర్ అయిన డ్రీమ్ 11, ఆన్‌లైన్ రమ్మీ, జంగ్లీ, రమ్మీ సర్కిల్, ఎంపీఎల్ లాంటి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లతో పాటు నటి తమన్నాపై మద్రాస్ హైకోర్టు అసంతృప్తి సైతం వ్యక్తం చేసింది.
సినిమా స్టార్లు, క్రీడాకారులు తమకు ఉన్న పాపులారిటీని ప్రజలకు అనారోగ్యం కల్పించే ఉత్పత్తుల ప్రకటనలకు ఉపయోగించడం వివాదాస్పదం అవుతోంది. నేటి యువతరంపై నటులు, క్రీడాకారుల ప్రభావం చాలా ఎక్కువ. అలాంటిది బాధ్యతాయుతంగా వుండాల్సిన వారు ఎవరేమైపోతే మాంకేటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. హీరోల ఉపదేశాలూ, ఉగ్రరూపాలూ సినిమా తెర మీద తప్ప వారి నిజ జీవితాల్లో కనిపించడం లేదు. ఇప్పటికైనా వారు మేల్కొనాలి. తమకు ఇంత గుర్తింపు ఇచ్చిన సమాజానికి రుణపడి ఉండాలి. సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనలకు దూరంగా ఉండాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
ఫిరోజ్ ఖాన్ - / వ్యాసకర్త సెల్ : 9640466464 /










