ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: ప్రఖ్యాత రచయిత్రి, రిటైర్డ్ రీడర్ డాక్టర్ లక్ష్మీ రాఘవ 9వ గ్రంథం(ఏడవ కథా సంపుటి) గ్రంధావిష్కరణ ఆదివారం మదనపల్లె జ్ఞానోదయ పాఠశాలలో ప్రజా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు తమ ప్రారంభ ఉపన్యాసంలో లక్ష్మీ రాఘవ చేయి తిరిగిన రచయితని, సమాజ హితకరమైన రచనలు చేస్తున్నారని కొనియాడారు. గ్రంధావిష్కరణ గావించిన రిటైర్డ్ టెలికాం డిజిఎం మనేరి రామచంద్రయ్య ఈ గ్రంథంలోని కథలలో కొన్ని సంఘటనలు తమ జీవితంలో జరిగిన సంఘటనలతో పోలి ఉన్నాయని రచయిత్రి రచనలు ప్రతి పాఠకుడికి తమ జీవితంలోని ఏదో అంశాన్ని మననానికి తెస్తాయని అన్నారు. శైలి, శిల్పం, కథా వస్తువు, క్లుప్తత, అనుభూతి ఐక్యత రసానుభూతి మొదలైన మంచి లక్షణాలన్నీ లక్ష్మీ రాఘవ 'సాధన' గ్రంథంలోని కథలలో సమపాళ్లలో చోటు చేసుకున్నాయని, మనుషులను, మనసులను చదవగలిగిన రచయిత్రి డాక్టర్ లక్ష్మీ రాఘవ అని గ్రంథ సమీక్ష గావించిన విశ్రాంత ప్రొఫెసర్ సాతవల్లి చంద్రశేఖర్ శర్మ అన్నారు.










