Apr 02,2023 21:09

రమణీయం..రథోత్సవం

వాల్మీకిపురం ;శ్రీ పట్టాభిరామస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు ఆదివారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడి ఉత్సవర్లను శోభాయమానంగా అలంకరించి రథాన్ని అధిష్టించి తిరు మాఢవీధుల్లో ఊరేగించారు. రథోత్సవం ముందు భక్తులు రామనామ స్మరణ, డప్పు వాయిద్యాలు, భజన బృందాలు, కోలాటాలు, సంకీర్తనల నడుమ కోలాహలంగా నృత్యాలు చేశారు. అడుగడుగునా భక్తులు కర్పూరనీరాజనాలు అందించారు. అశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి రథాన్ని తిరుమాడ వీధుల్లో విహరించి యథాస్థానానికి చేరిన తర్వాత స్వామివారిని తిరుచ్చిలోకి వేంచేపు చేసి హారతి ఇచ్చారు. అంతకుముందు వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన, మొదటి గంట, శాత్తుమొర కార్యక్ర మాలు భక్తులకు కనువిందు చేశాయి. రథోత్సవం అనంతరం స్వామివారికి స్నపన తిరుమంజనం, కైంకర్యములు శాస్త్రోక్తంగా నిర్వహించారు కార్యక్రమంలో టిటిడి అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం..రథోత్సవం సందర్భంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పట్టణంలోని పలువురు సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక శ్రీ వాసవీ కల్యాణ మండపంలో లక్ష్మినారాయణ శెట్టి, బజారువీధిలో కువైట్‌ శంకర, స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్ద శ్రీ సాయినాథ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.