Sep 17,2022 22:41

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌
రక్త దానం చేయడంద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చునని రక్త దానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీ రావు పిలుపునిచ్చారు. రక్తదాన అమత మహౌత్స వాలలో భాగంగా నగరంలోని క్రొత్త ప్రభుత్వాసుపత్రి సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ లో జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ నివారణ మండలి, ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్త దానం గొప్పదన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరూ రక్తాన్ని దానం చేయవచ్చునని యువత సామజిక బాధ్యతగా రక్త దానం చేసేందుకు ముందుకురావాలన్నారు. రక్తదానం చేయడం - సంఘీభావం చాటడం, చేయి, చేయి కలుపుదాం - ప్రాణాన్ని కాపాడుదాం అనే నినాదం మెగా రక్తదాన కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అక్టోబర్‌ 1వ తేదీ వరకూ నిర్వహించే జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినో త్సవం వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా మన్నారు. మెగా రక్తదాన శిబిరంలో సిద్దార్ధ వైద్య కళాశాల విద్యార్థులు, యువత స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేసారు. రక్తదానం చేసిన ప్రతీ ఒక్కరికీ జిల్లా కలెక్టర్‌ ధ్రువపత్రాలను అందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. ఎమ్‌. సుహాసిని, అడిషనల్‌ డి. ఎమ్‌.అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ జె. ఉషారాణి, ఆసుపత్రి సూపరింటెం డెంట్‌ డా. సౌభాగ్యలక్ష్మి, ఆర్‌ ఎమ్‌ ఓ డా. శోభా, యూత్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస రావు, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ కిరణ్‌, బ్లడ్‌ బ్యాంకు మెడికల్‌ ఆఫీసర్‌ కళ్యాణి, జిల్లా ప్రోగ్రాం సూపర్‌ వైజర్‌ ప్రశాంతి ఉన్నారు.