Dec 04,2022 22:01

శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు, అధికారులు

ప్రజాశక్తి-బుక్కపట్నం : రహదారులను అభివృద్ధి చేయడం ద్వారానే ఆయా ప్రాంతాల అభివృద్ధి చెంది పరిశ్రమలు ఏర్పాటవుతాయని ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం ఎన్‌హెచ్‌ 342 లో భాగంగా 32 కిలోమీటర్ల పనులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విజయవాడలో వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బుక్కపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సిఎం జగన్మోహన్‌రెడ్డి చొరవతో సత్యసాయి జిల్లాలో రూ.175కోట్లతో రోడ్లు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకూ రెండు లైన్లు అభివృద్ధి పనులరు శంకుస్థాపన చేశామన్నారు. అలాగే సెప్టెంబర్‌ 23వతేదీలోపు నియోజవర్గంలోని 193 చెరువులకు రూ.వెయ్యి కోట్లతో చెరువులు నింపే కార్యక్రమం చేపడతామన్నారు. గత పాలకులు అభివృద్ధిని మరిచి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో సిఎం జగన్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. అలాగే నియోజకవర్గంలో గాజులపల్లి, నల్లగొండలో రెండు రిజర్వాయర్లను ఏర్పాటు చేసి అన్నివిధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డైట్‌ కళాశాలలో నాడు-నేడు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌డి మధుసూదన్‌రావు, సర్పంచులు నాగలక్ష్మి రాజు, రూప, జడ్పిటిసి శ్రీలత గోవర్ధన్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి పార్వతి రత్నాకర్‌, కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు కొత్తకోట కేశప్ప, కేశప్ప, నారాయణస్వామి, రామలింగారెడ్డి, అధికారులు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.