Oct 25,2022 23:15

  • సర్వస్వం కోల్పోయిన బాధితులు
  • బాధితులకు పలువురు నేతలు, అధికారుల పరామర్శ
  • దప్పట్లు, టవళ్లు పంపిణీ చేసిన సిపిఎం నేతలు

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌, వన్‌టౌన్‌ : దీపావళి పండుగ ముందు రోజు విజయవాడ నగరంలో చోటుచేసుకున్న రెండు అగ్నిప్రమాదాలను మరవక ముందే ఆదివారం అర్థరాత్రి, సోమవారం మరో రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో 16 ఇళ్లు దగ్ధమయ్యాయి. పకీరుగూడెంలో జరిగిన ప్రమాదంలో 15 ఇళ్లు పూర్తిగా కాలిపోగా, వన్‌టౌన్లో జరిగిన ప్రమాదంలో పూరి గుడిసె కాలిపోయింది. ఈ రెండు ఘనట్లో బాధితులంతా కట్టుబట్టులతో రోడ్డున పడ్డారు. శనివారం జరిగిన ఘటనల్లో ఇద్దరు సజీవ దహనకాగా, లక్షలాది రూపాయల మేర ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే.
నగరంలోని 19వ డివిజన్‌ పకీరుగూడెంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం 15 ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాధిత కుటుంబాల వారు తీవ్ర భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇళ్లలోని సామాన్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. బాధిత కుటుంబాలంతా పకీరుగూడెం ప్రాంతంలో రోజువారీ కూలి పనులు చేసుకునే వారే. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
బాధితులను ఆదుకోవాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు
సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం
పకీరుగూడెం అగ్ని ప్రమాద బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ పరామర్శించారు. నిరాశ్రయులైన కుటుంబాల వారికి దుప్పట్లు, వంట సామానులను అందచేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదంతో రోడ్డునపడ్డ 15 కుటుంబాల వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణ సాయంగా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని కోరారు. టిడ్కో గృహాలు 100 శాతం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అతిది సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం నగర నాయకులు కోటి, 19వ డివిజన్‌ కార్యదర్శి ఎం.రత్నమాల, రత్నబాబు, కిషోర్‌, రవి, బాబి తదితరులు పాల్గొన్నారు.
సబ్‌ కలెక్టర్‌, విఎంసి కమిషనర్‌, వైసిపి నేతల పరామర్శ
సంఘటనా స్థలాన్ని విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అతిది సింగ్‌, విఎంసి కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ, కార్పొరేటర్‌ మొహమ్మద్‌ రెహనా నాహిద్‌ పరిశీలించారు. బాధితులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సమీపంలోని మల్లు ఆనంతరామయ్య నగరపాలక ప్రాధమిక పాఠశాలను పరిశీలించి నిరాశ్రయులకు షెల్టర్‌ ఇవ్వాలని, అన్ని రకాల నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు. అలాగే వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్‌ తదితరులు బాధితులను పరామర్శించారు.
టిడిపి నేతల సాయం
అగ్ని ప్రమాద బాధితులను జడ్‌పి మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధా మంగళవారం పరామర్శించారు. ఎంఎల్‌ఎ గద్దె రామమోహనరావు అందజేసిన రూ.1.70 లక్షల నగదును, రూ.30 వేల విలువైన వంట సామాగ్రిని బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, ఉషారాణి, చెన్నుపాటి గాంధీ, పార్టీ డివిజన్‌ అధ్యక్షులు బి.సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.