రోజు రోజుకూ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతోంది. ఫలితంగా భూగోళం మండుతోంది. ఇప్పటికే ప్రకృతికి విరుద్ధంగా అనేక ప్రకృతి విపత్తులు మానవాళిని సవాలు చేస్తున్నాయి. దీనికి ఓ రకంగా బాధ్యత వహించాల్సింది కూడా మానవాళే. ఎందుకంటే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినడానికి కారణమయ్యే కర్బన ఉద్ఘారాల విడుదల, పరిశ్రమల కాలుష్యం, విషతుల్యమైన రసాయనాల వినియోగమే ఇందుకు కారణం. ఫలితంగా అనేక విపత్తులు సంభవిస్తున్నాయి. అకాల వర్షాలు.. వరదలు.. విపరీతంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. తుపానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. అయితే ఇక నుంచి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయని ఈ ఐపీసీసీ రిపోర్ట్ తేల్చి చెప్పింది.
పర్యావరణంలో వస్తున్న మార్పులతో మానవాళికి పెను ముప్పు తప్పదని వాతావారణ మార్పులపై ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) తన తాజా నివేదికలో హెచ్చరించింది. రానున్న రెండు దశాబ్దాల్లోనే భూమి 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత స్థాయిని అందుకుంటుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులకు కర్బన ఉద్ఘారాలు, మానవాళి చేపడుతున్న కార్యకలాపాలే ప్రధాన కారణాలని నివేదిక తెలిపింది. 2013లో ఇచ్చిన నివేదికకు ఇది కొనసాగింపు. ది సిక్త్స్ అసెస్‌మెంట్ రిపోర్ట్ (ఏఆర్6) క్లైమేట్ చేంజ్ 2021: ద ఫిజికల్ సైన్స్ బేసిస్ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ పర్యావరణ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ రిపోర్ట్‌ను ఐపీసీసీలోని 195 దేశాల ప్రభుత్వాలు ఆమోదించాయి.
ఈ నివేదిక ప్రకారం.. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీస్ సెల్సియస్‌కు చేరుకుంటే.. వడగాల్పులు, వేసవి కాలం ఎక్కువగా ఉండటం, శీతాకాలం తగ్గడం వంటివి జరుగుతాయి. ఇది 2 డిగ్రీల సెల్సియస్‌కు చేరితే.. విపరీతమైన వేడిమి మనుషుల ఆరోగ్యంపై, వ్యవసాయంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తుంది. వందేళ్ల కిందటితో పోలిస్తే దశాబ్దంలో ఒకసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు 1.3 రెట్లు పెరిగాయి. 21వ శతాబ్దంలో సముద్ర మట్టాలు పెరగడం ఇలాగే కొనసాగి.. తీర ప్రాంతాల ముప్పు ముంపు పెరుగుతూనే ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. సముద్ర మట్టాలు పెరగడం, తీరం కోతకు గురవడం వంటివి గతంలో వందేళ్లకోసారి కనిపిస్తే.. ఈ శతాబ్దం ముగిసేనాటికి అది ప్రతి ఏటా కనిపించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.
మానవాళి భవిష్యత్తు ప్రశ్నార్థకం...
పరిస్థితి ఇలాగే కొనసాగితే మానవాళి మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఈ ఐపీసీసీ నివేదిక తేల్చి చెప్పింది. తరచూ ప్రకృతి వైపరీత్యాలతో భూమి అతలాకుతలం కానుందని హెచ్చరికలు జారీ చేసింది. భూమి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగితే.. ప్రతి ఒకటి లేదా రెండేళ్లకు వడగాల్పులు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. అంతేకాకుండా ధృవప్రాంతాల్లో మంచు వేగంగా కరిగి, సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోనున్నాయి.
అడ్డుకునేందుకు ప్రత్యామ్నాయం..?
గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయవచ్చని ఈ నివేదిక తెలిపింది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్ఘారాలను జీరోకి తీసుకువచ్చినా గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీలకు చేరే అవకాశాలు మూడింట రెండొంతులు ఉంటుంది. ఒకవేళ 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడంలో మూడింట ఒక వంతు మాత్రమే అవకాశాలు ఉంటాయని ఐపీసీసీ నివేదిక రూపొందించిన వాళ్లలో ఒకరైన డాక్టర్ ఫ్రెడ్రిక్ ఓటో తెలిపారు.
ఉద్ఘారాలను తగ్గించడం ద్వారా గాలి నాణ్యత త్వరగా మెరుగుపడే అవకాశాలు ఉన్నా.. ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉండటానికి 20, 30 ఏళ్ల సమయం పడుతుందని ఈ నివేదిక తెలిపింది. గ్లోబల్ వార్మింగ్‌ను పరిమితం చేయడానికి కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, ఇతర గ్రీన్‌హౌజ్ వాయువులు వాతావరణంలోకి వెలువడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నదని ఓటో తెలిపారు.
క్లైమెట్ రిపోర్ట్ ఎలా రూపొందిస్తారంటే..
ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (×ూజజ) వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తుంది. గతానికి చెందిన, భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ ముప్పుల గురించి తన వద్ద నిక్షిప్తం చేస్తున్నది. యునైటెడ్ నేషన్స్‌కు చెందిన వరల్డ్ మెటిరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో), ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ)లు సంయుక్తంగా ఐపీసీసీని ఏర్పాటు చేశాయి. 1988లో ఐపీసీసీని ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల్లో ఉన్న శాస్త్రీయతను అధ్యయనం చేసేందుకు ఈ ప్యానెల్‌ను నియమించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. ప్రభుత్వాలు తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తుంటాయి. గ్లోబల్ వార్మింగ్‌పై తటస్థ పద్ధతిలో, సైన్స్ ఆధారిత అప్‌డేట్స్‌ను ప్రజాప్రతినిధులకు తెలియజేస్తుంది. వాతావరణ మార్పుల్లో ఉండే సమస్యలు.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఐపీసీసీ తన నివేదికలో చెబుతుంది. ఐపీసీసీలో ప్రస్తుతం 195 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. ప్రస్తుతం దక్షిణ కొరియాకు చెందిన హీసంగ్ లీ దానికి బాధ్యతలు వహిస్తున్నారు.