Oct 01,2020 07:39

కరోనాకు ముందే దేశం ఆర్థికంగా దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో అనూహ్య పరిణామాలు, పర్యవసానాలు సంభవిస్తున్నాయి. గత కొద్ది నెలలుగా చూస్తే మీడియాలో వాటి గురించి చర్చ ఎక్కువ జరిగిందా? సినీ తారల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించారా? వ్యవసాయ సంస్కరణలు అతి పెద్దవని ప్రభుత్వమే చెప్పింది. వాటి మంచి చెడ్డల గురించి కేంద్రీకరించాలా? తారల మాదక ద్రవ్యాల గురించి ఎక్కువ చర్చ చేయాలా?
ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణలు తమను పాతి పెట్టటానికే దారితీస్తాయని అర్ధమైన రైతులు ఈనెల 25వ తేదీన దేశ వ్యాపితంగా ఆందోళన జరిపారు. జాతీయ స్ధాయిలో ఒకే ఒక్క ఎన్‌డి టీివీ ఛానల్‌ మాత్రమే ఎక్కువ మంది చూసే (ప్రైమ్‌ టైమ్‌) సమయాన్ని రైతుల ఆందోళన, చర్చలకు కేటాయించింది. మిగతా చానళ్లు మాత్రం దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరుల పార్టీలు, వాటిలో సేవించారని చెబుతున్న మాదక ద్రవ్యాలు, వాటిని ఎవరితో కలసి సేవించారనే అంశాల గురించి మల్లగుల్లాలు పడ్డాయి. ఏమాత్రం ఆకర్షణ లేని రైతులను, వారి సమస్యలను చూపితే అనవసరంగా పాలక పార్టీల ఆ గ్రహానికి గురికావటం తప్ప ఛానళ్లకు ఒరిగేదేముంది?
'ఇండియా టుడే' టీవీ ప్రైమ్‌ టైమ్‌లో...దీపిక, సారా, శ్రద్ధ కపూర్‌కు కొత్తగా సమన్లు ఇవ్వలేదు, ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్‌ సింగ్‌ మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని సారా చెప్పిందని, ఐదు గంటల పాటు ప్రశ్నించినా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు దీపిక అంగీకరించలేదంటూ కాలం గడిపారు. 'టైమ్స్‌ నౌ' ఛానల్లో చైనా, పాకిస్తాన్‌ అనూహ్యమైన కాలం అనే అంశం గురించి చర్చ జరిపారు. మన భూమిని మన దేశం స్వాధీనం చేసుకుందా? చైనా, పాక్‌ తప్పుదారి పట్టించే ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవాలి అంటూ చర్చ చేశారు.
రిపబ్లిక్‌ టీవీ, రిపబ్లిక్‌ భారత్‌ టీవీలు...సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్య మాదక ద్రవ్యాల దర్యాప్తుకు దారి తీసిన విధానాల మీద కేంద్రీకరించాయి. ఎన్‌డి టీవీ కూడా మాదక ద్రవ్యాల విచారణ గురించి చర్చించింది. అయితే 'మాదక ద్రవ్యాల గురించి ఎంత శ్రద్ధ?' అనే ఇతివత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆజ్‌తక్‌ టీవీ విషయానికి వస్తే తాను మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు దీపిక అంగీకరించినట్లు తెలిసిందని నివేదించింది. ముగ్గురు తారలు సమాధానాలు ముందుగానే సిద్ధం చేసుకొని వచ్చారని, ఎన్‌సిబి వాటితో సంతృప్తి చెందలేదని చెప్పింది. అంతే కాదు. సుశాంత్‌ సింగ్‌తో కలసి సారా అలీఖాన్‌ ఎన్నిసార్లు థాయలాండ్‌ వెళ్లింది, ఎన్నిసార్లు అతని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించింది అనే ప్రశ్నలతో మరో కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఏ రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఎలా ఆందోళన జరిపారనే సమాచారం కంటే ఇవి పసందుగా ఉంటాయి కదా!
హిందీ మీడియా బిజెపి కనుసన్నలలో పని చేస్తున్నదా అన్నట్లుగా రైతుల ఆందోళన పట్ల వ్యవహరించిందని పరిశీలకులు పేర్కొన్నారు. రైతులకు మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలను తూలనాడుతూ పాలక బిజెపి నేతలు ఉపయోగించిన భాష, పదజాలాన్ని స్వంతం చేసుకొని ఆ విమర్శలు సరైనవే అని పాఠకులకు నూరిపోసేందుకు ప్రయత్నించాయి. ప్రభుత్వం ముందుకు తెచ్చిన బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ ప్రారంభం నుంచీ పాలక పార్టీకి అనుకూలమైన శీర్షికలతో పాఠకుల ముందుకు వచ్చాయి. రాజ్యసభ మర్యాద మంటగలిసింది అని 'దైనిక్‌ జాగరణ్‌', రాజ్యసభలో మర్యాద ఉల్లంఘన అని 'రాష్ట్రీయ సహారా', భంగపడ్డ పార్లమెంట్‌ మర్యాద అంటూ 'హిందూస్ధాన్‌' పత్రికలు శీర్షికలు పెట్టాయి. దాదాపు అన్ని పత్రికలు ప్రతిపక్షాలను ప్రతినాయకులుగా చూపేందుకు పోటీ పడ్డాయి. ప్రతిపక్షాలు అదుపు తప్పి వ్యవహరించాయని తమ స్వంత కథనాల్లో ఆరోపించాయి. బిల్లుల గురించి ప్రతిపక్షాలు ఏం చెప్పాయో పాఠకులకు అందచేయాలన్న కనీస ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. టెలిగ్రాఫ్‌ పత్రిక మాత్రం 'మూజువాణితో బిల్లులకు ఆమోదం-మూగబోయిన ప్రజాస్వామ్యం' అంటూ విమర్శనాత్మక శీర్షిక పెట్టింది.
పార్లమెంట్‌ సమావేశాల వార్తలను సేకరించేందుకు అన్ని ప్రధాన స్రవంతి మీడియా విలేకర్లు ప్రత్యక్షంగా వెళతారు. మైకులను పని చేయకుండా నిలిపివేసినపుడు ఏం మాట్లాడిందీ వినలేకపోవచ్చుగానీ సభలో ఏం జరుగుతోందీ ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. రాజ్యసభలో ఓటింగ్‌ నిర్వహించాలన్న డిమాండ్‌ జరిగిన అంశాలపై పాలక బిజెపి లేదా దాని అనుచర, భజన పార్టీలు బయట చర్చల్లో ఎలా అయినా చిత్రీకరించి మాట్లాడవచ్చు. కానీ మీడియా సభ్యులు స్పీకర్‌ ఎలా అణచివేసిందీ ప్రత్యక్షంగా చూశారు. అయినా వార్తల్లో భిన్నంగా ఎందుకు రాసినట్లు? ప్రతిపక్షాన్ని ఎందుకు నిందించినట్లు? రాజ్యసభలో పాలకపార్టీ ఒక పథకం ప్రకారమే మైకులను నిలిపివేయించిందన్నది స్పష్టం. దానికి నిరసన వ్యక్తమైంది. పాలక పార్టీ మైకులను నిలిపివేయగానే ప్రతిపక్ష సభ్యులు కేకలు వేశారు. ఏమిటి అని అడగాల్సిన స్పీకర్‌ అలాంటిదేమీ చేయకుండా మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించేశారు. రభస జరిగినపుడు ప్రతిపక్ష సభ్యులు ఏం అడిగారో ఏమిటో విలేకర్లు వివరణ తీసుకోవచ్చు. అది చట్టసభల వార్తలను సేకరించే వారికి సాధారణ విషయమే. వార్తలను ఏకపక్షంగా రాయకుండా తమ వ్యాఖ్యలను జోడించకుండా రెండు వైపుల వారు ఏం చెప్పిందీ రాయవచ్చు. కానీ వ్యవసాయ బిల్లుల సమయంలో అలా జరగలేదు.
రాజ్యసభలో జరిగిన పరిణామాల గురించి సంపాదకీయాలు రాసిన ఆంగ్ల పత్రికలన్నీ సభ ఉపాధ్యక్షుడు హరివంశ నారాయణ సింగ్‌ ఓటింగ్‌కు తిరస్కరించిన తీరును తప్పుపట్టాయి. వ్యవసాయ బిల్లులను సమర్ధించిన 'హిందూస్ధాన్‌ టైమ్స్‌' పత్రిక సైతం సభలో పాలక పార్టీ వ్యవహరించిన తీరును తప్పుపట్టక తప్పలేదు. బిల్లులను సెలెక్టు కమిటీకి పంపాలన్న డిమాండ్‌ను ఆమోదించి ఉండాల్సిందని పేర్కొన్నది.
తమ గోడును కేంద్రానికి వినిపించండంటూ చేసిన రైతుల వేడుకోళ్లను మీడియా పట్టించుకోలేదు. సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్య కేసుతో ప్రమేయం ఉందన్న ఆరోపణలున్న ఒక నటి చెప్పిన సమాచారం పేరుతో బాలీవుడ్‌ తారలను ప్రశ్నించేందుకు మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో పిలిపించింది. విచారణకు పిలిపించినంత మాత్రాన వారు నేరం చేసినట్లు కాదు. కనీసం నిందితులు కూడా కాదు. కానీ మీడియా చేస్తున్న హడావుడి, వార్తలు ఇస్తున్న తీరు తమ పరువును మంటగలుపుతున్నాయని... ప్రశ్నించటం పూర్తయి, తగు చర్య తీసుకొనేంత వరకు ఆ విషయాలు మీడియాలో రాకుండా చూడాలని... హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అంతకు ముందే సంయమనం పాటించాలని కోర్టు చెప్పిన తరువాత కూడా మీడియా దాన్ని ఉల్లంఘించిందని, తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన గోప్యతను మంటగలుపుతున్నారని, తాను విచారణ అధికారులకు అందచేసిన ప్రకటనను కోర్టు కనుక పరిశీలిస్తే తన మీద ఎలాంటి తప్పుడు ప్రచారం జరుగుతోందో అర్ధం అవుతుందని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.
రైతుల సమస్యలను విస్మరించి...సినీతారల మీద కేంద్రీకరించిన మీడియా గురించి సామాజిక మాధ్యమంలో తీవ్ర విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సినీతారల వ్యక్తిగత నడవడి లేదా దురలవాట్ల గురించి కొత్తగా మీడియా చెప్పాల్సిందేమీ లేదు. అందరికీ తెలిసిందే. ఎందరో జీవితాలను నాశనం చేసుకున్నారు. ఆ మాటకు వస్తే రాజకీయం, మీడియా ప్రతి రంగంలోనూ అలాంటి అవాంఛనీయ ధోరణులతో ప్రవర్తించేవారు ఉన్నారు. మీడియా రాజకీయ నేతల మీద కేంద్రీకరిస్తే...అధికారంలో ఉన్న పెద్దలు సిబిఐ, ఇ.డి, ఎన్‌ఐఏ, ఆదాయ పన్ను శాఖలను మీడియా సంస్ధల మీదకు దించుతారు. ఇవాళ మీడియా యజమానులు-రాజకీయ నేతలు 'మీకది, మాకిది' అన్నట్లుగా పంచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో దీపికా పదుకొనే ని గంటల తరబడి విచారించిన తీరు మీద చేసిన హడావుడిని చూస్తే...అటు రేటింగ్‌ పెంచుకోవటంతో పాటు పాలకపార్టీ పెద్దలను సంతప్తి పరచేందుకు మీడియా పెద్దలు ప్రయత్నించారా అనిపించక మానదు.