రైతువాణి డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతువాణి మాసపత్రిక చందాదారుల డైరీ, క్యాలెండర్‌లను ఆదివారం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మూలి.వెంగయ్య, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గంటా లక్ష్మీపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మూలి వెంగయ్య మాట్లాడుతూ రైతులే మన సమాజానికి వెన్నెముక మనం తినే ఆహారాన్ని అందజేసేవారి ఫలితంగా దేశంలోని మొత్తం జనాభా రైతుల పైన ఆధారపడి ఉందన్నారు. అది చిన్న దేశమైనా, అతి పెద్ద దేశమైనా వాటి వల్ల మనం భూగోళంపై జీవించగలుగుతున్నాం కాబట్టి రైతులు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు అని తెలిపారు. రైతులకు చాలా ప్రాముఖ్యత ఉన్నప్పటికీ వారికి సరైన జీవితం లేదని, సమాజంలో రైతులకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. రైతు సౌభాగ్యమే తమ ధ్యేయమంటూ ప్రభుత్వాలు జోలపాటలతో రైతుల్ని మభ్యపెడుతున్నాయని విమర్శించారు. అలుపెరగని శ్రామికుల్లా రైతులు బతుకుపోరు చేస్తూ జాతికి ఆహారాన్ని అందిస్తుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారికి బిచ్చగాళ్లగా చేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతుల సంఘటనై ఉద్యమించాలని రైతులను కోరారు. కౌలు రైతు సంఘ ఉపాధ్యక్షులు లక్ష్మీపతి ఆత్మకూరు తాలూకాలో రైతాంగ పోరాటాల గురించి పూర్వకాలంలో పుచ్చలపల్లి సుందరయ్య, గంగా చిన్న కొండయ్య, మోటపోతుల శంకరయ్య తదితర రైతు నాయకులు ఆత్మకూరు రైతాంగానికి మార్గ దర్శకత్వం నిర్వహించి రైతాంగ పోరాటాలను జరిపారన్నారు. ప్రస్తుతం ఆ రోజుల కన్నా ఘోరమైన పరిస్థితులు దేశంలో అలముకొన్నాయని, రైతాంగం కదిలి దేశాన్ని రక్షించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, మాజీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చేవూరు రామకృష్ణారెడ్డి, చెర్లో సుబ్బరామిరెడ్డి, అహ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైతు సంఘం నాయకులు కృష్ణప్రసాద్‌ను పలువురు సన్మానించారు.










