ప్రజాశక్తి-వాల్మీకిపురం/పీలేరు : ఎన్‌హెచ్-71 మదనపల్లి-పీలేరు నాలుగు లైన్ల జాతీయ రహదారి విస్తరణ కోసం భూములు కోల్పోయిన రైతులు నష్టపోకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ గిరీష అన్నారు. జాతీయ రహదారి కోసం తమ వద్ద తీసుకున్న భూములకంటే అదనంగా ఎన్‌హెచ్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వలన తాము భూములను అధికశాతం కోల్పోయామని బాధిత రైతులు గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం మండలంలోని తాటిగుంటపల్లి, మూరేవాండ్లపల్లి పంచాయతీలకు సంబంధించిన భూములను స్థానిక రెవెన్యూ అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణలో సర్వే నెంబర్ 595, 596, 624లో ఉన్న ఇండ్లు, గుడి, మసీదు జాగాకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న భూముల కంటే అదనంగా ఎన్‌హెచ్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వలన తాము నష్టపోయామని రైతులు కలెక్టర్‌కు వాపోయారు. దీంతో పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ మురళి, తహశీల్దార్ ఫిరోజ్ ఖాన్, సర్వేయర్ శ్రీనివాసులు, ఆర్‌ఐ బాబ్జి, రెవెన్యూ సిబ్బంది, బాధిత రైతులు పాల్గొన్నారు.
అనంతరం పీలేరు మండలంలోని బోడంవారిపల్లెలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోడంవారిపల్లెలో 50 మంది జాతీయ రహదారికి భూములు కోల్పోయే బాధితులు ఉన్నారన్నారు. వీరందరూ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకొని తర్వాత మీకు నష్టపరిహారం సరిపోకపోతే ఆర్బిట్రేషన్ సమర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ రవి, సర్పంచ్ నటశేఖర్, మండల సర్వేయర్, ఎన్‌హెచ్ ఎఐ సైట్ ఇంజనీర్లు వెంకటరమణ, శ్రవణ్ కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.










