పుట్టపర్తి అర్బన్ : రైతులకు విరివిగా రుణాలు అందించి పంట సాగుకు ప్రోత్సహించేలా బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళిక, బ్యాంకులు సాధించిన ప్రగతి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, పంపిణీని బ్యాంకర్లు వేగవంతంగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు వెంటనే పురోగతి సాధించేలా ప్రత్యేక దష్టి సారించాలన్నారు. రైతులకు పంట రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కౌలు రైతులకు, స్టాండప్ ఇండియా, పీఎం ముద్ర యోజన కింద రుణాలు, వీవర్స్‌కు, పశుసంవర్ధక, మత్స్య రైతులకు రుణాలు అందించడంలో మరింత పురోగతి చూపించాలన్నారు. వివిధ పథకాల కింద డీఆర్డీఏ, మెప్మా పరిధిలో చిరు వ్యాపారులకు అందించే రుణాల లక్ష్యం చేరుకోలేదని, వెంటనే అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి పంపిణీ చేసేలా చూడాలన్నారు. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తు చేశారు, అవుత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలన్నారు, టిడ్కోగహాలు, ఇతర గహా నిర్మాణ పథకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, రంగాలకుసంబంధించి రుణాల మంజూరు చాలా పెండింగ్ ఉందని, వెంటనే కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. రుణాల మంజూరులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేలా కషి చేయాలని తెలిపారు. కేటాయించిన లక్ష్యాలను మార్చి 31వ తేదీ నాటికి పూర్తిగా వంద శాతం చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఐసిసిఐ జిల్లా కోఆర్డినేటర్ సభ్యులు కెవి.రమణ, ఆర్‌బిఐ ఏజీఎం అనిల్ కుమార్, రవిచంద్ర రెడ్డి, ఎల్‌డిఎం సాయినాథ్ రెడ్డి, కెనరా బ్యాంకు ఏజీఎం రాంప్రసాద్ రెడ్డి, ఎస్‌బిఐ ధర్మవరం ఆర్‌ఎం సంజీత్ కుమార్, యుబిఐ బ్యాంక్ ఎజిఎం అశ్వర్థ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, ఆఆర్డీఎ పీడీ నర్సయ్య, సెరికల్చర్ జేడీ పదమ్మ తదితరులు పాల్గొన్నారు.










