Apr 09,2023 21:55

జిల్లా భూ రికార్డుల సర్వే శాఖ సహాయ సంచాలకులు టి . జయరాజ్‌


జిల్లాలోని రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూ రీసర్వే చేస్తున్నట్లు జిల్లా భూ రికార్డులు, సర్వే శాఖ సహాయ సంచాలకులు టి. జయరాజ్‌ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాల్లో రీ సర్వే ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ముఖా ముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ? సర్వేయర్లు ఎంతమంది ఉన్నారు?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 30 మండలాలున్నాయి. రెవెన్యూ గ్రామాలు 470 ఉన్నాయి . మండల సర్వేయర్లు 39 మంది, విలేజ్‌ సర్వేర్లు 400 మంది ఉన్నారు.
భూ రీ సర్వే ఎన్ని గ్రామాలలో జరుగుతోంది?
భూ రీ సర్వే 2019వ సంవత్సరంలో ప్రారంభించాం. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 109 గ్రామాలలో భూ రీ సర్వే నిర్వహించాం. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం నిర్దేశించిన ఏడాది లోపల భూ రీ సర్వే జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
భూ రీ సర్వే పూర్తయితే ఎలంటి సమస్యలు పరిష్కారమవుతాయి?
భూ రీసర్వే జరిగిన తరువాత భూమిపై 100 శాతం సమస్యలు పరిష్కారమవుతాయి. గంటల వ్యవధిలో సమస్య పరిష్కారం అవుతాయి. సర్వే అంటే భయపడాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగా హద్దు చేరిపేస్తే మారిపోతుందనుకునేవి భ్రమలుగా తొలగిపోతాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా పక్కా సర్వే జరిగుతుంది. ఒక్క సారి రీ సర్వే జరిగిందంటే ఆ భూమి రికార్డులు పదిలంగా ఉంటాయి. మ్యూటేషన్లు, ఇలా ఎన్ని సార్లు భూములు బదలాయించినా రికార్డులు మాత్ర తారుమారు అయ్యే ఆస్కారం ఉండదు. భవిష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు.
సర్వే సమయంలో రైతుల నుంచి సమస్యలు ఏమైనా తలెత్తాయా?
కొన్ని ప్రాంతాలలో రైతు రికార్డులు ఉన్నంతవరకు భూముల రీ సర్వే చేసి తమ పేర్ల పైన నమోదు చేయాలంటున్నారు. వారు ఎంత అనుభవిస్తున్నారు, రీ సర్వే చేసి వారి పేరుతో రికార్డులో నమోదు చేస్తున్నాం. కావున అక్కడక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆర్డీవో, తహశీల్దార్‌, స్థానిక విఆర్వోల సహకారంతో సమస్యలు పరిష్కరించేందుకు కషి చేస్తున్నాం. జిల్లాలో చెప్పుకోదగ్గ సమస్యలైతే లేవు.
సర్వే చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనా?
భూ యజమాని తన భూమిని కొనాలన్నా, స్థలం చూపించాలన్నా అర్జీ పెట్టుకోవాలి. ప్రభుత్వానికి నేరుగా డిడి, చలానా రూపంలో రూ.2 వేల భూమి కొలతల మేర చలానా చెల్లించాలి. ఇది మినహా సర్వేయర్‌ అదనంగా ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్రీజర్‌ రీ సర్వేలో రాళ్లు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా డబ్బులు అడిగినట్లు తమ దష్టికి తీసుకొస్తే వారి పైన చర్యలు తీసుకుంటాం.
సిబ్బంది కొరత సమస్య ఏమైనా ఉందా?
గతంలో భూ రికార్డుల సర్వే శాఖలు సిబ్బంది కొరత ఉండేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి సచివాలయానికీ ఒక సర్వేయర్‌, మండలానికి మరో సర్వేయర్‌ ఉన్నారు. అర్జీలు వచ్చిన వెంటనే ఆ గ్రామ సచివాలయ సర్వేర్‌ కొలతలు వేస్తున్నారు సిబ్బంది కొరతతో ఎలాంటి సమస్య లేదు .