Feb 28,2023 22:27

రైతు భరోసా సాయం మెగా చెక్కును అందిస్తున్న వ్యవసాయ అధికారులు

         పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా రైతులకు రైతు భరోసా, పిఎం కిసాన్‌ సాయాన్ని అందజేశారు. మంగళవారం నాడు పుట్టపర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం సమావేశ మందిరంలో 2022-23 ఏడాదికి సంబంధించి రైతు భరోసా - పిఎం కిసాన్‌ మూడవ విడత నగదు పంపిణీ, 2022 డిసెంబర్‌లో మాండోస్‌ తుపాన్‌ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్‌ సబ్సిడీ పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో రైతు భరోసా - పిఎం కిసాన్‌ కింద అర్హులైన 2,68,947 మంది రైతులకు రూ.56.54 కోట్ల మెగాచెక్‌ను జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు, తదితరులు రైతులకు పంపిణీ చేశారు. డిసెంబర్‌ 2022లో మాండోస్‌ తుఫాన్‌ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 226 మంది రైతులకు రూ.19.37 లక్షల చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ రైతులకు సాగు ఖర్చు కింద పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ ప్రభుత్వం సాయం అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్‌, సిరికల్చర్‌ జెడి పద్మమ్మ, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, డీఆర్సీ డిడి రామనాయక్‌, శాస్త్రవేత్త రామసుబ్బయ్య, రైతులు పాల్గొన్నారు