కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రభావ రహితం చేసేందుకు, రైతుల ప్రయోజనాలు కాపాడే రీతిలో పంజాబ్ శాసనసభ మూడు బిల్లులను, ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం ముదావహం. వ్యవసాయ చట్టాలపై చర్చించడానికి ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సమావేశాలకు శాసనసభలో ఉన్న ఇద్దరు బిజెపి సభ్యులు గైరుహాజరవడం ఆ పార్టీ రైతు వ్యతిరేకతకు నిదర్శనం. కేంద్ర చట్టాల స్థానంలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం ప్రత్యేక నిబంధనలు మరియు పంజాబ్ సవరణ బిల్లు (2020), ధరల హామీకి సంబంధించి రైతుల ఒప్పందం మరియు వ్యవసాయ సేవల బిల్లు (2020), అత్యవసర వస్తువుల (ప్రత్యేక నిబంధనలు మరియు పంజాబ్ సవరణ) బిల్లు (2020) పేర్లుతో బిల్లులను శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అధికారంలోని కాంగ్రెస్, ప్రతిపక్ష అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ బిల్లుల ఆమోదంలో ఒక్క తాటి పైకి రావడం సంతోషకరం. ఈ మూడు బిల్లుల ఆమోదం అనంతరం 2.5 ఎకరాల్లోపు గల రైతులు రుణగ్రస్తులైనప్పటికీ వారి భూమిని జప్తు చేయడానికి వీలు లేదంటూ మరో బిల్లును శాసన సభ ఆమోదించడం మంచి విషయం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర బిల్లులను వ్యతిరేకించినందున తమ ప్రభుత్వాన్ని తొలగిస్తారని కొందరు అంటున్నారని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని, అవసరమైతే తన పదవికి రాజీనామా చేయడానికైనా వెనుకాడనని చెప్పడం అభినందనీయం. అయితే, అసెంబ్లీలో బిల్లులు, తీర్మానం ఆమోదంతోపాటు సి.ఎం ప్రకటన కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చేస్తున్న ఆందోళన ఫలితమేనన్నది మరువరాదు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం చేయబోయే సుదీర్ఘ న్యాయ పోరాటానికి తాము తీసుకున్న చర్యలు ప్రాతిపదికగా ఉంటాయని అన్నారు. కేంద్ర చట్టాలను వ్యతిరేకిస్తూ ఆప్ ఎంఎల్‌ఏలు సభలో ఆందోళన చేశారు. నల్ల టోపీలతో సమావేశాలకు హాజరయ్యారు. సోమవారం రాత్రంతా వారు సభలోనే ఉన్నారు. సభకు అకాలీదళ్ పార్టీ ఎమ్మెల్యేలు ట్రాక్టర్లపై రావడం కూడా రైతాంగ ఆందోళనకు ప్రతిబింబమే! శాసన సభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి, రాష్ట్రపతికి పంపితే, ఆయన కూడా ఆమోదముద్ర వేస్తేనే ఆచరణలోకి వస్తాయి. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ కుదురు నుండి వచ్చిన పెద్దలిద్దరూ ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రైతు సంక్షేమ దృష్టితో ఆ బిల్లులను ఆమోదిస్తారని ఆశించడం కష్టమే! అయినా పంజాబ్ ఎంఎల్‌ఏలు పట్టుదలతో నవంబర్ రెండు నుండి ఐదవ తేదీ లోపు రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నించడం స్వాగతించ దగినది.
కేంద్ర ప్రభుత్వం దేశంలో సేకరించే వరి ధాన్యం, గోధుమల్లో 32 శాతం పంజాబ్ నుండే సమకూరుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు మద్దతు ధరలు లభిస్తున్నాయి. కేంద్రం తాజా చర్యల మూలంగా ఆ సౌకర్యం పోతుందనే బాధ, ఆవేదనతోనే రైతులు, ప్రజలూ ఆందోళన చేస్తున్నారని అందరూ అర్ధం చేసుకోవాలి. త్వరలోనే రాజస్థాన్ అసెంబ్లీ కూడా పంజాబ్ మాదిరిగా తీర్మానం, బిల్లులను ఆమోదించేందుకు సన్నద్ధమవుతుండడం మంచి పరిణామం. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. కాబట్టి వ్యవసాయ సంబంధిత అంశాలపై ఆయా రాష్ట్ర అసెంబ్లీలకే నిర్ణయాధికారం వుంటుంది. రైతులు అనుభవిస్తున్న ఉచిత విద్యుత్‌కు హాని కలుగుతుందని భావించి కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ చట్ట సవరణలపై ఇటీవల తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రభావ రహితం చేసేలా తీర్మానం, అవసరమైన బిల్లులూ చేసేందుకు చర్యలు చేపట్టాలి. అయితే పార్లమెంటులో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి రెండు పార్టీలూ కేంద్ర చట్టాలను బలపరిచాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ తరహాలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టాలు చేస్తుందని ఆశించగలమా?










