ప్రజాశక్తి - వన్‌టౌన్ : కనకదుర్గమ్మ దేవస్థానం మహామండపానికి వెళ్లే కనకదుర్గానగర్ దారిలో రెండు వైపులా గత కొంత కాలం క్రితం దేవస్థానం అధికారులు ఏర్పాటుచేసిన పెర్గోలా రాతి మండపాన్ని తొలగిస్తున్నారు. ఈ తొలగింపు పనులను దుర్గగుడి అధికారులు సోమవారం ప్రారంభించారు. దేవాదాయ శాఖ అధికారుల ఆదేశం మేరకు 2018లో అప్పటి ఆలయ ఇఓ కోటేశ్వరమ్మ వీటిని సుమారు రూ.5.5 కోట్లతో ఏర్పాటు చేశారు. తాజాగా వీటి తొలగింపు పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇఓలు మారినప్పుడల్లా ఇలా ఏదోఒకటి కూల్చివేస్తున్నారని విమర్శిస్తున్నారు. దీంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే దుర్గగుడిపై ఉన్న అన్నప్రసాద భవనాన్ని పడవేసిన అధికారులు...దానిని దేవస్ధానం కింద ఓ అద్దె భవనంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇలా అనాలోచిత నిర్ణయాల వల్ల దేవస్థానం సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొద్దిరోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో కనకదుర్గానగర్‌లో రాతి మండపం తొలగింపు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేసేముందు దేవస్థానం అధికారులు ముందూ వెనుకా ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు.










