గత ఆరు మాసాలుగా రాష్ట్రమంతా కరోనాతో అల్లాడిపోతున్నది. ముఖ్యంగా రెండు మాసాలుగా వ్యాధి విజృంభిస్తున్నది. ఇది ప్రకటించని 'సామాజిక వ్యాప్తి'గా మారింది. దీన్ని సకాలంలో విస్తరించకుండా అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా మోడీ హడావుడిగా రాత్రికి రాత్రి లాక్‌డౌన్ ప్రకటించడంతో సత్ఫలితాలు రాకపోగా వ్యాధి మరింతగా విస్తరించింది. లాక్‌డౌన్‌తో లక్షలాది పరిశ్రమలు మూతబడ్డాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి వీధుల్లో పడ్డారు. జనం వృత్తులు కోల్పోయారు. వీళ్ళను ఆదుకోవడానికి కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇదేమంత పెద్ద జబ్బు కాదని...పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని చెప్పారు. కానీ అనూహ్యంగా కరోనా విస్తరణలో మన రాష్ట్రం రెండవ స్థానంలోకి, మరణాల్లో మూడో స్థానంలోకి చేరింది. టెస్టులు ఎక్కువ చేసినందువల్ల కేసుల సంఖ్య పెరిగిందని సమాధానం చెబుతున్నారు. కానీ టెస్టుల సంఖ్యతో నిమిత్తం లేకుండా మరణాల సంఖ్య ఎందుకు పెరుగుతున్నదో వారి దగ్గర సమాధానం లేదు.
కేంద్రానికి సాగిల
కరోనాకు ముందే వచ్చిన ఆర్థిక మాంద్యం ఇప్పుడు దేశాన్ని పతనం వైపు నడిపిస్తున్నది. ఈ కష్టకాలంలో మన రాష్ట్రానికి ఏ సహాయం చేయకపోగా అప్పు తెచ్చుకోవడానికి కూడా అన్యాయంగా షరతులు పెడుతున్నది. ఈ సంస్కరణలు అమలు చేస్తేనే కొత్తగా అప్పులు చేయడానికి అనుమతినిస్తామని కేంద్రం షరతు విధించింది. దానితో హడావుడిగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడానికి సమాయత్తమయింది. ఇప్పుడు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని హామీ ఇచ్చినా మీటర్లు పెట్టి నగదు బదిలీ చేయడమంటే రైతు మెడపై కత్తిని వేలాడదీయడమే. మీటర్లు, నగదు బదిలీ వ్యవసాయానికి ఉరితాడని గతంలో ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేడు అధికారం లోకి వచ్చాక దాన్నే అమలు చేస్తున్నది. కేంద్రాన్ని సంతృప్తి పర్చడానికి అందరికన్నా ముందే దీన్ని అమలు చేస్తున్నారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతోనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేస్తే ఆయన వర్థంతి సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి దాన్ని ఎత్తివేసేందుకు పునాది వేశారు. ఇప్పటికే మన రాష్ట్రానికి బిజెపి ఎనలేని హాని చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన హామీలు అమలు జరపలేదు. జిఎస్టీ నిధులూ ఇవ్వలేదు. ఇంత హాని చేస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా సాగిలపడుతున్నారు. ఇది రాష్ట్రానికి, ప్రజలకు నష్టం. రైతాంగం నడ్డివిరిచే మూడు వ్యవసాయ బిల్లుల్ని, విద్యుత్ బిల్లు, సహకార బ్యాంకుల బిల్లుల్ని పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండూ బలపర్చాయి.
ప్రజలపై భారాలు
కరోనాలో కష్టాలు పడుతున్న ప్రజానీకానికి నవరత్నాలే సమాధానంగా మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. అవి కూడా కొంత మందికి సరిగ్గా అందక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రజలపై అదనపు భారాలను మోపుతున్నారు. కేంద్రం పెట్రోలు, గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రం ఇసుక ధర పెంచింది. దాంతో నిత్య జీవితావసర ధరలు పెరగడమేగాకుండా నిర్మాణ పనులు పోయాయి. లక్షలాది భవన నిర్మాణ కార్మికులు వీధులపాలయ్యారు. లాక్‌డౌన్ పేరు చెప్పి యజమానులు కార్మికులకు జీతాలివ్వకుండా ఇళ్ళకు పంపించేశారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న ఆర్టీసి అవుట్ సోర్సింగ్ కార్మికులు, ప్రభుత్వ అవుట్ సోర్సింగ్, ప్రయివేటు టీచర్లు, లెక్చరర్లు, స్టాఫ్‌కు గత ఐదు మాసాలుగా జీతాలు లేవు. వీరంతా బతుకుదెరువు కోసం వీధులకెక్కారు. రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి అప్పులు చేయడంతో పాటు ప్రజలపై యూజర్ ఛార్జీల భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ప్రతి మండలంలో రెండు గ్రామాల చొప్పున ఎంచుకొని చెత్త సేకరణకు రోజుకు రెండు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నది. పట్టణాల్లో చెత్త పన్నుతోపాటు ఆస్తిపన్ను కూడా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కృష్ణా, గోదావరికి వరదలు పోటెత్తి ఆస్తి, పంట నష్టం జరిగినా ఎలాంటి సహాయం అందలేదు. గత సంవత్సరం వరదల్లో దెబ్బతిన్నవారికి కూడా ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదు. నిర్మాణం పూర్తయి ఖాళీగా ఉన్న ఇళ్ళను లబ్ధిదారులకు అందించకుండా కాలయాపన చేస్తున్నారు. రేషను బియ్యం బదులు నగదు బదిలీ చేస్తామంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సారథ్యంలోని మానిటరింగ్‌సెల్ కనీసం ఒకసారి కూడా సమావేశమై సమీక్షించలేదు.
ఎక్కే మెట్లు - దిగే మెట్లు
ప్రజా సమస్యలను విస్మరించి అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వివాదాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. సిఆర్‌డిఏ, రాజధాని వికేంద్రీకరణ బిల్లులపై స్టే, ఎన్నికల కమిషన్ పున:నియామకం, తెలుగు మీడియం, శాసనమండలి రద్దు, మానవ హక్కుల ఉల్లంఘనలపై కోర్టు ప్రతికూల తీర్పులిచ్చినా దిద్దుకోవడానికి బదులు లిటిగేషన్లు కొనసాగిస్తున్నది. రాష్ట్ర పాలన ఎక్కే మెట్లు, దిగే మెట్లు అన్నట్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నది.
బిజెపి మతోన్మాదం
మోడీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్ళించడానికి బిజెపి కొత్త యత్నాలను మొదలుపెట్టింది. కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకరిని నియమించి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా రాష్ట్ర రాజకీయాల ఎజెండాను మతం మీదకు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నది. వీరి దుష్ట పథకాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రం లోని ప్రాంతీయ పార్టీలు కూడా సహకరిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ చర్యలకు మద్దతునిస్తూ, ఇటు రాష్ట్రంలో బిజెపితో రాజీ పడుతున్నది. దీన్ని అలుసుగా తీసుకున్న బిజెపి ఇష్టానుసారం చెలరేగుతున్నది. కేంద్ర ప్రభుత్వం అండ, రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీల పరోక్ష తోడ్పాటును బిజెపి అవకాశంగా మలచుకోవాలని చూస్తున్నది. దానికి మతాన్ని సాధనంగా వాడుకుంటున్నది. అంతర్వేదిలో రథం కాలిపోయిన దుర్ఘటనను ఉపయోగించుకొని హిందువుల మనోభావాలను రెచ్చగొట్టేందుకు వెనువెంటనే రంగంలోకి దిగింది.
దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నది. జరిగిన ఘటనలపై వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంలో వెనకబడుతోంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బిజెపి దీన్ని వాడుకుంటున్నది. ఆర్‌ఎస్‌ఎస్ శాఖలన్నీ మత విద్వేషాలు రగల్చడంలో నిండా మునిగిపోయాయి. వీరి పథకానికి జనసేన ఒక పనిముట్టుగా మారింది. ధర్మ దీక్షలు పేరుతో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా తెలుగుదేశం కూడా రంగంలోకి దిగింది. ఈ మూడు పార్టీలు మతాభిమానాలను ఉపయోగించుకొని రాజకీయంగా లాభపడాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో క్రైస్తవ రాజ్యం నడుస్తున్నదని బిజెపి ప్రచారం చేస్తున్నది. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, తెలుగుదేశం ఏకంగా ఒక కరపత్రాన్నే ప్రచురించింది. తెలుగుదేశం ప్రచారమంతా బిజెపి ఎజెండాను ముందుకు నెట్టడానికే తోడ్పడుతుంది. లౌకిక పార్టీగా వున్న టిడిపి ఈ రకంగా మతోన్మాద భావాలను ప్రేరేపించడం రాష్ట్ర రాజకీయాలకు ఎనలేని హాని చేస్తుంది. ఎలాగోలా బలపడాలనే ఆదుర్దాలో తమకు తెలియకుండానే బిజెపి ఎదుగుదలకు తోడ్పడుతున్నది. ఆఖరికి అది భస్మాసుర హస్తం లాగా తెలుగుదేశం పతనానికే దారితీస్తుంది. గత ఆరేళ్లలో బిజెపి పెత్తనానికి దాసోహమన్న ప్రాంతీయ పార్టీలకు ఇదే గతి పట్టింది. ప్రజల రోజువారీ సమస్యలు తీసుకొని పని చేస్తే తెలుగుదేశం మనుగడ నిలబడుతుంది తప్ప ఇలా చౌకబారు రాజకీయాలకు లోబడిపోతే ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది.
ప్రజా సేవలో సిపిఐ(యం)
రాష్ట్రంలో బిజెపి మతోన్మాదాన్ని, ఆర్థిక సంస్కరణలను ధైర్యంగా ఎదిరించి నిలబడుతున్నది వామపక్ష పార్టీలు మాత్రమే. అందువలనే వామపక్షాలపై బిజెపి నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తున్నది. కేంద్ర నాయకత్వంపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని, కమ్యూనిస్టులపై తప్పుడు ప్రచారం చేసి అప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నది. కరోనాలో అత్యంత ఆదర్శంగా నిలబడ్డ కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బదీయడం లక్ష్యంగా బిజెపి పని చేస్తున్నది.
కరోనా కష్టకాలంలో సిపిఐ(యం), వామపక్షాలు ప్రజల్ని అంటిపెట్టుకొని ధైర్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలను పొందుతున్నది. ప్రజా సమస్యలపై స్పందించి కరోనా నిబంధనలకు లోబడి ఆందోళనలు చేస్తున్నది. తద్వారా దేశ రాజకీయాలకు మార్గనిర్దేశం చేస్తున్నది. బిజెపి మతోన్మాద దూకుడును నిలువరించేందుకు వామపక్షాల ఎదుగుదల మాత్రమే పరిష్కారం. నేడు దేశ రాజకీయాలు ఒక మూల మలుపులో ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో టిడిపి విఫలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ దగ్గర భిన్నమైన విధానాలు లేవు. ఈ స్థితిలో బిజెపి తిరోగమనవాదమా? లేదా వామపక్షాల పురోగమన విధానాలా? అన్నదాన్నిబట్టి రాష్ట్ర రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. బిజెపి విధానాలు రాష్ట్రాన్ని పతనం వైపు నడిపిస్తే...వామపక్ష రాజకీయాలు పురోగమనం వైపుగా నడుస్తాయి. ఏ దిశలో నడవాలో రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి.
* వి. శ్రీనివాసరావు (వ్యాసకర్త సిపి(ఐ)ఎం కేంద్రకమిటీ సభ్యుడు)










