కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్ర ప్రయోజనాలు ప్రమాదంలో పడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలతో దేశం తిరోగమనంలో పయనిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఆ పార్టీ వారం రోజుల పాటు చేపట్టిన ప్రచార ఉద్యమంలో భాగంగా నెల్లూరు వచ్చిన ఆయన ‘ప్రజాశక్తి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో అమలవుతోన్న ప్రమాదకర విధానాలు ప్రజల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు బిజెపి పట్ల అవకాశవాదంగా వ్యవహరిస్తున్నందున రాష్ట్రంతో పాటు, ప్రజా ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించటంలో సిపిఎం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. ఇంటర్వ్యూ ఇలా సాగింది...
ఈ ప్రచారోద్యమం ద్వారా ప్రజలకు ఏం చెప్పనున్నారు ?
రాష్ట్ర రాజకీయాల్లో ప్రమాదకర ధోరణులు ప్రవేశించాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇలాంటి అంశాలు కొత్త రాష్ట్రానికి కీలకమైన విషయాలు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల అమలులో కేంద్రం వెనక్కుపోయింది. దానితోపాటు కేంద్ర ప్రభుత్వం ఈకాలంలో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు చేపట్టింది. వ్యవసాయం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మధ్యతరగతి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు హాని చేసే విధానాలను కేంద్రం లోని బిజెపి అమలు చేస్తుంది. ఈ విధానాలను ప్రజలకు వివరిస్తాం. పోరాటాలకు సిద్ధం చేస్తాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు ఏమిటి, వాటి ప్రభావం ఏమిటి ?
నరేంద్ర మోడీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రైల్వే ప్రయివేటీకరణ ప్రకటించారు. అడవులు, ప్రభుత్వ రంగ సంస్థలను, బొగ్గు, ఇన్సూరెన్స్ లను ప్రయివేటీకరణ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్‌ను 'పోస్కో' అనే కంపెనీకి భూములిచ్చి జాయింటు వెంచర్ పేరుతో ప్రయివేటుకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో మూడు చట్టాలు తీసుకొచ్చింది. కార్పొరేట్లకే వ్యవసాయాన్ని కట్టబెడుతోంది. వీటివల్ల రైతులకు న్యాయమైన గిట్టుబాటు ధర రాదు. వాల్‌మార్ట్, రిలయన్స్ ఫ్రెష్ లాంటి కంపెనీలకు మేలు జరుగుతుంది. ధరల స్థిరీకరణ నిధులున్నా రైతులకు న్యాయం జరగలేదు. నెల్లూరు జిల్లాలో ఎందుకూ ఉపయోగపడలేదు. మిర్చి, పసుపు, ఉల్లిపాయలకు ఎందుకు ధరలు రాలేదు.
రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలరాయ బడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. గిరిజనులు, దళితులకు రక్షణ కరువైంది. మనుధర్మ సిద్ధాంతం అమలు చేస్తుంది. అగ్రకుల దురహంకారాన్ని ప్రోత్సహిస్తుంది. యు.పి లో అత్యాచారం జరిగితే ఏం చేసిందో చూశాం. సామాజిక న్యాయం, దేశ స్వావలంబన ఎలా ఇబ్బందుల్లో పడుతున్నదీ, మతోన్మాదం వంటి అంశాలను ప్రజలకు వివరిస్తాం. అలాగే 29 కార్మిక చట్టాలను దెబ్బ తీశారు. కార్మికులు సమ్మె చేసే హక్కులు తీసేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనుభవిస్తున్న హక్కులను దెబ్బతీశారు. ఈ అంశాలనూ చెప్తాం.
కరోనా సమయంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనిపై ఏమంటారు ?
ధరల పెరుగుదల రూపంలో కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన దాడి జరుగుతోంది. ధరల విషయంలో పార్లమెంట్‌లో నిత్యావసర ధరల చట్టానికి సవరణ తీసుకొచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, వాల్‌మాల్ట్, రిలయన్స్ వంటి సంస్థలకు అవకాశం కల్పించింది. అందుకే ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే కేంద్రం మొగ్గుతోంది.
ఎల్‌ఐసి, రైల్వే, బ్యాంకుల ప్రయివేటీకరణ అంశంపై ఏమంటారు ?
దీనిని తిప్పికొట్టాలి. లేదంటే స్వావలంబన దెబ్బ తింటుంది. 151 రూట్లలో 141 రైళ్లును ప్రయివేటు వ్యక్తులకు ఇస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఆ రైళ్లు వస్తాయి. టికెట్ల అమ్మకంలో అమెజాన్ వంటి గుత్త సంస్థలకు అవకాశం ఇస్తున్నారు. రైల్వే, మైనింగ్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ ప్రయివేటీకరణ వల్ల ప్రజలపై రానున్న రోజులు పెద్దఎత్తున భారాలు పడనున్నాయి. దీనిని ప్రజలకు వివరిస్తాం.
ప్రచారోద్యమం ఎప్పటి వరకు సాగుతుంది ?
రాష్ట్ర వ్యాపితంగా ఈనెల 15 వరకు ప్రచారోద్యమం జరుగుతుంది. గ్రామ గ్రామాన, పట్టణ ప్రాంతాల్లో ఈ రోజు ప్రారంభమైంది. ఆనాటి నుంచి జాతీయోద్యమ స్ఫూర్తిని మళ్లీ ప్రజలకు గుర్తు చేసేందుకుగాను ఎక్కడికక్కడ గాంధీ, అంబేద్కర్ వంటి జాతీయోద్యమ నేతల విగ్రహాలకు పూల మాలలు వేసి ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం.
రాష్ట్రంలో నవరత్నాలు అమలు చేస్తున్నాం. ప్రజలు ఆనందంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది కదా, ఇప్పుడు మీ ఉద్యమాలు ఎందుకు ?
నవరత్నాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయి. కాని కేవలం సంక్షేమంతోనే ప్రజల జీవనంలో పెద్ద మార్పు రాదు. రాష్ట్రం ముందుకు పోదు. వ్యవసాయంలో రైతులకు, పరిశ్రమల్లో కార్మికులకు ఆదాయం పెరగాలి. అది జరగడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించాలి. నెల్లూరు జిల్లాలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ప్రభుత్వం పుట్టికి రూ.15,590 గిట్టుబాటు ధర ప్రకటిస్తే రైతులకు కేవలం రూ.9 నుంచి రూ.10 వేల వరకే దక్కింది. బ్రోకర్లు, దళారులు కోట్ల రూపాయలు కాజేశారు. కార్మికుల ఆదాయాలు పెరగకుండా సంక్షేమ పథకాలతో మాత్రమే పెద్దగా ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో 70 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. కనీస వేతనాల అడ్వయిజరీ బోర్డు నియమించారు. ఇప్పుడు అది లేదు. ఎప్పటికప్పుడు దీనిని పునరుద్ధరించాలి. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి హయాంలో బోర్డు ఉండేది. ఇప్పుడు అది లేదు. కర్ణాటకలో రూ.12 వేలు కనీస వేతనం వుంటే మన రాష్ట్రంలో అది రూ.5 వేలే. అదే కేరళలో రూ.18 వేలు వుంది.
రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలతో బిజెపి బలపడే అవకాశం ఉందంటారా ?
బిజెపి కేంద్రంలో అధికారం అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంతర్వేది సంఘటనే అందుకు ఉదాహరణ. దుండగులు తగులపెడితే దానిని వదిలేసి, హిందువులు, క్రిస్టియన్ల మధ్య వివాదంగా చేసింది. టిడిపి సైతం ఈ ప్రచారాన్ని తలకెత్తుకుంది. వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. బిజెపి మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది పోయి మద్దతుగా నిలిస్తే, బిజెపి బలపడడానికి అవకాశం ఇస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయి.
రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన బిజెపికి అనుకూలంగా వ్యవహరించడానికి కారణాలు ఏమంటారు ?
ఈ మూడు పార్టీలు తమ తాత్కాలిక ప్రయోజనాలకోసం ఇలా చేస్తున్నాయి. కేంద్రం బెదిరిస్తే, భయపడుతున్నారు. అకాలీ పార్టీ ఒకప్పుడు బిజెపితో కలిసి పని చేసింది. ఆ స్నేహం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు తెగబడి ఎన్‌డిఎ, బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. మహారాష్ట్రలో శివసేన అనుభవం కూడా అదే. అలాంటి పరిస్థితే ఇక్కడి పార్టీలకూ వస్తుంది. కేంద్ర విధానాల వల్ల ప్రజలపై పడుతున్న భారాలకు ఆ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అప్పుడు ఈ పార్టీలన్నీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వ్యతిరేకత నుంచి బయట పడడానికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి శాంతింపజేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. టిడిపి తన ఉనికిని కాపాడుకోడానికే బిజెపి కి అనుకూలంగా ఉంటుందని కొందరంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటున్నా దాని విడిచిపెట్టి హైకోర్టుతో ప్రత్యక్ష ఘర్షణ, ఎన్నికల సంఘం, కార్యాలయాలకు రంగులు, రాజధాని వంటి వివాదాల చుట్టూ వైసిపి, టిడిపి తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం వంటి అంశాలు పక్కకు పోతాయి. ప్రజల ప్రయోజనాలు పక్కకు పోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టులో కేంద్రం మెలిక పెట్టింది. పూర్తి కావాలంటే ఏం చేయాలి ?
వాస్తవంగా చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. రూ.56 వేల కోట్ల ఖర్చు అంచనా. రూ.20 వేల కోట్లు ప్రాజెక్టుకు, మిగిలింది పవర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఖర్చు చేయనున్నారు. కేంద్రం రూ. 20 వేల కోట్లు మాత్రం ఇస్తానని, మిగిలింది తనకు సంబంధం లేదనేలా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌లో చేసిన చట్టాలకు విలువ లేకుండా చేస్తోంది. వైసిపి అన్ని పార్టీలను కలుపుకొని పోలవరం నిధుల కోసం పోరాటం చేసి సాధించుకోవాలి. అందుకు టిడిపి కూడా సహకరించాలి. అందుకు భిన్నంగా ఈ రెండు పార్టీలూ...ఇలాంటి పరస్పర రాజకీయ విమర్శలు చేసుకుంటూ, అసలు విషయం పక్కన పెడుతోన్నాయి. ఇది రాష్ట్రానికి నష్టం.
రాజధాని వివాదంపై మీ పార్టీ వైఖరి ఏమిటి ?
ఈ అంశంపై సిపిఎం ముందు నుంచీ స్పష్టంగా వుంది. చంద్రబాబు నమూనాలో అమరావతి ప్రతిపాదన ఆచరణయోగ్యం కానిదని ఏవిధంగా ఆనాడే చెప్పి ల్యాండ్ పూలింగ్ వద్దని వారించామో, అదేవిధంగా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదన కూడా సరైనది కాదని, అమరావతి లోనే రాజధానిని కొనసాగించాలని ఇప్పుడూ చెప్తున్నాం. హైకోర్టు కర్నూలులో వుండడానికి అభ్యంతరం లేదని కూడా ప్రకటించాం. అమరావతి రాజధానిని కొనసాగిస్తూ భూములిచ్చిన రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.










