Apr 04,2023 21:11

విద్యుత్‌ వెలుగుల్లో ఒంటిమిట్ట రామాలయం


నేడు ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
ప్రజాశక్తి - ఒంటిమిట్ట : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట విద్యుత్‌ దీపాలతో, ఆకాశమంత పందిళ్లతో కళకళలాడుతోంది. ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుంచి స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు యాత్రికులు ఒంటిమిట్ట చేరుకున్నారు. కళ్యాణశోభను ఒంటిమిట్ట సంతరించుకుంది. రామనామ స్మరణతో ఏకశిలానగరం మారుమ్రోగుతోంది. విఐపిల రాక, పోలీసుల బందోబస్తుతో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు నూతన శోభను సంతరించుకుంది. ఏకశిలానగరిలో బుధవారం రాత్రి నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయం విద్యుత్‌ దీపపు ధగధగలతో దేదిప్యమానంగా ముస్తాబైంది. నబూతో నభవిష్యతి అనేరీతిలో విద్యుత్‌ కాంతుల మధ్య ఆకాశమంత చలువపందిళ్లతో కళకళ లాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి జగదబిరాముని కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు, యాత్రికులు, సేవకులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. జగదభిరాముని ఆలయంలోని దత్తమండపం, ధ్వజస్తంభం, కల్యాణవేదిక విద్యుత్‌ కాంతులతో కల్యాణశోభను సంతరించుకుంది. పలువురు మంత్రులు, విఐపిలు రానున్నారు. సుమారు రెండు వేల మంది పోలీసులు అడుగడుగునా మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజునాటికి కల్యాణ ఘడియలు సమీపించడంతో పలువురు భక్తులు, పర్యాటకులు, యాత్రికులు, సేవకులు కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ఎదురు చూస్తున్నారు. ఒంటిమిట్ట గ్రామ శివారులోని కల్యాణ వేదిక, దత్తమండపం, కోదండ రామాలయం విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా ప్రకాశిస్తోంది. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గతానికి భిన్నంగా భారీఎత్తున ప్రత్యేక బారీకేడ్లను ఏర్పాటు చేశారు. కల్యాణోత్సవాన్ని జయప్రదం చేయడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లను చేయడం గమనార్హం. బుధవారం రాత్రి చంద్రుని వెన్నెల్లో జరిగే కల్యాణోత్సవానికి పలువురు దాతలు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీతారాముల కల్యాణం అనంతరం టిటిడి యంత్రాంగం లక్షలాది మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది.
గరుడ వాహనంపై సీతాపతి
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 9 గంటల వరకు జరగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్‌, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, మాన్యుస్క్రిప్ట్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఎఇఒ గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనంజయ పాల్గొన్నారు.
శ్రీసీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ
బుధవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను మంగళవారం సమర్పించారు. 180 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద డెప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, అర్చకులు శ్రావణ్‌ కుమార్‌ సమక్షంలో అందించారు. ఈ తలంబ్రాల కోసం ఆరు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి నాలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తిభావంతో మూడు నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా భద్రాద్రి రామునికి, ఆరేళ్లుగా ఒంటిమిట్ట రామునికి కల్యాణోత్సవం సందర్భంగా అందజేస్తున్నామని కళ్యాణ అప్పారావు తెలిపారు.