Apr 26,2023 21:42

ఫొటో : మాట్లాడుతున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

రాజకీయాలపై ప్రజల అసంతృప్తి
- గుణవంతులకు ఓట్లు వేసి గెలిపించండి
- మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాజకీయాలపైనా, రాజకీయ నాయకులపైనా.. ప్రజలందరికీ అసంతృప్తి పెరుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని శ్రీధర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశం బిజెపి నాయకులు కుడుముల సుధాకర్‌ రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరి మురళి కన్నబాబు ఏర్పాటు చేశారు. వెంకయ్య నాయుడు గతంలో ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల నుంచి శాసనసభ్యునిగా పోటీచేసి ఉండటం వల్ల ఈ ప్రాంతంలో పలువురు పరిచయాలు ఉండటంతో పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చి శాలువాలతో పూలబొకేలతో సన్మానించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాలలో నైతిక విలువలు పెరిగేలా ఓటు అనే ఆయుధంతో గుణవంతులను ఎన్నుకోవాలని తెలిపారు. ధనాన్ని, కులాన్ని కాకుండా గుణాన్ని చూసి ఓట్లు వేసి చట్టసభలకు పంపాలని చట్టసభలలో మంచి భాష మాట్లాడాలని ప్రజలకు ఉపయోగపడే వాటి గురించి చర్చించాలని అప్పుడే రాజకీయాలకు విలువలు ఉంటాయన్నారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో హుందాగా వ్యవహరించడంతో పాటు సభను సచావుగా నిర్వహించిన తృప్తి ఉందన్నారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరు మురళి కన్నబాబు మాట్లాడుతూ గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో లక్ష జనాభా ఉన్న మున్సిపాలిటీలకు టిడ్కో గృహాలు మంజూరు అనుమతులు లేకుండా ఆయన అప్పట్లో చొరవచూపి ఆత్మకూరు పట్టణానికి 1028 టిడ్కో గృహాలు మంజూరు చేయించారని అందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. టిడ్కో గృహాల మంజూరైన వారు ఫ్లకార్డులు ప్రదర్శించి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కర్నాటి ఆంజనేయులు రెడ్డి, సురేందర్‌ రెడ్డి, కరటంపాటి సుధాకర్‌, తాళ్లూరి గిరి నాయుడు, ముని రెడ్డి, దావా పెంచలరావు, నందా ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు.