- కా|| మానికొండ సూర్యావతి శత జయంతి సంవత్సరం
ఈ సంవత్సరం అమరజీవి కామ్రేడ్ మానికొండ సూర్యావతి శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. వందేళ్ల క్రితం కృష్ణా జిల్లా ఇందుపల్లి గ్రామంలో జన్మించిన సూర్యావతి జాతీయోద్యమ కాలంలో ఉద్యమాలు, పోరాటాలతో మహిళల్లో నూతనోత్తేజాన్ని నింపారు. బ్రిటీష్ ప్రభుత్వం పోవాలనీ, దేశానికి స్వాతంత్య్రం కావాలనీ సాగుతున్న ఉద్యమంలో మహిళల్ని సమీకరించే కృషిలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు. అన్ని రకాల ఒత్తిళ్ళను తట్టుకొని నిలబడ్డారు. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు 1944లో బ్రిటీష్ పాలకులు సూర్యావతిని నిర్బంధించి కడలూరు జైలుకు పంపారు. అయినా ఆమె రాజకీయ సంకల్పం చెదరలేదు. జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమ కృషిలో మునిగి తేలారు. సొంత ఆస్తిని పార్టీకి ఇచ్చి తన అవసరాలు తగ్గించుకొని పూరిపాకలో నివసిస్తూ పార్టీకి సేవలందించారు. ఆస్తి మీద మమకారం వదులుకొని విప్లవ కర్తవ్యానికి అంకితమయ్యారు.
ఒక ఇంటర్వ్యూలో సూర్యావతి తన గురించి చెబుతూ 1937లో కాటూరులో జరిగిన మహిళా రాజకీయ శిక్షణా శిబిరం తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని తెలిపారు. 1943లో విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం ప్రజల పక్షాన నిలవడానికి గాఢమైన రాజకీయ విశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. భూస్వాములు, పెత్తందార్ల ప్రభావం కింద సమాజంలో మహిళలు ఘోషా పాటించాల్సి వచ్చేదని చెప్పారు. మహిళలకు చదువు అవసరం లేదనే వెనుకబడ్డ భావజాలం రాజ్యమేలుతున్న రోజుల్లో మహిళల విద్యాభివృద్ధికి, వితంతు వివాహాలకు అనుకూలంగా, బాల్య వివాహాల నివారణకు 1936 నుండి మహిళా సంఘాల ద్వారా కృషి సల్పినట్లు పేర్కొన్నారు. మరుగుదొడ్లు, ప్రసూతి సౌకర్యాలు కావాలనీ, పురుషులతో సమానంగా ఆస్తిలో హక్కులు ఉండాలని పోరాడినట్లు తెలిపారు. ఆమె తన 72వ ఏట మరణించే వరకు పేద ప్రజల విముక్తి కోసం, మహిళాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి సల్పారు.
రాజకీయ నిబద్ధత
కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్య్రం నినాదాన్నిచ్చి వర్గ ప్రాతిపదికన కార్మిక, రైతు సంఘాలను నెలకొల్పి పోరాడుతున్న రోజులవి. స్వరాజ్యమంటే భారతదేశ ఆర్థిక, సామాజిక విముక్తి అన్న పూర్తి చిత్రాన్ని కమ్యూనిస్టులు ఇచ్చినప్పుడు కమ్యూనిస్టు సిద్ధాంతంవైపు సూర్యావతి ఆకర్షితులయ్యారు. కమ్యూనిస్టులు బ్రిటీష్ వ్యతిరేక పోరాటంతో మేళవించి భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని సాగించడం సూర్యావతి మీద రాజకీయంగా బలమైన ముద్ర వేసింది. ఈ నేపథ్యం లోనే దేశ స్వాతంత్య్రం ముందు ఆస్తులు, కుటుంబ ప్రయోజనాలు అంత ముఖ్యం కాదని పూర్తికాలం కార్యకర్త అయి మహిళా ఉద్యమానికి అంకితమయ్యారు. అత్త బుల్లెమ్మ కమ్యూన్‌లో సేవలు, భర్త కామ్రేడ్ మానికొండ సుబ్బారావు పూర్తికాలం పార్టీ కార్యకర్తగా 20 రూపాయల అలవెన్సుతో పార్టీ కృషికి అంకితమయ్యారు. రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక కొత్త ఒరవడిలో భాగమయ్యారు. 1970లో నేను విజయవాడ కేంద్రానికి వచ్చే నాటికి వారు పూరి పాకలో ఇద్దరు కుమార్తెలతో జీవించడం చూశాను. నేను వచ్చిన తొలి రోజుల్లో మా ఇంటికి వచ్చి నా భార్య సుమతి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం మానికొండ సుబ్బారావు గారి ద్వారా జరిగేవి. కొత్త ఒరవడిలో కమ్యూనిస్టు ఉద్యమం శాఖోపశాఖలుగా విస్తరించింది.
శ్రేయోభిలాషుల సంశయం
ఒకప్పుడు జాతీయోద్యమంలో భూసంస్కరణలు, కౌలు రైతుల హక్కులు, దళితులు, గిరిజనులకు సామాజిక న్యాయం, భూముల మీద రక్షణ లాంటి సమస్యల కోసం పోరాటంలో కమ్యూనిస్టులు గర్వించదగిన పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమేగాదు, మునగాల పరగణా జమిందారీ వ్యతిరేక పోరాటం, మందస, వెంకటగిరి జమిందార్లు, రాజులు లాంటి దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా ముందుండి పోరాడింది కమ్యూనిస్టులే. ఈ పోరాటాల్లో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర జాతీయోద్యమంపై గొప్ప ప్రభావం చూపింది. కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతమైంది. అలాగే స్వాతంత్య్రానంతరం పూర్వపు జమిందారీలు రద్దయినా ఫ్యూడల్ వ్యతిరేక ప్రజాతంత్ర ఎజెండా అసంపూర్తిగా మిగిలినప్పుడు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పాలకులు దాన్ని పూర్తి చేయడానికి నిరాకరించినప్పుడు కమ్యూనిస్టులు నికరంగా నిలబడి పోరాడారు. దేశ భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో కార్మిక - కర్షక సమస్యలను జాతీయ రాజకీయ వేదిక మీదకు తీసుకువచ్చి ఆర్థిక, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా వర్గ ప్రాతిపదికన ఉద్యమాలకు పూనుకున్నారు. భూసంస్కరణలు, పంచాయతీ వ్యవస్థ బలోపేతం, సమాఖ్య విధానం లాంటి వాటి మీద ఉద్యమాలు సాగించారు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టు ఉద్యమం స్వాతంత్య్రానంతర కాలంలోనూ బలపడ్డది. బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ ఇటీవల కాలంలో కమ్యూనిస్టులు ఎందుకు బలహీనపడ్డారన్నది అందరి ప్రశ్న. బెంగాల్, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రజా పునాది దెబ్బతిన్నది. పార్లమెంటులో బలం తగ్గింది. కేవలం ఈ రాష్ట్రాల్లోనే కాదు. దేశవ్యాపితంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎందుకు తగ్గిందన్నది శ్రేయోభిలాషుల ప్రశ్న. మానికొండ సూర్యావతి శత జయంతి సందర్భంగా ప్రజల సందేహాలను నివృత్తి చేసి రాజకీయ లక్ష్యానికి పునరంకితం కావాలి.
బలహీనపడడానికి కారణాలు
భారత ప్రభుత్వాన్ని బడా బూర్జువా నాయకత్వంలోని బూర్జువా-భూస్వామ్య కూటమిగా కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యక్రమం పేర్కొన్నది. విదేశీ పెట్టుబడులతో దాని మిలాఖత్తు అంతకంతకూ పెరుగుతున్నదని అంచనా వేసింది. కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ 1991 తరువాత మరింత బలోపే తమైంది. పెట్టుబడి కేంద్రీకరణకు, బడా బూర్జువా వర్గం పట్టు బలపడేందుకు ఇది దారితీసింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ భూస్వామ్య వ్యవస్థ వడివడిగా పెరిగింది. భూస్వాములు, ధనిక రైతులు, కాంట్రాక్టర్లతో కూడిన గ్రామీణ ధనికవర్గం, గ్రామీణ వ్యాపారవర్గాల మధ్య అనుబంధం ఏర్పడింది. దేశంలో పాలకవర్గాలు పెట్టుబడిదారీ భూస్వాము లతో కలిసి బూర్జువా భూస్వామ్య పాలన సాగించడం, విదేశీ ఫైనాన్సు పెట్టుబడికి సహకరించడం దేశ ప్రజల జీవనం మీద విపరీతమైన ప్రభావం చూపింది. ప్రయివేటీకరణతో దేశ స్వావలంబనకు ప్రమాదం వచ్చింది. నయా-ఉదారవాద విధానాలు అమలు లోకి వచ్చిన తరువాత భూసేకరణ వంటి సమస్యలపై కొన్ని సందార్భల్లో సరైన వైఖరి తీసుకోలేక పోయాం. సరళీకరణ విధానాల అమలుతో ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ అభివృద్ధికి అవరోధంగా తయారైంది. నయా-ఉదారవాద మార్కెట్ విధానాలతో మితవాద రాజకీయాలు పుంజుకొన్నాయి. కమ్యూనిస్టుల, వామపక్షాల ప్రజా పలుకుబడిపై బలమైన ప్రభావం చూపాయి.
వినాశకర పెట్టుబడిదారీ వ్యవస్థపై (సరళీకరణ) పోరాడేందుకు కావలసిన వ్యూహాలను నిర్ణయించుకోవడంలో అవసరమైన దానికంటే ఎక్కువ సమయమే తీసుకున్నామని 21వ అఖిలభారత మహాసభ (విశాఖపట్నం) ఆత్మవిమర్శ చేసుకున్నది. సరళీకరణ విధానాల అమలులో వివిధ తరగతులపై ప్రభావాన్ని గమనించడంలో వెనకబడడమేగాక ఆ తరగతుల ఉద్యమాల్లోనూ తగినంత కృషి సల్పలేకపోయాం. పార్లమెంటరీ సంస్థల్లో మతోన్మాద శక్తుల్ని ఓడించడం అవసరమే అయినా, ఈ ఎన్నికల కృషిలో నిమగమై ఉద్యమాలు, పోరాటాలపై, వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయ శక్తులను కూడగట్టడంపై తగినంత దృష్టిని కేంద్రీకరించలేక పోయాం. అందుకే 21వ మహాసభ వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని పిలుపునిచ్చింది.
బలపడ్డానికి మార్గం
బలహీనపడుతున్న ప్రజా పునాదిని బలోపేతం చేసుకోవడానికి వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయమే ప్రథమ ప్రాధాన్యత అన్నది గుర్తెరిగి పోరాడడమే కీలకం. వామపక్షాల స్వతంత్ర బలం జాతీయోద్యమ రోజుల్లోనూ, స్వాతంత్య్రానంతరం భూసంస్కరణలు, సమాఖ్య విధానం, సామాజిక న్యాయం లాంటి సమస్యలమీద పోరాడిన రోజుల్లోనూ పెరుగుతూ వచ్చింది. అర్థ ఫాసిస్టు బీభత్సకాండను, ఎమర్జెన్సీ నిరంకుశత్వాన్ని సిపిఐ(ఎం) ఎదిరించి పోరాడి నిలిచింది. మతోన్మాద వ్యతిరేక రాజకీయ వారసత్వం ఫలితంగా దేశ విభజన నేపథ్యంలో కమ్యూనిస్టులు లౌకికతత్వాన్ని కాపాడ్డంలో స్థిరమైన శక్తిగా ఉంటూ వచ్చారు. కానీ మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని సరళీకరణ ఆర్థిక విధానాల వ్యతిరేక పోరాటాలతో జోడించి ఉద్యమాలు సాగించడంలో వెనకబడడంతో, మతోన్మాద శక్తులు పుంజుకున్నాయి. లౌకిక రాజ్యంలో ప్రభుత్వం, మతం రెండూ వేరు వేరుగా ఉండాలన్న నిబంధనను ద్రవ్య పెట్టుబడి ప్రోత్సాహంతో పాలక వర్గ పార్టీలు వక్రీకరించాయి. ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యం లోనే కామ్రేడ్ మానికొండ సూర్యావతి శత జయంతి ఉత్సవాల్లో...వామపక్ష ప్రత్యామ్నాయం ప్రథమ ప్రాధాన్యత...అన్న రాజకీయాలకు మనం పునరంకితమవుదాం.
/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
పెనుమల్లి మధు











