Oct 22,2020 07:33


అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి నేటికి (అక్టోబర్‌ 22) ఐదేళ్ళు పూర్తయ్యాయి. రాజధానికి భారీగా నిధులు ప్రకటిస్తారని ప్రజలు ఆశపడ్డారు. కానీ ఢిల్లీ నుండి మోడీ చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తెచ్చారు. ప్రజల నోట్లో మోడీ మట్టి కొట్టారని ఈనాటికి అర్థమయింది. అమరావతికి కేంద్రం నిధులు ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ తీస్తూనే ఉంది. వైసిపి ప్రభుత్వం అసలుకే ఎసరు పెట్టింది. రాజధానిని ముక్కలు చేసే పేరుతో అమరావతికి గండి కొట్టింది. రాజధానినీ వివాదం చేసింది. బిజెపి తెర వెనక ఉండి నాటకమాడిస్తున్నది.
తప్పు పాలకులది, శిక్ష ప్రజలకా?
2014 ఎన్నికల్లో అద్భుత రాజధాని అంటూ బిజెపి, టిడిపిలు లబ్ధి పొందాయి. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ నిధులతో రాజధాని నిర్మాణం పాక్షికంగా సాగింది. రాజధాని నిర్మాణంతో పాటే అక్రమాలు, అవకతవకలు అంతర్భాగం అయ్యాయి. సింగపూర్‌ బడా కంపెనీలకు భూములు కట్టబెట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తాయి. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించి మహా నగరం నిర్మిస్తామని ప్రజలలో ఆశలు రేకెత్తించారు. తప్పులను సరి చేసి మరింత సమర్థవంతంగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని ముందుకు సాగిస్తామన్న వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం మరిన్ని తప్పులు చేస్తోంది. అక్రమాలపై విచారణ జరపాలి. కోర్టులు అడ్డుకోరాదు. ఈ ప్రభుత్వం తప్పులు చేసినవారిని శిక్షించడం వదిలేసి అమరావతి ప్రజలకు శిక్ష వేస్తోంది. రాజధాని నిర్మాణ నమూనా మార్చొచ్చు, కానీ రాజధాని స్థలాన్ని మార్చడం, నిర్వీర్యం చేయటం ఈ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. మెగా రాజధాని నిర్మాణానికి నిధులు లేవని వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోంది. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన కేంద్రాన్ని నిలదీయకుండా వైఎస్‌ఆర్‌ పార్టీ వారితో జత కట్టి రాజధానికి, రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. గత ప్రభుత్వం 'సింగపూర్‌ తరహా రాజధాని' పేరుతో ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించే ప్రయత్నం చేస్తే, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం 'దక్షిణాఫ్రికా మోడల్‌' పేరుతో మూడు ముక్కలు చేసి చిందరవందర చేస్తున్నది. ఈ రెండు నమూనాలు కాదు, ఆంధ్రప్రదేశ్‌ తరహా 'ప్రజా రాజధాని' కావాలి. ఈ పరిణామాలతో కేంద్రం లోని బిజెపి సర్కార్‌ మహదానందంగా ఉంది. రాజధాని వివాదంతో నిధులు అడిగే వారే ఉండరు. రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రగిలితే అందులోంచి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి దుష్ట ఆలోచనలు చేస్తున్నది.
వికేంద్రీకరణ అంటే ముక్కలు చేయడం కాదు
వికేంద్రీకరణ అంటే ఉన్న రాజధానిని దెబ్బకొట్టి ముక్కలు చేయడం కాదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయడం, స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చి, నిధులు బదలాయించి అభివృద్ధి రాష్ట్రమంతటా సాగించడం వికేంద్రీకరణ స్ఫూర్తి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా, విభజన చట్టం ప్రకారం వెనకబడిన ప్రాంతాలకు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీతో సహా పరిశ్రమలు, ప్రాజెక్టులు సాధిస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం. కానీ హోదా, నిధుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రంతో కుమ్మక్కు కావటం వికేంద్రీకరణకు తోడ్పడుతుందా? రాష్ట్రాల హక్కులను హరించి ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కు అవుతున్న వైసిపి, టిడిపి లకు వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడ ఉంది?
గత టిడిపి ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్నాం అంటూనే వైసిపి ప్రభుత్వం గత ప్రభుత్వ దారిలోనే నడుస్తున్నది. భూ సమీకరణను గత ప్రభుత్వాన్ని మించి రాష్ట్రమంతటా అమలు చేస్తోంది. నాడు సింగపూర్‌, నేడు బోస్టన్‌ వంటి విదేశీ కంపెనీలకు కన్సల్టెన్సీ పేరుతో కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు. అక్రమాలు, అవినీతి, భూ కుంభకోణాలు, దుబారా ఖర్చులలో గత ప్రభుత్వం దారిలోనే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా నడుస్తున్నది.
కష్టాల కడలిలో అమరావతి ప్రజలు
అమరావతి రాజధానితో అమరావతి లోని రైతులందరూ కోటీశ్వరులు అయిపోయారని, ప్రజలందరూ బాగా లబ్ధి పొందారనే అపోహ ఉంది. రాజధానితో లబ్ధి పొందింది అప్పుడు, ఇప్పుడు పాలక పార్టీల నేతలు, కొద్దిమంది వ్యక్తులే. కానీ రాజధాని అమరావతి లోని అత్యధిక మంది పేదలు, కూలీలు, కార్మికులు, దళితులు, వృత్తిదారులు, రైతులు, కౌలు రైతులు నష్టపోయారు. ఒకవైపు వ్యవసాయం లేక, మరోవైపు రాజధాని కార్యకలాపాలు లేక పూర్తిగా దెబ్బతిన్నారు. చట్టబద్ధంగా ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోలేదు. రాజధాని వాసులు అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం అమరావతి ప్రజలపై కక్ష సాధించినట్లుగా వ్యవ హరిస్తున్నది. ఎన్నికలకు ముందు మంచి రాజధాని నిర్మిస్తాం, రాజధాని వాసులకు మేలు చేస్తామని హామీ ఇచ్చి వాటిని గాలికొదిలేశారు.
భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన కౌలు కోసం పోరాడిన ఆర్నెల్లకు గాని ఇవ్వలేదు. భూములిచ్చిన రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ఒప్పందం చేసి ఐదేళ్లు గడిచినా అభివృద్ధి చేయలేదు. భూమి లేని ప్రజలకు నెలనెలా ఇచ్చే రాజధాని పెన్షన్‌ రూ.2500 నుండి రూ.ఐదు వేలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఒక నయా పైసా పెంచలేదు. దళితులు, బలహీన వర్గాలకు సంబంధించిన అసైన్డ్‌ రైతుల భూములకు గత ప్రభుత్వం తక్కువ ప్యాకేజీతో వివక్షత చూపింది. అదనంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఒక గజం కూడా అదనంగా ఇవ్వలేదు. మంచి ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు. గతంలోనూ వచ్చింది నామమాత్రమే. ఇప్పుడు ఉన్న ఉపాధి కూడా పోయింది. రాజధాని మార్పుతో నిర్మాణాలు ఆగిపోయాయి. కనీసం సొంతంగా నిర్మించుకున్న ఇళ్లల్లో అద్దెకు వచ్చే వారు కూడా కరువయ్యారు. కాంట్రాక్టు ఉద్యోగాలు ఊడబీకుతున్నారు. పారిశుధ్య సిబ్బందికి ఏడు నెలల నుంచి వేతనాలు కూడా ఇవ్వటం లేదు. రాష్ట్ర సచివాలయం, హైకోర్టు లోనూ కాంట్రాక్ట్‌ కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వటం లేదు. ఉచిత విద్య, వైద్యం హామీలు అమలు కావడంలేదు. ఉపాధి హామీ పనులు ఆగిపోయాయి. పేదల నుండి డిపాజిట్లు వసూలు చేసి నిర్మించిన 5 వేల ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఖాళీగా ఉంచారు.
రాజధాని కొనసాగాలి -   పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
రాజధానిలో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామంటే, అడ్డుకుంటున్నారని వైసిపి ప్రచారం చేస్తున్నది. టిడిపి, వైసిపిల రాజకీయ క్రీడలో ప్రజలు బలవుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లుపేదలకు కేటాయించాలని సిపిఎం పోరాడుతూనే ఉంది. అమరావతిని ఛిన్నాభిన్నం చేయడం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించడం కాదు, అమరావతినీ కొనసాగిస్తూ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ప్రయోజనమని సిపిఎం చెప్పింది. రాజధాని ప్రజలకు ఇచ్చిన చట్టబద్ధమైన హామీలను నెరవేర్చాలని ఆనాడు, ఈనాడు సిపిఎం, ప్రజాసంఘాలు, ప్రజాతంత్ర వాదులు పోరాడుతూనే ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసింది. అరెస్టులు సాగించింది. కేసులు పెట్టింది. వైసిపి ప్రభుత్వం అదే దారిలో నడుస్తూ నిత్యం 30, 144 సెక్షన్లు విధిస్తూ అరెస్టులు సాగించి అమరావతి రైతుల ఉద్యమాన్ని, ప్రజల ఉద్యమాలను అణచివేస్తున్నది.
రాజధానికి ద్రోహం చేసిన బిజెపి రైతులకు న్యాయం జరగాలని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇదంతా పచ్చి బూటకం. రాజధానినీ, రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేయటంలో ప్రధాన ముద్దాయి బిజెపి. వైసిపి పావుగా ఉపయోగపడుతోంది. బిజెపితో జత కట్టిన వైసిపి చెప్పే వికేంద్రీకరణ పచ్చి బూటకం. రైతు వ్యతిరేక బిల్లులను బలపరిచిన టిడిపి అమరావతిలో రైతులకు న్యాయం జరగాలని కోరటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
అందుకే ఈ పార్టీల నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలి. అమరావతి రైతు, కూలీలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఈ పార్టీలను నమ్ముకుంటే ఒరిగేది శూన్యం. ఐక్యతను నమ్ముకోవాలి. పోరాటాలను నమ్ముకోవాలి. అందరూ కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చాలి. రాజధాని అమరావతి లోనే కొనసాగింపూ, కేంద్రం ఆర్థిక సహాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, విభజన హామీల అమలుకు నిధులు, ప్రత్యేక హోదా సాధించడానికి రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మడి పోరు సాగించాలి.
సిహెచ్‌. బాబూరావు
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)