ప్రజాశక్తి - నందిగామ : ప్రస్థుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లు సద్వినియోగంపై పర్యవేక్షణ కొరవడింది. విద్యార్ధులు పాఠ్యాంశాలను ఇంటి వద్దనే వీక్షించి అవగాహన పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణి చేసింది. బడులలో ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు ఇవ్వాల్సి ఉండగా, పలు మండలాల్లో నేటికీ ట్యాబ్‌లు అందలేదు. పిల్లలకు, ఉపాధ్యాయులకు ట్యాబ్‌ల వల్ల ప్రయోజనం ఎంతో ఉంటుంది. కొన్ని చోట్ల ట్యాబ్‌లు మరమ్మత్తులకు గురౌతున్నాయి. ఎన్‌టిఆర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధులకు సుమారు 14,031 మంది విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ ఉన్న శాంసంగ్ కంపెనీ ట్యాబ్‌లు పంపిణి చేశారు. విద్యార్ధులకు నిపుణులు బోదించిన గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలు వీక్షించే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, ఆంగ్ల సబ్జెక్టులు లేవు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోదించిన పాఠ్యాంశాలు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే వీలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు లేక ఆ పక్రియ మొక్కుబడిగా సాగుతుంది.
జిల్లాలో 1920 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికి ట్యాబ్‌లు ఇచ్చామని అధికారులు చెప్పుతున్నా క్షేత్ర స్తాయిలో అందటం లేదు. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, విసన్నపేట, ఎ.కొండూరు తదితర మండలాల్లో ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందలేదు. ఎంఆర్‌పి కార్యాలయాలకు పంపామని చెప్పుతున్నా పంపిణిలో ఆలస్యం జరుగుతుంది. విద్యార్ధులకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకున్నా ఆఫ్‌లైన్‌లో ట్యాబ్‌లద్వారా పాఠలు వీక్షించవచ్చు. ఆయా పాఠ్యాంశాలతో మెమరీ కార్డులను ట్యాబ్‌ల్లో అమర్చారు. ఇందులో విద్యార్ధులకు 50 ప్రశ్నలకు నమునాలు పరీక్షలు ఉంటాయి. బొమ్మలు, ఆడియాలు, వీడియోలు, త్రీడి యానిమేషన్ చిత్రాలతో పాఠ్యాంశాలు రూపొందిం చారు. ట్యాబ్‌ల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే విజయవాడ పడమట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మరమ్మత్తులుచేసేలా అదికారులు చర్యలు తీసుకున్నారు.










