హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంపై సోమవారం సాయంత్రం ఎసిబి అధికారులు దాడి చేశారు. ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుని నుంచి లంచం తీసుకుంటూ ఉండగా అసిస్టెంట్ కమిషనర్ శ్రీరాములతో పాటు సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్, అటెండర్ జ్యోతిరావు, క్లర్క్ శేఖర్‌లను పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఎసిబి డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ పరిగి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వి.నాగేష్ బిందు ట్రేడ్ ఎగ్జిబిషన్ నడుపుతున్నాడు. హిందూపురం పట్టణంలోని నానేప్పనగర్‌లో గోడౌన్ ఏర్పాటు చేసుకుని అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పలు పట్టణాల్లో ఎగ్జిబిషన్ నడుతున్నాడు. ఇతను జిఎస్‌టి నెంబరు సైతం తీసుకుని టర్నోవర్ జరిగిన రూ.2లక్షలకు రూ.36వేలు పన్ను సైతం ఇటీవల చెల్లించాడు. కాగ రాజశేఖర్ టర్నోవర్ ఎక్కువ జరిగిందని దాడులు నిర్వహించి, జరిమానాలు విధిస్తే ఎక్కువ మొత్తంలో విధించాల్సి ఉంటుందని సిటిఒ అధికారులు అతన్ని బెదిరించారు. ఇలా జరక్కుండా ఉండాలంటే రూ.50వేలు లంచాన్ని డిమాండ్ చేశారు. ఇంత తాను ఇవ్వలేనని రూ.30 వేలు ఇవ్వడానికి బేరం కుదుర్చుకున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు నగేష్ ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎసిబి అధికారుల సూచన మేరకు నాగేష్ సోమవారం సాయంత్రం రూ.30 వల నగదును తీసుకుని సిటిఒ కార్యాలయానికి వెళ్లాడు. నగదును సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్‌కు ఇచ్చాడు. వెంటనే రాజశేఖర్ దీనిని క్లర్క్ శేఖర్‌కు రూ.25వేలు, అటెండర్ జ్యోతిరావుకు రూ.5 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ కాపుకాచిన ఎసిబి అధికారులు దాడులు చేసి లంచం తీసుకున్న ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఈ అవినీతి బాగోతంలో అసిస్టెంట్ కమిషనర్ శ్రీరాములు ఉన్నాడని తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించామని ఎసిబి డీఎస్పీ తెలిపారు.










