Apr 06,2023 21:35

పత్తి రైతు దిగాలు


దిగుబడి, ధరలతో విలవిల
గతేడాది క్వింటా ధర రూ.10 వేలు
ప్రస్తుతం రూ.6 వేలకే పరిమితం
అధికంగా దళారుల బెడద
ఆందోళనలో రైతులు
ప్రజాశక్తి-చాపాడు
ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లకు తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా పత్తి ధరలు పడుతూ.. లేస్తూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పత్తిని అమ్మేందుకు ఊగిసలాడుతున్నారు. గత ఏడాదితో పోల్చికుంటే ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ.ఆరు వేలు పలుకుతోంది. ఖరీఫ్‌లో సాగైన పత్తి పంట వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట సాగు సమయంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ తరువాత వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గుముఖం పట్టింది. దిగుబడితో పాటు ధరలు అమాంతం తగ్గాయి. ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తోంది. గత ఏడాది పత్తి పంటకు గిట్టుబాటు ధర ఉండటంతో ఎక్కువ మంది రైతులు పంట సాగు చేపట్టారు. కిలో పత్తి ధర ప్రారంభంలో రూ.85 నుంచి రూ.90ల వరకు పలికింది. ప్రస్తుతం రూ.60కు తగ్గింది. గత ఏడాది క్రితం సిసిఐ రూ.95కి కొనుగోలు చేసింది. ఈ ఏడాది దిగుబడి చేతికి అంది వచ్చిన తర్వత అనంతరం రూ.60 నుంచి రూ.65కు చేరింది. గతంలో దిగుబడి ఆశాజనకంగా లేని సమయంలో క్వింటా రూ.105 వరకు పలికింది. ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరకు కూడా పత్తి రైతులు నోచుకోవడంలేదు. రైతులకు వేర్వేరు కారణాలు చూపి దళారీలు మభ్యపెట్టేవారు. నాణ్యత, రంగు లేదని సాకులు చూపుతూ తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. దళారీలు పత్తి రైతుల వద్ద తక్కువ ధరలకు సేకరించి పత్తిని ప్రొద్దుటూరు, గుంటూరు, నంద్యాల, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ మిల్లులలో అమ్ముకుంటూ అధిక ధరలు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాలలో తూకాలు వేసే సందర్భంలో కూడా చాలావరకు మోసాలకు పాల్పడుతున్నప్పటికీ కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. ధరలు తగ్గడంతో పత్తి కోసం వ్యాపారులు గ్రామాల బాట పట్టిన రైతులు అమ్మకాలకు విముఖత చూపుతున్నారు.
తెగుళ్లతో తగ్గిన దిగుబడి
ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేపట్టాను. పంట సాగు చేసినప్పట్టి నుంచి తెగుళ్ల బెడద అధికంగా ఉంది. అధికంగా పురుగు మందులు వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం పంట చేతికి వచ్చిన తరువాత ధరలు అమాంతం తగ్గాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలి.
- లక్ష్మిరెడ్డి, కౌలు రైతు, తిప్పాయపల్లె, ఖాజీపేట మండలం.
పత్తి పంట సాగుతో నష్టపోయాం
ఏడు ఎకరాలలో పత్తి పంటను సాగు చేపట్టాం. ఎకరాకు రూ.30 వేల వరకు సాగు ఖర్చులు అయ్యాయి. దిగుబడి చూస్తే ఎకరాకు 3 క్వింటాళ్ళ వరకు మాత్రమే వచ్చినది. క్వింటా ధర రూ.6200 మాత్రమే పలికినది. ఎకరాకు రూ.పది వేల వరకు నష్టం వచ్చింది. గత ఏడాది పత్తి పంటకు ఉన్న ధరలను చూసి పంట సాగు చేపట్టడంతో నష్టపోవాల్సి వచ్చింది.
- మస్తాన్‌ యాదవ్‌, పత్తి రైతు చాపాడు.
అధిక వర్షాలతో తగ్గిన పత్తి దిగుబడి
ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పత్తి పంట అధిక వర్షాలకు దిగుబడి తగ్గింది. రైతులకు వర్షపు నీటిని నిలువ ఉండకుండా తొలగించుకోవాలని అవగాహన కల్పించాం. రైతులు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అయినప్పటికీ దిగుబడి తగ్గింది. మైదుకూరు డివిజన్‌ పరిధిలో 3768 హెక్టార్లు పత్తి పంట సాగైనది. రాజుపాలెం మండలంలో అత్యధికంగా 3334 హెక్టార్లలో పత్తి పంట సాగుకాగా పంటకోత ప్రయోగాలలో 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చినది. పంట కోత ప్రయోగాల నివేదికలను ఉన్నత అధికారులకు పంపాము. పంటకోత ప్రయోగాల ఆధారంగా ఇన్సూరెన్స్‌ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు మాత్రం అమలయ్యేలా చేస్తున్నాం.
- కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ఎడిఎ, మైదుకూరు డివిజన్‌.
- మండలంలో సాగులో ఉన్న పత్తి పంట