వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ హరిత
పటిష్టంగా సఫాయీ మిత్ర సురక్ష మార్గదర్శకాలు అమలు
నెల్లూరు:సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్ పధకం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను నెల్లూరు నగర పాలక సంస్థలో పటిష్టంగా అమలు చేయాలని కమిషనర్ హరిత అధికారులను ఆదేశించారు. కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగంలో అధికారులతో కలిసి కమిషనర్ హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల రక్షణకై కేంద్ర మంత్రిత్వశాఖ ప్రతినిధులు నిర్దేశించిన సఫాయీ మిత్ర సురక్షా మార్గదర్శకాల అమలును నెల్లూరు నగర పాలక సంస్థ లో అవలంబిస్తున్న విధివిధానాలను కమిషనర్ తెలియజేసారు. విధి నిర్వహణలో కార్మికుల ప్రాణ రక్షణతో పాటు, వారి కుటుంబాల జీవన భద్రతకై అమలుచేస్తున్న ప్రణాళికలను కమిషనర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో 4వ అతిపెద్దదైన నెల్లూరు కార్పొరేషన్ లో కార్మికుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు రూపొందించిన 'మ్యాన్ హౌల్ టు మెషిన్ హౌల్' అమలును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్మికుల భద్రతా చర్యలలో జాతీయ స్థాయిలో ఉత్తమ గుర్తింపు సాధించామన్నారు. అనంతరం ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షించిన కమిషనర్ మాట్లాడుతూ సఫాయీ మిత్ర సురక్షా నిర్దేశకాలతో కార్పొరేషన్ కార్మికుల రక్షణ సాధ్యమవుతుందని, దైనందిన విధులలో ఆయా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. భూగర్భ డ్రైను కార్మికులు, డీ స్లెడ్జింగ్ ఆపరేటర్ల ద్వారా ఆధునిక మర యంత్రాల సాయంతో నగర వ్యాప్తంగా చేపడుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్తంభించిన మ్యాన్ హౌల్స్ ను శుభ్రం చేసేందుకు మానవ రహిత అధునాతన యంత్రాలైన బాండీకూట్, జెట్టింగ్ మెషీన్ల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నామని వివరించారు. స్థానిక చిన్న బజారు మార్కెట్ సమీపంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రణాళికాబద్దంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.సఫాయీ మిత్ర కార్మికులు విధి నిర్వహణలో నగర పాలక సంస్థ అందించిన యూనిఫామ్, చేతి తొడుగులు, హెల్మెట్, షఉస్, మాస్క్ లను తప్పనిసరిగా వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ డ్రైను పనులలో భాగంగా మ్యాన్ హౌల్స్ శుభ్రతకై యంత్రాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన అన్ని రక్షణా నిబంధనలను పాటిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కషి చేయాలని అధికారులను సూచించారు. సెప్టిక్ ట్యాంక్ ల క్లీనింగ్ కోసం 14420 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాల్సిందిగా ప్రజలలో చైతన్యం పెంచాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈ లు సంజరు, చంద్రయ్య పాల్గొన్నారు.










