Jul 20,2021 10:34

ములకలచెరువు (హైదరాబాద్‌ సిటీ) : 16 నెలల తర్వాత గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైలు పట్టాలెక్కింది. కరోనా కారణంగా గత ఏడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ఈ మార్గంలో నడిచే నాలుగు ప్యాసింజర్‌ రైళ్లు నిలిచిపోయాయి. కోవిడ్‌ కేసులు క్రమేపి తగ్గుతుండటంతో కేంద్రప్రభుత్వం ప్రకటించిన సడలింపుల్లో భాగంగా గుంతకల్లు-తిరుపతి ప్యాసింజర్‌ రైళ్లను అధికారులు పునరుద్ధరించారు. రైల్వే అధికారులు మాట్లాడుతూ... సోమవారం అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి ములకలచెరువు మీదుగా తిరుపతికి ప్యాసింజర్‌ వెళ్లిందని తెలిపారు. మంగళవారం నుంచి ఈ మార్గంలో తిరుపతి నుంచి గుంతకల్లుకు, గుంతకల్లు నుంచి తిరుపతికి రెండు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.

ఈ సమయాల్లోనే..
ప్రతి రోజూ గుంతకల్లు నుంచి తిరుపతికి వెళ్లే ప్యాసింజర్‌... ములకలచెరువుకు ఉదయం 10.20 గంటలకు వస్తుంది. తిరుపతి నుంచి గుంతకల్లుకు వెళ్లే ప్యాసింజర్‌... ఉదయం 11 గంటలకు ములకల చెరువుకు వస్తుంది. ఇక రాత్రి పూట నడిచే మరో రెండు ప్యాసింజర్‌ రైళ్లపై రైల్వే ఉన్నతాధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

ప్యాసింజరే అయినా ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీ..!
పేరుకు ప్యాసింజర్‌ రైలే అయినా ఛార్జీ మాత్రం ఎక్స్‌ప్రెస్‌లానే తీసుకుంటున్నారు. గతంలో ములకలచెరువు నుంచి తిరుపతికి చార్జీ రూ.50 ఉండేది. ప్రస్తుతం రూ.75కు చేరింది. ములకలచెరువు నుంచి గుంతకల్లుకు గతంలో రూ.40 ఉండగా ప్రస్తుతం రూ.65కు చేరింది. ప్యాసింజర్‌ రైళ్ల చార్జీలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఛార్జీల పెంపుదల సామాన్యులకు కష్టతరమేనని చెప్పవచ్చు.

తాత్కాలికంగా కొన్ని స్టాప్‌లు రద్దు..
సహజంగా ప్యాసింజర్లు చిన్న చిన్న రైల్వే స్టాప్‌లలో ఆగుతూ సామాన్యులందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని అధికారులు సవరించారు. పలు స్టేషన్లలో స్టాప్‌లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు జిల్లాలో ములకలచెరువు, కురబలకోట, మదనపల్లె, వాయ ల్పాడు, కలికిరి, పీలేరు, పులిచెర్ల, దామలచెరువు, పాకాల, పనపాకం, చంద్రగిరి, తిరుపతి రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆగుతాయి.