Mar 03,2023 22:40

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : మునిసిపాలిటీ పరిధిలోని వాసవి ఇంగ్లీష్‌ మీడియం ప్రైవేట్‌ పాఠశాలలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆ పాఠశాలలో పై అంతస్తులో 5వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు ఒక్కసారిగా కడుపు నొప్పితో గగ్గోలు పెట్టారు. కేవలం 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే అస్వస్థతకు గురి కావడం పట్ల ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఆ అంతస్తులోని గదిలోకి ఏదైనా చెడు వాసన సోకిందా? లేక ఆహారంలో కల్తీ జరిగిందా అన్న విషయాలపై ఆర్డీవో భాగ్యరేఖ, డీఈవో మీనాక్షి ఆరా తీశారు. 15 మందిని హుటాహుటిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని సత్యసాయి జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. మరో ఆరుగురు చికిత్స అనంతరం కోలుకోవటంతో వారి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డిఇఒ మీనాక్షి మాట్లాడుతూ తనతో పాటు ఆర్డీవో భాగ్యరేఖ, పోలీస్‌ అధికారులు ఆ గదిని పరిశీలించామని ఎలాంటి దుర్వాసన రాలేదని అన్నారు. ఆ విద్యార్థులు పుట్టినరోజు సందర్భంగా ఎవరో పెసర బేడలతో చేసిన పిండి వంటలు తిన్నారని తెలిసిందని బహుశా వాటి నుంచి ఇలా జరిగి ఉండవచ్చని అన్నారు. ఆ పిండి వంట పదార్థాలు ఎవరు ఇచ్చారు, అది విషపూరితంగా మారిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారన్నారు. ఇప్పటికైతే అందరూ క్షేమంగా ఉన్నారని డిఇఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి యశ్వంత్‌, సిఐలు బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, జయనాయక్‌ పాల్గొన్నారు.