Apr 03,2023 21:24

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న జెసి తమీమ్‌ అన్సారీయా


ఒకరు డీబార్‌, 296 మంది గైర్హాజరు
పరీక్షా కేంద్రాల్లో జెసి, ఎస్‌పి తనిఖీ
ప్రజాశక్తి-రాయచోటి : జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి సెంటర్ల వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతి లేదు అని అధికారులు చెప్పడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రతి సెంటర్‌ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్లు నిషేధించారు. మొదటిరోజు పరీక్షకు 296 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకరు డీబార్‌ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 123 పరీక్ష కేంద్రాల్లో 22,395 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకవాల్సి ఉండగా 22,204 మంది విద్యార్థులు మాత్రమే ఫరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు. జిరాక్స్‌ సెంటర్లు కూడా మూయించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మాసాపేట పాఠశాలలో ఒకరు డిబార్‌ మాసాపేట పాఠశాలలో సోమవారం జరిగిన పదవ తరగతి పరీక్షల్లో ఒక విద్యార్థి బుక్లెట్‌ తీసుకొని పరీక్ష కేంద్రం నుండి బయటికి వెళ్లిపోయారు. ఆ విద్యార్థిని డిబార్‌ చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై ఇన్విజిలేటర్‌ను సస్పెండ్‌ చేసి, చీప్‌, డిపార్ట్మెంట్‌ ఆఫీసర్‌కు సోకాజ్‌ నోటీసులు ఇచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం తెలిపారు.
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జెసి
పట్టణంలోని డైట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మాసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారీయా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, అత్యవసర మందులు ఉన్నాయా లేదో పరిశీలించారు. పరీక్షలకు హాజరైన తీరును చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఇతరులు ఎవరూ పరీక్ష కేంద్రాలలోకి రాకుండా చూడాలన్నారు. తనిఖీలో జాయింట్‌ కలెక్టర్‌తో పాటు డిఇఒ పురుషోత్తం, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులున్నారు. ఎస్‌పి హర్షవర్ధన్‌ రాజు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉందని చెప్పారు. మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌ తదితర అక్రమాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.