Dec 13,2020 12:15

        ఉల్కాపాతాల వర్షాన్ని ఎప్పుడైనా చూశారా? అయితే దీన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి. 'తోకచుక్కల నుంచి వేరేపడిన ఉల్కలు ప్రయాణిస్తున్న మార్గాలకు సమీపంగా భూమి ఒక్కోసారి వెళ్తుంది. భూమి ఆకర్షణ శక్తి వల్ల కొన్నిసార్లు ఆ ఉల్కలు భూమివైపుగా వస్తాయి. ఫలితంగా మనకు ఉల్కాపాతాలు కనిపిస్తాయి' అని బ్రిటన్‌లోని రాయల్‌ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్‌లో పనిచేస్తున్న ప్యాట్రీషియా స్కెల్‌టెన్‌ చెప్తున్నారు. 'జెమినిడ్స్‌ ఉల్కాపాతంగా పిలిచే ఈ తాజా ఉల్కాపాతం భిన్నమైనది. ఎందుకంటే 3200 ఫేటాన్‌గా పిలిచే ఓ గ్రహశకలం నుంచి వేరుపడిన ఉల్కల నుంచి ఈ ఉల్కాపాతం వస్తోంది!' అని ఆమె వివరించారు.
ఏటా ఇదే సమయంలో మన భూమి ఆ గ్రహశకలానికి దగ్గర నుంచి వెళ్తుంది. ఫలితంగా మనకు చాలా ఉల్కాపాతాలు కనిపిస్తాయి. అయితే ఈ నెల 13, 14 తేదీల్లో ఈ ఉల్కాపాతం పతాకస్థాయికి చేరుతుంది. ఆ సమయంలో మనకు గంటకు 150 వరకూ ఉల్కలు కనిపించొచ్చు.
          'ఈ ఉల్కలు సెకనుకు 35 కి.మీ.ల వేగంతో భూమివైపు దూసుకువస్తాయి. అంటే గంటకు 1,30,000 కి.మీ.' అని ఆమె తెలిపారు. ఇవి సాధారణంగా పసుపు రంగులో కనిపిస్తాయి. కొన్నిసార్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లోనూ దర్శనమిస్తాయి. ఆకాశం ఎంత చీకటిగా ఉంటే ఇవి అంత అందంగా, అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కృత్రిమ కాంతులతో వెలుగులీనే పట్టణ ప్రాంతాల్లోని ఆకాశంలోనూ ఇవి కొంతవరకు కనిపించే అవకాశముంది. ఇంకో విశేషం ఏమిటంటే.. గతేడాది పౌర్ణమి సమయంలో ఈ ఉల్కాపాతం సంభవించింది. కానీ ఈ సారి అమావాస్య సమయంలో ఇది జరగబోతోంది. అంటే ఉల్కాపాతాలు స్పష్టంగా కనిపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లే.మరి ఆస్వాదించేద్దాం..!