Apr 19,2023 19:23

విజేతలకు బహుమతులు అందజేస్తున్న కుర్రా భాస్కరరావు

ప్రజాశక్తి -కందుకూరు : ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల క్రీడల పట్ల చూపిన ఆసక్తి అద్భుతమని ఒలంపిక్స్‌ జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు ప్రశంసించారు. వారంరోజులు పాటు నిర్వహించిన అంతర్‌ క్రీడ ఉత్సవాలలో విజేతలకు బహుమతులు పంపిణీ సందర్భంగా బుధవారం కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు అన్ని గేమ్స్‌లో పాల్గొనడం ప్రశంసనీయమన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, చెస్‌, క్యారమ్స్‌, టెన్నికాట్‌, పరుగు (రన్నింగ్‌)పందెం, షటిల్‌ పోటీ లలో పెద్ద ఎత్తున పాల్గొనడం హర్షనీయమన్నారు. బాలికలు సైతం కబాడీ లాంటి పోటీలలో 4-5 టీములు పోటీ పడడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ ప్రోత్సాహం
జిల్లా ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ తరపున కాలేజీ క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తామని కుర్రా అభయం ఇచ్చారు. ప్రధానంగా కబాడీ, వాలీబాల్‌ ఆటగాళ్లకు ఒలంపిక్‌ అసోసియేషన్‌ తరపున రాష్ట్ర స్థాయిలో ఆడేందుకు అవకాశం ఇప్పించేందుకు కషి చేస్తామని భాస్కరరావు హామీ ఇచ్చారు. కరస్పాండెంట్‌ కంచర్ల రామయ్య మాట్లాడుతూ కాలేజీ స్థాపిం చినప్పటి నుండి కబాడీ, ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులుగా భాస్కరరావు తమ విద్యార్థులకు ఎన్నో ప్రోత్సాహాలను అందించారని తద్వారా రైల్వే,పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు పొందిన వారు కూడా ఉన్నారన్నారు. తనకు కూడా జిల్లాస్థాయి అసోసియేషన్లలో ప్రాధాన్యత కల్పించిన అవకాశాలను మరువలేనివన్నారు. సాంకేతిక డైరెక్టర్‌ డాక్టర్‌ కే.విజయ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తక్కువ కాలంలో 10 రకాల క్రీడాల పోటీలు నిర్వహణ ప్రశంసనీయమని నిర్వాహకులను అభినందించారు. డాక్టర్‌ సి.హెచ్‌. రవి కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని అకడమిక్స్‌ ఇన్‌చార్జ్‌ ఎస్‌.ఎమ్‌. మీరావలి నిర్వహించారు. విద్యార్థులు, యాజమాన్యం, ముఖ్యఅతిథి భాస్కరావును సత్కరించి జ్ఞాపికను అందజేశారు.