Jan 08,2022 07:58

'పాలకవర్గాలపై బెంగాల్‌ ప్రజానీకంలో నెలకొన్న భ్రమలు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. నిదానంగా ప్రజానీకం వాస్తవాలను గుర్తిస్తున్నారు. టిఎంసి, బిజెపిలు రెండూ ఒకే తానులోని ముక్కలనే నిజం వారికి క్రమేణా అర్ధమవుతోంది. ఇటీవల జరిగిన కోల్‌కత్తా నగరపాలక ఎన్నికల్లో అధికార టిఎంసి పెద్ద ఎత్తున హింసాకాండకు దిగి, రిగ్గింగ్‌కు పాల్పడింది. అయినా, వామపక్షాలకు 12శాతం ఓట్లు వచ్చాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగిఉంటే ఇది 20 శాతం దాటేదని స్వతంత్ర పరిశీలకుల అంచనా. వామపక్షాలు, ఇతర ప్రజాతంత్ర శక్తులు చేస్తున్న ప్రచారానికి సానుకూల స్పందన లభిస్తోందనడానికి ఇదో నిదర్శనం.' అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, పశ్చిమబెంగాల్‌ చెందిన సుజన్‌ చక్రవర్తి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ క్లుప్తంగా :

                               బెంగాల్‌లో ప్రజాఉద్యమాల విస్తరణకు అవకాశాలు ఎలా ఉన్నాయి ?

వివిధ సమస్యలపై బెంగాల్‌ ప్రజానీకం గళం విప్పుతూనే ఉన్నారు. అయితే, అధికారంలో ఉన్న టిఎంసి పెద్ద ఎత్తున అణచివేతకు పాల్పడుతోంది. రాష్ట్ర పోలీసులతో పాటు, తృణమూల్‌ గూండాలు దాడులకు దిగుతున్నారు. త్రిపురలో బిజెపి ఏ విధంగా అధికారాన్ని అడ్డంపెట్టుకుని హింసాకాండకు దిగుతోందో, బెంగాల్‌లో టిఎంసి కూడా అదేవిధంగా వ్యవహరిస్తోంది. కోల్‌కత్తా నగర పాలక సంస్థ ఎన్నికలే దీనికి నిదర్శనం. కొన్ని డివిజన్లలో 97శాతం ఓట్లు టింఎసికి పోలయ్యాయి. అత్యధిక చోట్ల 80నుండి87 శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. పోలింగ్‌బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను కిడ్నాప్‌ చేయడం, ప్రజలకు ఓట్లు వేసే అవకాశం ఇవ్వకపోవడం వంటి చర్యలకు టిఎంసి పాల్పడింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే స్థితి.
 

                           కోల్‌కతా నగరపాలక సంస్థ ఎన్నికల్లో వామపక్షాల ఓట్ల శాతం పెరిగింది కదా...!

ఈ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు వచ్చాయి. ఇది గణనీయమైన పెరుగుదలే. అనేక డివిజన్లలో టిఎంసి తరువాత రెండవ స్థానంలో నిలిచాం. ఇంత హింసాకాండలోనూ ఈ ఓటింగ్‌ను సాధించడం పట్ల స్థానిక మీడియా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
నిజానికి ఈ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లను టిఎంసి రిగ్గింగ్‌ చేసింది. ఆ ఓట్లు కూడా పోల్‌ అయిఉంటే వామపక్షాలకు పోల్‌ అయిన ఓట్లు మరిన్ని పెరిగి ఉండేవని భావిస్తున్నాం. ఈ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సిపిఎం యువతకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రజలు దీనిని ఆహ్వానించారు.
 

                                                         బిజెపి ప్రభావం ఎలా ఉంది ?

మతాన్ని అడ్డుపెట్టుకుని, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా బలాన్ని పెంచుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. దీనికి తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా సహకరిస్తోంది. దీంతో ఆ పార్టీ రాష్ట్రంలో రెండవ స్థానానికి ఎగబాకింది. అయితే, ఇది ఎక్కువ రోజులు సాగదు. బెంగాల్‌ సాంస్కృతిక వారసత్వం ఇది కాదు. దీంతోపాటు మోడీ రైతాంగ, కార్మిక వ్యతిరేక చర్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
 

                   మతోన్మాదంపై తానే పోరాడుతున్నట్లు మమత పోజు ఇస్తున్నారు. దీనిపై మీరేమంటారు ?

ఈ విషయంలో టింఎసి బిజెపితో పోటీ పడుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పెద్ద హిందువునని చెప్పుకోవడమే కాదు, బాహాటంగానే బిజెపిని సంతృప్తి పరిచే చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో బహిరంగ సభల్లో ఆమె ప్రసంగాలను కూడా హిందూ నినాదాలతోనే ప్రారంబి óస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య! దీంతో టిఎంసి, బిజెపిలు పరస్పర పూరకాలని, ఒకదానితో ఒకటి సహకరించుకుంటాయని వామపక్షాలు ఇంతకాలం చెబుతూ వచ్చిన విషయం నిజమైంది.
 

                                          వామపక్షాలు ప్రజలను ఎలా చైతన్యపరుస్తున్నాయి ?

మేం నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. వారి నిత్య జీవిత సమస్యలపై పనిచేస్తున్నాం. ప్రజలను విభజించే బిజెపి విధానాలు, దానికి సహకరించే టింఎసి తీరును వారికి వివరించాం. రైతాంగ సమస్యల నుండి కార్మికులు, యువకులు, మహిళలు, విద్మార్థులు ఇలా అన్ని తరగతుల వారిని కదిలిస్తున్నాం..విద్య, వైద్యం అంశాలపై ప్రజలను సంఘటితం చేస్తున్నాం. వారి హక్కులను గుర్తు చేస్తున్నాం. పోరాటానికి సిద్దం కావాలంటూ పిలుపునిస్తున్నాం. ఈ పిలుపునకు సానుకూల స్పందన లభిస్తోంది.