Dec 17,2022 19:19

సిబ్బంది పనితీరుపై ఆరా తీస్తున్న డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌

- డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌
ప్రజాశక్తి-వాల్మీకిపురం: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నమయ్య జిల్లా డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే ఏ ఒక్కరూ వైద్యం సరిగా అందడం లేదని బయటకు వెళ్లే పరిస్థితి ఉండకూడదన్నారు. ఆసుపత్రిలోని వైద్యులందరూ కలసికట్టుగా ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అన్ని వాటికి వైద్యులు అందుబాటులో ఉన్నారని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలన్నారు. వివిధ సమస్యలపై వచ్చే వారికి ఎక్స్‌రే, ఇసిజి, రక్తపరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉచితంగా వైద్యం పొందాలని సూచించారు. అనంతరం వార్డులు, ఎక్స్‌రే, ఇసిజి గదులు, నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. 50 పడకలతో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనాన్ని త్వరతిగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫైరోజా బేగం, డాక్టర్లు సోని, లేఖ్య, హర్షిత రెడ్డి, గురుస్వామి, సిబ్బంది సుధాకర్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.