Mar 24,2022 07:13

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపిల సంతకాలు సేకరించి ప్రధానికి సమర్పించాలని వైసిపి నేతల ప్రకటన మంగళవారం వెలువడింది. 24 గంటలు గడవకమందే బుధవారం నాడు కేంద్ర స్టీలు మంత్రి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని మరోసారి పార్లమెంటులో ప్రకటించారు. కాబట్టి కేంద్రం వెనక్కి తగ్గాలంటే విజ్ఞప్తులు, వేడికోళ్ళు చాలవని స్పష్టమైంది. రాష్ట్రంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ, బిజెపి మినహా, విశాఖ ఉక్కు పరిరక్షణకే నిలబడ్డాయి. రాష్ట్ర ప్రజానీకమంతా ఈ విషయంలో ఒకే మాటమీద ఉంది. అందుచేత విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కేంద్రం మీద బలంగా ఒత్తిడి తెచ్చే ఉద్యమాన్ని సమైక్యంగా చేపట్టాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, అధికార వైసిపి చొరవ చూపి అందరినీ కలుపుకుని కేంద్రం మీద ధ్వజమెత్తాలి. ఇంకెంత మాత్రం ఆలస్యం జరిగినా అది మన రాష్ట్రానికి అత్యంత వినాశకరంగా పరిణమిస్తుంది.

రాజన్న పాలనను తిరిగి తీసుకొస్తానని ఎన్నికల సమయంలో జగన్‌ పదే పదే చెప్పారు. రాష్ట్రంలోని ప్రజల ఉమ్మడి సంపద విషయంలో, ఇక్కడి సహజ వనరుల విషయంలో ఆ నాడు రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమన్న వైఖరి తీసుకున్నారు. కెజి బేసిన్‌ లోని సహజవాయువు నిక్షేపాలను రిలయన్స్‌కు కట్టబెట్టడానికి కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆయన తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. రాష్ట్ర వనరులను ప్రైవేటుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. దాని ద్వారా వచ్చే ప్రయోజనం మొదట ఈ రాష్ట్రానికే దక్కాలని ఆయన వాదించారు. ఆ సందర్భంగానే ప్రభుత్వ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఆయన ప్రారంభించారు. కేంద్రంలోని సొంత పార్టీ ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ రాజశేఖర్‌రెడ్డి తన వైఖరికే కట్టుబడ్డారు. ఆ దృఢ వైఖరిని జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు అవలంబించడం లేదు ?

మన రాష్ట్రాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించగల పోర్టుల విషయంలో సైతం జగన్‌ ప్రభుత్వం అనుసరించిన వైఖరి రాష్ట్రానికి నష్టదాయకమే కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తో కలిసి సంయుక్త రంగంలో నిర్మించిన గంగవరం, కృష్ణపట్నం పోర్టులు అదానీ గ్రూప్‌ వశమయ్యాయి. అంతకు ముందు అదానీ గ్రూప్‌ విశాఖ పోర్టుకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించిన వైనం జగమెరిగినదే. అయినప్పటికీ ఆ కార్పొరేట్‌ గ్రూప్‌ కే రెండు ప్రధాన పోర్టులను అప్పజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మరికొన్ని పోర్టులను కూడా ఆ సంస్థకు అప్పచెప్పనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తీరం మొత్తం అదాని పరం అవుతోందని, ఆంధ్ర ప్రదేశ్‌ కాస్తా అదాని ప్రదేశ్‌గా మారుతోందంటూ వస్తున్న విమర్శలనూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కృష్ణపట్నం సెజ్‌లోని జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పట్ల కూడా ప్రభుత్వానిది ఇదే వైఖరి. ఈ విధమైన కార్పొరేట్‌ అనుకూల వైఖరిని అనుసరిస్తే విశాఖ ఉక్కు కార్పొరేట్ల పరం కాకుండా అడ్డుకోవడం ఏ విధంగా సాధ్యమౌతుందో వైసిపి నేతలే చెప్పాలి. తమ వంతు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మరోవైపు కేంద్రం అదే కార్పొరేట్లకు లబ్ధిచేకూర్చేలా తీసుకున్న నిర్ణయాలను అడ్డుకుంటామనడం వెనక చిత్తశుద్ధి ఎంత?

ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా ఈ విషయంలో వైసిపి కి భిన్నంగా లేదు. ఇక ఏకంగా బిజెపితో జట్టు కట్టిన జనసేన గురించి చెప్పేదేముంది? విశాఖ ఉక్కు పాలిట అసలు విలన్‌ గా వ్యవహరిస్తున్న బిజెపిని వదిలిపెట్టి కేవలం వైసిపి మీదే తమ విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు వీళ్ళు. విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో పరిశ్రమను కాపాడుకోవాలన్న తాపత్రయం కన్నా తక్షణ రాజకీయ లబ్ధి మాత్రమే ముఖ్యమవడం నేటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి అత్యంత నష్టదాయకంగా పరిణమిస్తోంది.

ఈ నేపధ్యంలో విశాఖ ప్రజలు 28వ తేదీన సార్వత్రిక బంద్‌ ను ప్రకటించడం చాలా, చాలా హర్షణీయమైన పరిణామం. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం మళ్ళీ 1966-69 నాటి అపూర్వ ప్రజాపోరాటం ఒరవడిలో పుంజుకోవడమే ఆ పరిశ్రమను కాపాడుతుంది. డిల్లీ రైతులే విధంగా మోడీ ప్రభుత్వం మెడలు వంచగలిగారో, 1984లో తెలుగు ప్రజలు ఏ విధంగా ఎన్టీఆర్‌ అక్రమ బర్తరఫ్‌ కుట్రను తిప్పికొట్టగలిగారో, అదే బాటలో తెలుగు ప్రజలంతా ఒక్కటై ఉద్యమించాలి.