ప్రజాశక్తి కదిరి టౌన్ : సిపిఎం, సిపిఐ బలపరిచిన పిడిఎఫ్ తరపున పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిని అన్ని సంఘాల మద్దతుతో గెలిపించుకుందామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం కదిరి పట్టణంలోని ఎన్జీవో హోంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులతో సమావేశమై మండలి ఎన్నికలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను కట్టబెడుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నాలుగు ప్రధాన రైల్వేస్టేషన్లను ప్రయివేటుకు అప్పజెప్పాలని చూస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మండల ఎన్నికలలో ఎలాగైనా అడ్డదారుల లో గెలవాలని చూస్తోందని వైసిపి ఆలోచన విధానాన్ని ప్రజాస్వామ్యవాదులు ఏకమై పోరాడి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉందని మూడున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉపాధ్యాయుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నిర్వహించ లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావాలన్నా, శాసనమండలిలో ప్రజా గొంతుక వినిపించాలన్నా పిడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బడా సుబ్బిరెడ్డి, సిఐటియు నాయకులు జిఎల్. నరసింహులు, జగన్మోహన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాబ్జాన్, ముస్తాక్, రామ్మోహన్, రైతు సంఘం, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బుక్కపట్నం : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా సిఐటియు కార్యదర్శి ఇఎస్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివార ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని బైపాస్ రోడ్, మెయిన్ రోడ్, టీచర్స్ కాలనీలో ప్రచారం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకులను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బ్యాల్ల అంజి తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతుగా మండలం పరిధి లోని సిరివరం, కంచిసముద్రం గ్రామాల్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రచారం నిర్వహించారు. సమస్యలపై పోరాడే వారిని శాసనమండలికి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, మండల నాయకులు కృష్ణమూర్తి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.










