- ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె.సాయి ప్రసాద్
- వేదిక ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ మాకినేని కిరణ్, జి.విజయప్రకాష్ ఎన్నిక
- గౌరవాధ్యక్షులుగా డాక్టర్ ఎస్.సుధాకర్
ప్రజాశక్తి - విజయవాడ, విజయవాడ అర్బన్ : ప్రజారోగ్య వ్యవస్థల అభివద్ధి పట్ల ప్రభుత్వాల అంకిత భావం పెరగాలని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కె.సాయి ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి బడ్జెట్ కేటాయింపులను మరింత పెంచాలన్నారు. ప్రజారోగ్య వేదిక ఎన్‌టిఆర్ జిల్లా విస్తత సమావేశం శుక్రవారం డాక్టర్ ఎస్.సుధాకర్ అధ్యక్షతన విజయవాడ సూర్యారావుపేటలోని ప్రజావైద్యశాలలో జరిగింది. ఈసమావేశంలో జిల్లావ్యాప్తంగా ప్రజారోగ్యం పట్ల ఆసక్తి కలిగి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు వైద్యులు, ప్రజారోగ్య వేదిక కార్యకర్తలు, వివిధ రంగాల సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సాయి ప్రసాద్ ముఖ్య అతిధిగా మాట్లాడుతూ రోగాల బారినపడి వైద్యం చేయించుకునే పరిస్థితి రాకుండా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేవిధంగా తగిన సాంఘిక పరిస్థితులు, పరిసరాలు ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, అవసరమైన చర్యలు తీసుకోవడం, ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటం, ఆరోగ్య రంగంలో ప్రభుత్వ సేవలను విస్తరింప చేయటం చాలా అవసరమన్నారు. ప్రజలు తమ ఆదాయంలో అత్యధిక భాగం వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తోందని, దీంతో వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు 25 లక్షల కుటుంబాలు ఇదే కారణంతో దారిద్య్రరేఖ దిగువకి నెట్టబడ్డాయన్నారు. ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రజారోగ్య వ్యవస్థని బలోపేతం చేస్తాయో అప్పుడే ప్రజలు డబ్బులు ఖర్చు చేసే అవసరం తగ్గుతుందన్నారు. ప్రజారోగ్య వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్.సుధాకర్ మాట్లాడుతూ కోవిడ్‌కు ముందు, తర్వాత కూడా తాము అనేక కార్యక్రమాలు నిర్విహించామని తెలిపారు. కరోనా రెండు దశల్లోనూ హెల్త్ హెల్ప్‌లైన్ నిర్వహించి లక్ష మందికిపైగా, రాష్ట్రంలో 30 ఐసోలేషన్ సెంటర్లలో 30 వేలకు మందికిపైగా కోవిడ్ రోగులకు సేవలందించామని తెలిపారు. ప్రజారోగ్య వేదిక జిల్లా కార్యదర్శి జి.విజరు ప్రకాష్ మాట్లాడుతూ ఎన్‌టిఆర్ జిల్లాలో షుగర్, బిపి, ఫిట్స్, పెరాలిసిస్ జబ్బులకు 'హెల్తీ విజయవాడ' పేరుతో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎ.కొండూరు మండలం గిరిజన తండాల్లో కిడ్నీవ్యాధి బాధితుల సమస్యలపై మొదటి నుండీ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశామన్నారు. నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ డి.రాజారెడ్డిని ఆ ప్రాంతంలో పర్యటింపజేశామన్నారు. వేలాది మందికి సీరం క్రియాటినిన్ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేశామని, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఫ్లోరైడ్ రహిత తాగునీరు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మాకినేని కిరణ్ మాట్లాడుతూ ప్రజారోగ్య వేదిక కార్యక్రమాలను మరింత విస్తతం చేసేందుకు, కోవిడ్ అనంతర ప్రజారోగ్య వ్యవస్థ, దాని స్థితిగతులపై చర్చించేందుకు నవంబరు 6వ తేదీన రాష్ట్రస్థాయి ఆరోగ్య సదస్సును విజయవాడలో నిర్వహించనున్నామని, దీనిని విజయవంతం చేయాలని కోరారు.
నూతన కమిటీ ఎన్నిక
అనంతరం ఎన్‌టిఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా డాక్టర్ ఎస్.సుధాకర్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ మాకినేని కిరణ్, జి.విజరు ప్రకాష్ ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జె.ఎం.సంతోష్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ జి.సురేంద్ర, డాక్టర్ చేకూరి మురళి, డాక్టర్ ఎం.సీతా రామారావు, డాక్టర్ బి.శ్రీహర్ష, డాక్టర్ సిహెచ్.రత్నకాంత్, డాక్టర్ ఎం.బి కౌశిక్, కార్యదర్శులుగా టి.రత్నాకర్, అబిద్ అలీ, మహేంద్ర రత్నరాజు, పద్మ, కోశాధికారిగా బి.లీలా సుందరితోపాటు మరో 10 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.










