రాయచోటి: ప్రజాసమస్యలను సత్వరం పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం పట్ల అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్ గిరీషా పిఎస్ సూచించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విజ్ఞప్తులు కలెక్టర్ స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డిఆర్‌ఒ సత్యనారాయణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి జయారాజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనకు ప్రజల నుంచి వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. వచ్చిన అర్జీలే మళ్లీ మళ్లీ రాకుండా, ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నామో అర్జీదారుడికి వివరంగా చెప్పాలన్నారు. అర్జీ పరిష్కారం తమ పరిధిలో లేనప్పుడు ఆ అర్జీని సంబంధిత అధికారికి బదలాయించాలన్నారు. స్పందన అర్జీలను అర్జీదారుడు సంతప్తి చెందేలా పరిష్కరించాలని చెప్పారు. రోజూ స్పందన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు అందరూ కొంత సమయం కేటాయించాలని సూచించారు. బాధితులకు సత్వరం న్యాయం చేయడమే లక్ష్యంగా సమస్యలను పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తు బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లోకి వెళ్లకుండా సంబంధిత శాఖ అధికారితో సమన్వయం చేసుకొని సంతప్తికర స్థాయిలో నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలు వినతిపత్రాలు అందజేశారు.










