రాయచోటి టౌన్ : పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడంలో అధికారులు విఫలం చెందారని ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎఫ్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎడి ప్రసాద్ బాబుకు మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి, ఐఎఫ్‌ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టిపల్లి సాయికుమార్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్న విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి బొస్త సత్యనారాయణ ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని అన్నారు. నోటి మాట తప్ప ఎక్కడా ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. రాయచోటి మాసాపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థి ఒఎంఆర్ షీట్ బయటకు తీసుకెళ్లి కాల్చి వేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లు, ప్లయింగ్ స్వ్కాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ఏం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షల పైన అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. కోడూరు, రాజంపేట మదనపల్లి రాయచోటి పట్టణాల్లో తక్షణమే పరీక్ష కేంద్రాల వద్ద ప్రయివేట్ ఉపాధ్యాయులు, ప్రయివేట్‌స్కూల్ యాజమాన్యాలు, ఉపాధ్యాయులు లేకుండా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎఫ్‌ఎస్ గా డిమాండ్ చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు వడదెబ్బ లాంటి ప్రభావం జరిగే పరిస్థితులు ఉన్నాయన్నారు.










