Jan 15,2022 08:29
  • నకిలీ విత్తనాలతో రైతుల కుదేలు
  • నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం విఫలం

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి : ''మా కంపెనీ విత్తనాలను ఉపయోగించండి. అధిక దిగుబడులతో సంతోషంగా ఉండండి. రైతే రాజు అవుతాడు'' ఇదీ విత్తన కంపెనీల ప్రచారం. ''విత్తనాలు కొనే ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోండి. రశీదులు జాగ్రత్తగా దాచుకోండి. సమస్యలు ఎదురైతే కంపెనీలపై చర్యలు తీసుకుంటాం. రైతులకు పరిహారం ఇప్పిస్తాం'' ఇవీ ఏటా సంబంధిత అధికారులు చెప్పే మాటలు. ఆచరణలో విత్తన కంపెనీల మోసాలు పెరిగిపోతున్నాయి. నకిలీ మినుము, కాకర, వరి, మిర్చి విత్తనాలను కంపెనీలు అంటగడుతు న్నారు. దీంతో దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతు న్నారు. నకిలీ, కల్తీ విత్తనాలతో నష్టపోతున్న రైతులకు పరిహారం ఇప్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది.
    కృష్ణా జిల్లాలో 2017-18 నుండి 2020-21 వ్యవసాయ సీజన్‌ వరకు 83 విత్తన నమూనాలు నకిలీవిగా అధికారులు గుర్తించారు. వీటిపై 71 కేసులు నమోదయ్యాయి. 2018-19 వ్యవసాయ సీజన్లో ఆగిరిపల్లి, బాపులపాడు, మైలవరం మండలాల్లో 484 ఎకరాల్లో 284 మంది రైతులు ఎపి సీడ్స్‌కు చెందిన పియు 31 రకం మినుము విత్తనాలు సాగు చేశారు. చెట్లు ఏపుగా పెరిగినా పూత, కాపు లేకపోవడంతో పశువులకు మేపాల్సిన దుస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగ నిపుణులు పరిశీలించి విత్తనలోపాన్ని నిర్ధారించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.11 వేల చొప్పన పరిహారం చెల్లించాలని ఎపి సీడ్స్‌కు సూచించారు. 2019-20 సీజన్లో బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 61 మంది రైతులు 70 ఎకరాల్లో పిఎన్‌ఆర్‌ కంపెనీకి చెందిన కాకర విత్తనాలతో పంట సాగు చేశారు. అరకొరగా కాసిన కాయలు సరిగా లేకపోవడంతో మార్కెట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లా అధికారులు త్రిసభ్య కమిటీ వేసి ఒక్కో ఎకరానికి రైతులు రూ.80 వేల వరకూ నష్టపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పరిహారం చెల్లించాలని కంపెనీ ఏజెంటును జిల్లా అధికారులు ఆదేశించారు. అదే ఏడాది ఖరీఫ్‌ సీజన్లో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో సోనం సీడ్స్‌కు చెందిన 39 ప్యాకెట్ల వరి విత్తనాలను విక్రయించారు. ఎకరానికి 75 కిలోల బస్తాలు 35 వరకు పక్క రైతులకు దిగుబడి రాగా, సోనం సీడ్‌ సాగు చేసిన రైతులకు ఎకరానికి ఏడు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని రైతులు కంపెనీని కోరారు. కంపెనీ ప్రతినిధులు అధికారుల వద్ద జరిగిన చర్చల్లో రైతులు చెప్పేది కూడా వినకుండా రూ.9 వేల చొప్పున 39 ఎకరాలకు పరిహారం ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. పైన తెలిపిన మూడు సంఘటనల్లో నష్టపోయిన రైతులెవరికీ ఇప్పటికీ పరిహారం అందలేదు. బాధిత రైతులు మాత్రం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాజాగా ఈ సీజన్లో నందిగామ, చందర్లపాడు, పెనుగంచిప్రోలు మండలాలకు చెందిన 200 మంది రైతులు, కౌలు రైతులు 300 ఎకరాల్లో కలాషా కంపెనీకి చెందిన 414, కుబేరా రకాల విత్తనాలను సాగు చేసి నష్టపోయారు. చెట్టు ఏపుగా పెరిగినా పూత, కాయ రాకపోవడంతో ఎకరానికి లక్ష రూపాయలకుపైగా నష్టపోయారు. నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. నెలరోజులైనా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ఈ సమస్యకు కారణాన్ని గుర్తించి నివేదిక సిద్ధం చేయకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లతామర ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ నకిలీ విత్తనాలను సైతం అదేగాటన కట్టి విత్తన నాణ్యతను నిర్ధారించకుండా కంపెనీకి ప్రయోజనం కలిగించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు.

                                                  అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి

                                                షేక్‌ జాన్‌బాషా, కాకర రైతు, కొత్తపల్లి

2019 డిసెంబర్లో ఎకరంలో కాకర సాగు చేశా. దుక్కులు, కలుపులు, మందులు, తీగ పాకడానికి బాదులు కొనడం, పాతడం వంటి వాటికి లక్ష రూపాయల వరకూ అప్పు చేసి పెట్టుబడి పెట్టా. ఒక్క రూపాయీ చేతికి రాలేదు. ఎకరానికి రూ.80 వేలు ఇవ్వాలని అధికారులు కంపెనీని ఆదేశించారు. రెండేళ్లయినా అందలేదు. రూ.లక్ష అప్పు తెస్తే దానికి రూ.60 వేల వరకూ వడ్డీ అయ్యింది.

                                           పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం
                             టి.మోహనరావు, కృష్ణా జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌

నకిలీ, కల్తీ విత్తనాలు, విత్తన లోపాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించడానికి కృషి జరుగుతోంది. గతంలో కొంతమంది రైతులకు కొన్ని కంపెనీల ద్వారా నష్టపరిహారం ఇప్పించాం. మిగిలిన కంపెనీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం.

11