న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఫిరోజ్‌బాద్ ఫ్లైఓవర్‌పై 20 నిమిషాల పాటు ప్రధాని మోడీ ఇరుక్కోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు తాను స్ట్రీట్ ఫైటర్‌గా చెప్పుకుంటున్న దేశ ప్రధాని అసలు రూపం బయట పడింది. గతంలో రైతుల విషయంలో మోడీ అహంకార పూరితంగా వ్యవహరించారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర హోం మంత్రి వద్ద వాపోగా.. ఆయనకు కొంచెం తిక్క ఉందని, ఏ విషయమైనా తనతో మాట్లాడాలని స్వయంగా మాలిక్ ఓ సమావేశంలో మాట్లాడిన మాటలు.. ఇప్పుడు ఈ ఘటనతో పోల్చి చూడాల్సి వస్తోంది. అయితే నాగరిక ప్రజాస్వామ్యంలో సంప్రదాయాలు, మర్యాదలకు కట్టుబడి మోడీ ప్రధాని కాలేదని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆ స్థాయికి ఎదగడానికి ప్రధాన కారణం.. ఉత్తేజ, ఉద్రేక పరిచే ఆయన మాటలే. ఇవే బిజెపి శ్రేణులకు ఊపిరినందిస్తున్నాయి. దీంతో బిజెపి.. సీనియర్ నేతలైన ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీలను కాదని మోడీకి పెద్ద పీట వేశారు. రాజకీయ ఉద్దండులు అటల్ బీహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ భావజాలానికి విరుద్ధంగా.. మోడీ ప్రధాని అయ్యారు.
ఇప్పుడు ఫిరోజ్‌బాద్ ఫైఓవర్‌పై 20 నిమిషాలు ప్రధాని మోడీ కాన్వారు నిలిచిపోయిన తర్వాత సరికొత్త ప్రధానిని ప్రజలు చవిచూశారు. దీన్ని బట్టి చూస్తే ఆయన భయపడ్డారా అన్న సందేహం రాక మానదు. అదే మోడీ 10 ఏళ్ల క్రితం.. ఇదే సమస్య ఎదురైతే ఇలా ప్రవర్తించకపోవచ్చు. ఆయన రెండు అవకాశాలను వినియోగించుకుని ఉండవచ్చు. వాటిలో ఒకటి... రహదారిని అడ్డుకున్న రైతుల వద్దకు వెళ్లి.. వారితో సంభాషించేవారు. అదేవిధంగా ఎటువంటి బెదిరింపులు, హింసాత్మక ఘటనలకు తావు లేనందున.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఓ నేతగా నడుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య కనుక.. గతంలో భద్రతా వలయాన్ని దాటుకుని.. పలువురితో ఫొటోలు దిగినట్లు.. ఇప్పుడూ చేయవచ్చు. అంతేకాకుండా.. తన అధికారాన్ని వినియోగించి.. కేంద్ర బలగాలను అక్కడకు రప్పించి.. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను అక్కడి నుండి తప్పించమని ఆదేశాలు జారీ చేసి ఉండవచ్చు. కానీ ఈసారి ఆయన అలా ప్రవర్తించలేదు. కెమెరాకు పనిచెప్పేందుకు.. ఓ డ్రామాకు తెరలేపుతూ.. కారులోనే మిన్నకుండిపోయారు.
ఈ డ్రామా వెనుక అసలు కథ ఏంటంటే.. ఫిరోజ్‌పూర్ సభలో జనాలు లేరన్న ఇంటెలిజెన్స్ వార్తల నేపథ్యంలో... ఇప్పటికే రైతు చట్టాలతో పంజాబ్‌లో చతికిల పడ్డ బిజెపిని తిరిగి పుంజుకునేలా చేసేందుకు, తనపై అక్కడి ప్రజల్లో సానుకూలతను తెచ్చుకునేందుకు.. ఈ ఎత్తుగడను సృష్టించారు. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు.. ఆ స్క్రిప్ట్ బెడిసి కొట్టి.. తిరిగి ఆయన నెగిటివిటీని మూటగట్టుకున్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ చర్య సీనియర్ భద్రతా సిబ్బంది ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చేదిగా ఉంది. అయితే ప్రధాని మోడీ అసహనం, ఉద్రేకం... ప్రజాస్వామానికి ప్రమాదకర సూచనగా అంచనా వేయవచ్చు.










