- పిఎన్‌ఎం మహాసభలో సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, విజయవాడ : ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాలు నష్టపోతున్నాయని, దీన్ని ఆసరా చేసుకుని అస్తిత్వ ఉద్యమాలు ప్రబలుతున్నాయని ప్రముఖ సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వైఎస్‌ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పోరంకి కిలారి అనిల్ ఎస్టేట్ (డాక్టర్ గరికపాటి రాజారావు ప్రాంగణం)లో ప్రజానాట్య మండలి (పిఎన్‌ఎం) పదో రాష్ట్ర మహాసభ రెండో రోజు కార్యక్రమాలను సోమవారం అమరావతి బాలోత్సవం గౌరవాధ్యక్షులు, విజయవాడలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ చలువాది మల్లికార్జునరావు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అస్తిత్వ ఉద్యమాలు సమస్యలపై ప్రజలను సంఘటితం కాకుండా చేస్తున్నాయన్నారు. పీడిత తాడిత ప్రజలంతా సంఘటితంగా ఉద్యమిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. మార్క్సిజం ప్రాతిపదికన వర్గదక్పథంతో కళారూపాలు రూపొందించి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. వర్గ ప్రాతిపదికన ఐక్యం చేసి సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. ప్రజాకళలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు. కొందరు కళాకారులు వ్యక్తిగతంగా తమకు గుర్తింపు రావడం లేదని బాధపడుతుంటారని, ఇది దోపిడీ వర్గాల సంస్కృతిగా గుర్తించాలని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు, నష్టాలు ఇతివృత్తంగా తీసుకుని వీధి నాటకాలను ప్రదర్శించినప్పుడు ప్రజలే కళాకారులను ఆదరిస్తారని, ఇదే కళాకారులకు నిజమైన గుర్తింపు అని అన్నారు. ప్రజల స్పందనే కళాకారులకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. చలువాది మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజాహితం కోరుకునే అభ్యుదయవాదులు, సుందరయ్య వారసులైన పిఎన్‌ఎం కళాకారులకు తానెప్పుడూ తోడ్పాటునందిస్తానన్నారు. తన తండ్రి జమలయ్య 41వ వర్థంతిని కళాకారుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలుత అభ్యుదయవాది జమలయ్య, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు చిత్రపటాలకు ఆయన పూలమాలలువేసి నివాళులర్పించారు. పిఎన్‌ఎం రాష్ట్ర నాయకులు కృష్ణవేణి, షేక్ వలి, పి.విజయకుమార్, జి.రమణ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అనంతరం పిఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై జిల్లాల వారీగా ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, సాంస్కృతిక ఉద్యమ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, పిఎన్‌ఎం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి కట్టా నరసింహా, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గాదె సుబ్బారెడ్డి, పిఎన్‌ఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి పి.అప్పన్న, కృష్ణా జిల్లా ఆధ్యక్షులు ఖమ్మం కొండలబాబు పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను, గిరిజన సంస్కృతుల కళారంగాన్ని కాపాడుకుందాం
మహాసభలో పలు తీర్మానాల ఆమోదం
కేంద్రంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రచయితలు, కవులు, కళాకారులపై దాడులు పెరిగాయని, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలని చిత్తూరు జిల్లాకు చెందిన ఒ.రమణ ప్రతిపాదించిన తీర్మానాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన దశరథ బలపరిచారు. మహాసభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. గిరిజన సంస్కృతుల కళారంగాన్ని కాపాడాలని మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు రంపచోడవరం జిల్లాకు చెందిన ఐ.రమణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గుర్మిత్సింగ్ బలపరిచారు. దీన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.










