ప్రజాశక్తి-ఎ.కొండూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాల వల్ల వ్యవసాయం రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వంపల్లి నాగరాజు అన్నారు. ఆదివారం మండలంలోని చీమలపాడు గ్రామంలో రామకృష్ణ మ్యాంగో మార్కెట్లో వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం భూక్య జమలమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉందన్నారు. గతంలో వ్యవసాయ కూలీలకు కూలి చెల్లించే విషయంలో భూస్వాములకు, వ్యవసాయ కూలీలకు మధ్య జరిగిందని, రానురాను ఆ పోరాటం ప్రభుత్వానికి, కూలీలకు మధ్య జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీల తరపున రాజీలేని పోరాటం నిర్వహిస్తోందన్నారు. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ కూలీలకు వచ్చే కూలి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో సరిపోవడంలేదని తెలిపారు. వచ్చే నెల 28, 29 తేదీల్లో మైలవరం మండలం పుల్లూరులో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జరుగుతాయని, ఆ సభలకు వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 24న విజయవాడలో జరిగే దేశ రక్షణ భేరి సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను గుండాల వెంకటరత్నం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎ.అమ్మిరెడ్డి, గిరిజన సంఘం మండల కార్యదర్శి డి.రాముడు, మహిళా సంఘం మండల కార్యదర్శి ఆళ్ల ఉమాదేవి, సిఐటియు మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ 11 మందితో ఏర్పాటైంది. మండల కార్యదర్శిగా పి.ఆనందరావు, అధ్యక్షురాలిగా పిన్నిబోయిన సీతారావమ్మ తదితరులలు ఎన్నుకోబడ్డారు.










