Jul 20,2021 20:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోవిడ్‌ ఉధృతి తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు సాధారణ సమయాల్లో పనిచేయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా సబ్‌ డివిజన్‌, మండలస్థాయి కార్యాలయాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకూ విధులు నిర్వహించాలని సూచించారు. సెక్రటేరియట్‌, హెడ్‌ఆఫ్‌ది డిపార్టుమెంటు, కార్పొరేషన్లలో ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు విధులు నిర్వహించాలని ఆదేశించారు. అయితే జిల్లాస్థాయిలో పనిచేసే అన్ని కార్యాలయాలకూ రెండో శనివారం సెలవుగా ప్రకటించారు. సెక్రటేరియట్‌ తదితర డిపార్టుమెంట్లకు శని, ఆదివారాలు సెలవు ప్రకటించారు. ఈ సమయాలన్నీ ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. రాత్రి పది నుంచి ఉదయం ఆరుగంటల వరకూ అమల్లో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు.