Sep 24,2020 07:50

ప్రైవేటీకరించిన రైళ్ళలో ప్రయాణీకుల నుండి ఎంత ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించుకొనే అధికారం ప్రైవేటు యజమానులకే ఇవ్వనున్నట్లు రైల్వేబోర్డు ఛైర్మన్‌ వి.కె.యాదవ్‌ ప్రకటించారు. రైల్వే ఛార్జీలలో భాగంగానే రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం యూజర్‌ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. రైల్వేలకు అదనపు ఆదాయం, ప్రయాణీకులకు ఆధునిక సదుపాయాలు కల్పించటం కోసం యూజర్‌ ఛార్జీలను వసూలు చేయనున్నట్లు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకులకు ఛార్జీలలో అత్యధిక రాయితీలు ఇస్తున్నాయని, వాటిని క్రమబద్ధీకరించటం కోసం ప్రణాళిక రూపొందించినట్లు కూడా ఆయన చెప్పారు. ఈ విధానాలు దేశ ప్రజానీకంపై విపరీతమైన భారాలు వేయటానికి, ప్రజలను కొల్లగొట్టి పెట్టుబడిదారులు అపారమైన లాభాలను సంపాదించుకోవటానికి దారితీస్తాయి. ఛార్జీల క్రమబద్ధీకరణ పేరుతో వివిధ తరగతుల ప్రజలకు ఇస్తున్న రాయితీలను రద్దు చేస్తారు. రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్న సామాన్య ప్రజలకు ప్రయాణమే పెనుభారంగా మారుతుంది.
భారతీయ రైల్వేలు ప్రపంచం లోనే అతి పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి వున్నాయి. దేశంలో 1,23,236 కిలోమీటర్ల పొడవున రైల్వేలైన్లు ఉన్నాయి. 13,452 ప్రయాణీకుల రైళ్ళ ద్వారా రోజుకు 2.3 కోట్ల మంది, సంవత్సరానికి 800 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. 9,141 సరుకు రవాణా రైళ్ళు ప్రతిరోజూ 33 లక్షల టన్నుల సరుకులను దేశం నలుమూలలకు చేరవేస్తున్నాయి. ప్రయాణీకులు, సరుకు రవాణా ద్వారా రైల్వేలకు 2018-19 సంవత్సరంలో రూ. 1,97,214 కోట్ల ఆదాయం వచ్చింది. అన్ని ఖర్చులు, పన్నులు, డివిడెండ్లు చెల్లింపులు పోను రూ. 6,014 కోట్ల నికరాదాయం వచ్చింది. ప్రైవేటు సంస్థల వలె రకరకాల మోసాలకు పాల్పడి, ఆదాయాన్ని తక్కువ చూయించి, తక్కువ పన్నులు చెల్లించిన తర్వాత వచ్చిన ఆదాయం లాంటిది కాదు ఇది. చట్టాలకు అనుగుణంగా నిజాయితీగా ప్రభుత్వానికి అన్ని విధాలైన పన్నులు, చట్ట ప్రకారం ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించిన తర్వాత వచ్చిన ఆదాయం. రైల్వేలలో ప్రస్తుతం 12.3 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. రేల్వేల ఆధునీకరణకు, విస్తరణకు ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోకపోవటం వలన దేశంలో జరుగుతున్న సరుకు రవాణాలో రైల్వేల వాటా క్రమంగా తగ్గుతున్నది. రైల్వేల ద్వారా సరుకు రవాణా తగ్గి, రోడ్డు మార్గం ద్వారా ప్రైవేటు వాహనాలలో ఎక్కువ సరుకులు రవాణా కావటంతో రవాణా ఛార్జీలు పెరిగి ప్రజలు వినియోగ సరుకులకు ఎక్కువ ధరలను చెల్లించాల్సి వస్తున్నది.
చార్జీలు 'వారిష్టం'
ప్రస్తుతం ప్రభుత్వం కొన్ని ప్రయాణీకుల రైళ్ళను ప్రైవేటు వారికి అప్పగిస్తున్నది. ప్రైవేటు వారికి అప్పగించిన రైళ్ళలో ఛార్జీలను నిర్ణయించే అధికారం వారికే ఇవ్వటంతో ఛార్జీలను వారిష్టం వచ్చినట్లుగా నిర్ణయిస్తారు. రానున్న కాలంలో మరిన్ని రైళ్ళను, సరుకు రవాణా రైళ్ళను కూడా ప్రైవేటు వారికి అప్పగించి, చివరకు రైల్వేలను మొత్తంగా ప్రైవేటు వారికి అప్పగించినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ప్రయాణీకులను తరలించటంలో ఆర్‌టిసి, ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రైవేటు బస్సులు టైం పాటించటం ఉండదు. బస్సు నిండే వరకు వేచి చూస్తారు. పండుగలు, ఇతరంగా ప్రజలు ఎక్కువగా ప్రయాణించే సందర్భాలలో ఛార్జీలను భారీగా, కొన్ని సందర్భాలలో విమాన ఛార్జీలతో సమానంగా పెంచుతున్నారు. రకరకాల అక్రమాలతో ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించకుండా ఒకే రిజిస్ట్రేషన్‌ నంబరుపై రెండు, మూడు బస్సులను తిప్పుతున్నారు. రైళ్ళను ప్రైవేటు వారికి అప్పగించిన తర్వాత వారూ ఇటువంటి అక్రమాలకే పాల్పడతారు.
కొన్ని ప్రయాణీకుల రైళ్ళను ప్రైవేటువారికి అప్పగించటం వలన ఏం జరుగుతుంది? ఒకే మార్గంలో ప్రభుత్వ రైళ్ళు, ప్రైవేటు రైళ్ళు తిరుగుతుంటాయి. ప్రైవేటు వారు తమ ఆదాయాన్ని, ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి రెండు పద్ధతులను అనుసరిస్తారు. ఒకటి - ప్రభుత్వ రైళ్ళు, తమ రైళ్ళు ఒకే మార్గంలో నడుస్తున్నపుడు మొదట తాము నడుపుతున్న రైళ్ళలో ఛార్జీలను బాగా తగ్గించటం ద్వారా ఎక్కువ మంది ప్రయాణీకులు తమ రైళ్ళ లోనే ప్రయాణం చేసేలా చేసి, ప్రభుత్వ రైళ్ళకు నష్టాలు వచ్చి, గిట్టుబాటు కాని పరిస్థితిని కల్పిస్తారు. రెండు - తాము నడుపుతున్న రైళ్ళలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రభుత్వ రైళ్ళలో తక్కువ ఛార్జీలు, ప్రైవేటు రైళ్ళలో ఎక్కువ ఛార్జీలు ఉంటే ప్రజలు ప్రభుత్వ రైళ్ళలోనే ప్రయాణం చేస్తారు. కాబట్టి తాము రైళ్ళను నడుపుతున్న మార్గాలలో ప్రభుత్వ రైళ్ళు తమకు పోటీ లేకుండా చేయటం కోసం ప్రభుత్వం, ఉన్నతాధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ రైళ్ళను, సదుపాయాలను కుదించి, ప్రభుత్వ రైళ్ళు ఉండటం లేదని, ఉన్న రైళ్ళను ఎక్కినా సమయానికి చేరలేమని, ప్రైవేటు రైళ్ళను ఎక్కటం మినహా గత్యంతరం లేదనే వాతావరణం సృష్టిస్తారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తాము రైళ్ళు నడుపుతున్న మార్గాలలో...ప్రభుత్వం రైళ్ళు నడపకుండా చేయటానికి కూడా ప్రయత్నిస్తారు. ప్రభుత్వ రైళ్ళను తప్పించిన మార్గాలు పూర్తిగా తమ ఆధీనం లోకి వచ్చిన తర్వాత ఛార్జీలను తమ ఇష్టం వచ్చినట్లుగా పెంచుతారు. ప్రయాణీకులకు కనీస సదుపాయాలు కూడా కల్పించరు. ఈ విధంగా తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ప్రజలను దోపిడీ చేస్తారు. ప్రస్తుతం ప్రైవేటు వారి నిర్వహణలో ఉన్న రంగాలలో కనిపిస్తున్న ఈ ధోరణులన్నీ ఇక నుండి రైల్వేలలో కూడ చోటు చేసుకుంటాయి.
ప్రయాణీకుల రైళ్ళలో ప్రజలకు ఎక్కువ రాయితీలు ఇస్తున్నారని, వాటిని క్రమబద్ధీకరించాలని చెప్పారు. క్రమబద్ధీకరణ అంటే వివిధ తరగతుల ప్రజలకు ఇస్తున్న రాయితీలను తగ్గిస్తారు. వికలాంగులు, వృద్ధులు, నెలవారి సీజన్‌ టికెట్లు తీసుకొనే వారికి ఛార్జీలలో రాయితీలు ఇస్తున్నారు. మొత్తంగా చూసుకున్నపుడు ప్రైవేటు బస్సులతో మాత్రమే కాక ఆర్‌టిసి బస్సులతో పోల్చినా రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఛార్జీలలో రాయితీలు కావాలని అనేక ఆందోళనలు జరిగిన తర్వాత ప్రజల ఆర్థిక పరిస్థితి, సామాజిక న్యాయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రాయితీలు ఇస్తున్నారు. వలసలు వెళ్ళే కార్మికులు, రోజువారీ పనుల కోసం గ్రామాల నుండి పట్టణాలు, నగరాలకు వెళ్ళి, తిరిగి వచ్చే కార్మికులకు సీజన్‌ టికెట్లపై రాయితీలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఈ రాయితీలను రద్దు చేస్తే ఈ తరగతుల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీల పెంపుదల ప్రజలందరి ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది.
దేశభద్రతకు ప్రమాదం
ప్రయాణీకులు, సరుకు రవాణా రైళ్ళు ప్రైవేటు వారి చేతుల్లోకి పోతే ప్రజలపై భారాలతో పాటు దేశభద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అత్యవసర సమయాలలో సరిహద్దులకు ఆయుధాలను, సైన్యాన్ని తరలించాలంటే ప్రైవేటు వారు తరలిస్తారనే గ్యారంటీ లేదు. దేశభద్రత కన్నా తమ స్వలాభమే వారి లక్ష్యంగా ఉంటుంది. సైన్యాన్ని, యుద్ధ పరికరాలను తరలించకుండా ఉంటే లాభం వస్తుందనుకుంటే తరలించరు. లాభాల కోసం విదేశాలతో కుమ్మక్కై దేశభద్రతకు ప్రమాదం కల్పించటానికి ఏ మాత్రం వెనుకాడరు. రైల్వేలలో ప్రైవేటు వారే ఛార్జీలు నిర్ణయించుకోవటానికి అవకాశం ఇస్తున్న ప్రభుత్వ విధానాన్ని తిప్పికొట్టటానికి పూనుకోవాలి.