Jul 20,2021 22:19

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్‌ అసమర్థ నిర్వాకమే కొంప ముంచిందని రాజ్యసభలో సిపిఎం పక్షనేత ఎలమరం కరీం విమర్శించారు. కార్పొరేట్‌ శక్తులకు లాభాలు చేకూర్చే వ్యాక్సిన్‌ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా నిర్వహణ, వ్యాక్సిన్‌ పాలసీ అమలుపై స్వల్పకాలిక మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన పాల్గంటూ, కరోనాపై పోరులో అగ్రభాగాన ఉన్న ఫ్రంట్‌ వర్కర్స్‌ కు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదు అయిన రెండు నెలల తరువాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిందని, ఆ రెండు నెలల వ్యవధిని కరోనా పై పోరుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు ఉపయోగించిందా అంటే అదీ లేదు. ప్రజల్లో అవగాహణ కల్పించడానికి బదులు అనవసరమైన భయాందోళనలను రేకెత్తించేలా వ్యవహరించింది. కరోనా రెండో దశను అంచనా వేయటంలోనూ విఫలమైంది,. ఆక్సిజన్‌, బెడ్లు, మందుల కొరతతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రజల ప్రాణాలకన్నా కార్పొరేట్ల లాభాలే మిన్నగా భావించి వ్యాక్సిన్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం వెరసి పెను విపత్తుకు దారితీసిందని విమర్శించారు. వ్యాక్సిన్ల కొరతకు ప్రభుత్వం అనుసరించిన లోపభూయిష్టమైన విధానాలే కారణమన్నారు. ప్రైవేట్‌ శక్తుల చేతుల్లో 25 శాతం వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెట్టే ముదనష్టపు విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. సిఎంఐఈ నివేదిక ప్రకారం లాక్‌డౌన్ల వల్ల 12.2 కోట్ల ఉద్యోగాలను పోయాయని, రెండో దశ కరోనాలో 41 లక్షల ఉద్యోగాలు కోల్పోయారని కరీం వివరించారు.


సిపిఐ ఎంపి బినరు విశ్వం మాట్లాడుతూ, కరోనాను ఎదుర్కొవడంలో ప్రధాని మోడీ విజయవంతం అయ్యారని బిజెపి ఎంపిలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు,. కరోనాపై విజయం సాధించినట్లు గొప్పలు పోతున్న ప్రభుత్వం దేశంలో దాదాపు ఐదు లక్షల మంది కరోనా బారిన పడి మఅతి చెందిన విషయం, కోట్లాది మంది ప్రజలు ఉపాధి కోల్పోయిన విషయం మరచిపోయిందా అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ ఒక్కటే పరిష్కారమని, అయితే దాన్ని సక్రమంగా అమలు చేయటం లేదని విమర్శించారు. పిఎం కేర్స్‌ ఫండ్స్‌ ఏమయ్యాయని ప్రశ్నించారు. దేశంలోనే కేరళలో మరణాల రేటు చాలా తక్కువ ఉందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఅషి చేస్తున్నామని పేర్కొన్నారు. టిడిపి ఎంపి కె. రవీంద్ర కుమార్‌ మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలు అందించలేదని, కరోనా బాధితులకు సాయం అందించలేదని పేర్కొన్నారు.