రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పునాది సంపాదించుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. జాతీయోద్యమానికి, మత సామరస్యానికి, గుంటూరు సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా ఉన్న జిన్నా టవర్ ను కూల్చేస్తామని బెదిరించడం క్షంతవ్యం కాని నేరం. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం, విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి విధానం. అది యు.పి లో అయినా ఎ.పి లో అయినా సారాంశం ఒక్కటే. ఆ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే విష ప్రచారాన్ని ప్రారంభించారంటే ఆ సమావేశాల్లోనే ఇందుకు పకడ్బందీ పథకం రూపొందించారన్నది సుస్పష్టం. మారుమూల గ్రామాల్లోకి విస్తరించాలని ఆయన ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కాబట్టి ఈ విద్వేష ప్రయత్నం ఇంకెన్ని రీతుల్లో విషం చిమ్ముతుందో చెప్పలేం. చీప్ లిక్కర్ మత్తులో జనాన్ని ముంచుతామని నిస్సిగ్గుగా మొదలుబెట్టారు. ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన మత విద్వేష మత్తులో రాష్ట్రాన్నే ముంచడానికి సిద్ధమౌతున్నారు. మత సామరస్యానికి మారుపేరులా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్వేష రాజకీయాలను ఎంతమాత్రమూ సాగనివ్వరాదు.
ప్రత్యేక హోదాతో సహా అన్ని విభజన హామీలనూ తుంగలో తొక్కి, అక్కడితో ఆగక మనం పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును సైతం అమ్మివేయడానికి తయారైంది బిజెపి. ఈ రాష్ట్రానికి బిజెపి చేసిన ద్రోహాన్ని క్షమించడానికి ప్రజలు ఏంతమాత్రమూ సిద్ధంగా లేరు. అందుకే వారి దృష్టిని ఇలా విద్వేష రాజకీయాల వైపు మళ్ళించాలని చూస్తోంది బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్ తన అనుబంధ సంస్థల నెట్‌వర్క్ పెంచుకొని రాష్ట్రంలో తన పథకాన్ని బిజెపి అమలు చేస్తోంది. 32 మంది ప్రాణ త్యాగాలతో, తెలుగు నేల నలుచెరగులా సాగిన మహోద్యమ ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని చెబుతున్న బిజెపి ఆ ఊళ్లోని పెద్దాసుపత్రి పేరు మార్చాలని తాజాగా డిమాండ్లు పెట్టడం వెనుకగల మర్మమేమిటి ?
హిందూ ముస్లిం సామరస్యం ఈ రాష్ట్ర సంస్కృతి, చరిత్రలో విడదీయరాని అంశం. ఇటు నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ మొదలు అటు ఇచ్ఛాపురంలో చేసుకునే పీర్ల పండుగ వరకూ అన్నీ మత సామరస్యాన్ని చాటి చెప్పేవే. కడప దర్గాకు అనేకమంది ముస్లిమేతరులు పవిత్ర భావనతో వెళ్లి దర్శించుకోవడం అందరికీ తెలిసిందే! బీబీ నాంచారి కథ కూడా అలాంటిదే. తెలుగునాట ఇటువంటి ఉదాహరణలు లెక్కకు మిక్కిలి పేర్కొనదగినవి ఉన్నాయి. 'హిందూ, ముస్లిం, క్రైస్తవులూ ఎవరైతేనేం మానవులే..' అన్న స్ఫూర్తిని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. ఆ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న బిజెపి- ఆర్‌ఎస్‌ఎస్ యత్నాలను తిప్పికొట్టాలి. ఈ రాష్ట్రం మనది. మనకు ద్రోహం చేయడమే గాక ఇప్పుడు మనమధ్య ఐక్యతకూ చిచ్చు పెడుతున్న బిజెపి కుట్రలను వమ్ము చేయడం మన అందరి కర్తవ్యం.
ఈ కుటిల వ్యూహాన్ని తిప్పికొట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం దృఢంగా నిలబడవలసిన బాధ్యత ఉన్న ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ ప్రమాదాన్ని ఉపేక్షిస్తూ తమ అవకాశవాద రాజకీయాలతో, పరస్పర విద్వేషపూరిత ఆరోపణల్లో మునిగి తేల్తున్నాయి. రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తున్న బిజెపిని పార్లమెంటులో భుజాల మీద మోస్తున్నాయి. ప్రజాగ్రహ సభ పేరిట మత భావాల్ని రెచ్చగొట్టి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన బిజెపి ని నేరుగా తిప్పికొట్టే ధైర్యం చేయలేక అది టిడిపి స్క్రిప్టు అని వైసిపి నేతలు నసగడం సిగ్గుచేటు. గో పూజలు చేయడం, దానిని ఎక్కువగా ప్రచారం చేయడం ద్వారా వైసిపి కూడా కాషాయ మూకలు పేట్రేగిపోడానికి దోహదం చేస్తోంది. ఇక టిడిపి కూడా గతంలో దేవాలయాలపై దాడులు జరిగాయనీ అన్య మత ప్రచారం సాగుతోందని కాషాయ మూకలు లేవనెత్తిన దుమారాన్ని భుజాన వేసుకుంది. రామతీర్థం వివాదంలో టిడిపి తీరు పరిశీలిస్తే ఆ వైఖరినే కొనసాగిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి ఒకరికొకరు పోటీగా బిజెపిని ప్రసన్నం చేసుకునే తాపత్రయంలో ఉన్నాయి. కాని బిజెపిది ధృతరాష్ట కౌగిలి. త్రిపురలో కాంగ్రెస్ వారు యావన్మందీ బిజెపిలో చేరిపోవడం, బెంగాల్‌లో తృణమూల్ ముఖ్య నేతలు సైతం కాషాయ కండువా వేసుకోవడం, చివరికి టిడిపి నుండి గెలిచిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిపోవడం చూసైనా ఇక్కడి ప్రాంతీయ పార్టీలు కళ్ళుతెరవాలి. ఇక బిజెపితో ఏకంగా జతకట్టిన తర్వాత జనసేనాని కళ్ళు తెరవడం సాధ్యమా అన్నది ప్రశ్న.
- బి తులసీదాస్










