అంతా గజ ఈతగాళ్లే గాని ఈదింది గజం కూడా లేదన్నట్టు తయారైంది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. కావడానికి జాతీయ ప్రాజెక్టు. కాని కేంద్రంలో ఘనత వహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వ పెద్దలు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ ఏడాదిన్నరగా జగన్ ప్రభుత్వం పనుల వేగం, పూర్తయిన శాతం గురించి ఇచ్చిన చిత్రణకూ వాస్తవాలకూ పొంతన లేకుండా పోయింది. ఢిల్లీ పర్యటనల హడావుడి, వచ్చాక తాము సాధించిన దాని గురించిన గొప్పలకు లోటు లేకున్నా అసలైన ఆర్థికానికి వచ్చే సరికి నిధుల పీట ముడి మరింత బిగిసిందే గాని సడలింది లేదు. దీనిపై వైసిపి, టిడిపి ఒకరినొకరు నిందించుకుంటుంటే అసలు బాధ్యత వహించవలసిన మోడీ ప్రభుత్వం పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు తప్పించుకుంటున్నది. పోలవరం నిర్మాణంపై 2014 అంచనాల ప్రకారం రూ. 20 వేల కోట్ల పైచిలుకు ఖర్చులో ఇచ్చింది పోను ఇంకా రూ. నాలుగు వేల కోట్లు మాత్రమే వస్తాయంటున్నది. తర్వాత పెరిగిన ఖర్చుతో తమకు సంబంధం లేదని కేంద్రం కుండబద్దలు కొట్టింది. రాష్ట్రం గుండె బద్దలు కొట్టింది. ఈ కథాక్రమం చాలా పెద్దదీ, కుటిలమైందీ. నిర్వాసితులవుతున్న లక్షలాది మంది గిరిజనులు ఇతర పేదల పట్ల కాస్తయినా కనికరం లేని కర్కశ రాజకీయమది. 2014 నుంచి ఇప్పటివరకూ వినిపించిన తేదీలూ చూపించిన విదిలింపులూ పక్కన పెడితే ఈ విద్రోహగాధ విభజన చట్టం ఉల్లంఘనతోనే మొదలైంది. ప్రత్యేక హోదా వలె గాక పోలవరంను జాతీయ ప్రాజెక్టు హోదా కేంద్రం బాధ్యత ఆ చట్టంలోనే వుంది. అయినా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక ప్రకటనలో నాల్గవ అంశంగా పోలవరం గురించి చెప్పారు.
ప్యాకేజీలోనూ ఇదే మాట !
ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎలో భాగస్వామిగా టిడిపి, రాష్ట్రంలో దాని నాయకత్వంలో బిజెపి అధికారం పంచుకున్నా పోలవరం అడుగు ముందుకు పడలేదు. కేంద్రం ఎప్పటికప్పుడు తాము నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణ భాగం మాత్రమే. అది కూడా 2014 నాటి అంచనాల ప్రకారం మాత్రమే భరిస్తానని చెబుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాట్లాడలేదు. ఆ మేరకైనా జరిగిందీ లేదు. ప్రత్యేక హోదా రెవెన్యూ లోటు భర్తీ, బుందేల్‌ఖండ్ ప్యాకేజి, వెనకబడిన జిల్లాల నిధులు, పోలవరం అన్నీ మాటలకే పరిమితమైనా ప్రచారానికి లోటు లేకపోయింది. ప్రతిపక్షాల విమర్శలు, ప్రజాసంఘాల ఆందోళనల తర్వాతే 2016 చివరి పాదంలో హడావుడి పెరిగింది. ఆ ఏడాది సెప్టెంబరు 8 అర్థరాత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఇలా వుంది: పోలవరం ప్రాజెక్టు ఖర్చు భరిస్తాం. అది కూడా విదేశీ అప్పు తెచ్చుకుంటే తిరిగి చెల్లించడం కాని, నిర్మాణం కాని రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నివేదికలు అందిన మేరకు చెల్లింపులు చేస్తుంటాం-జల వనరుల మంత్రిత్వశాఖ నుంచి 2016 డిసెంబరు 23న జాతీయ జల వనరుల వృద్ధి సంస్థ (ఎడబ్ల్యుడిఎ)కు పంపిన వర్తమానంలో నీటి పారుదల వ్యయానికి మాత్రమే పరిమితమై వాస్తవిక ప్రగతి ఆధారంగా తనిఖీ జరిగి సర్టిఫికెట్టు వచ్చాకే చెల్లింపులు చేయాలని స్పష్టంగా వుంది. క్యాబినెట్ ఆమోదించిన, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన షెడ్యూలు ప్రకారమే నిర్మాణం పూర్తికావాలని చెప్పింది. నిధులు అందిన తర్వాత 18 మాసాల లోగా ఆడిట్ నివేదికలు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర భ్రుత్వంపై వుంటుంది. ముందుగా అనుమతి తీసుకోకుండా వ్యయం పెంచడం అనుమతించబడదు. అప్పులపై వడ్డీలు కట్టాల్సి వుంటుంది గనక సరిగ్గా సమయంలోనే నిధులు విడుదల అవుతాయని స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించే పేరుతో 2017 మార్చి 15న కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలోనూ ఈ విషయం స్పష్టంగా వుంది.
చారిత్రాత్మకమన్న చంద్రబాబు
ఇన్ని మతలబులు వున్నప్పటికీ చంద్రబాబు నాయుడు పోలవరం నిర్ణయం అపూర్వమనీ చారిత్రాత్మకమనీ పొగిడారు. గుజరాత్, మహారాష్ట్రలకు భారీగా నిధులు మరలించి పోలవరం కోసం తొలిసారి రూ. మూడు వేల కోట్ల లోపు విదిలిస్తే 'ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు' అని సెంటిమెంటు కురిపించారు. క్రికెటర్ల బహుమతి మొత్తం లాగా భారీ చెక్కుపై సొమ్ము తీసుకుని రాష్ట్రాన్ని తక్కువ చేశారు. సోమవారం పోలవారం అనీ సమీక్షల సందడి పెంచారు. కాని రూ. 55 వేల కోట్ల మేరకు సవరించిన ప్రాజెక్టు వ్యయం అంచనా 2017 ఆగష్టు నాటికి గాని పంపినా ఎలాంటి ఆమోదం రాలేదు. అయినా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనేది చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా వుండిపోయింది. పాత కాంట్రాక్టరు వేగంగా పనిచేయడం లేదనే విమర్శ మొదలుపెట్టింది. కాంగ్రెస్ లోనూ టిడిపి లోనూ ఎం.పి గా వున్న రాయపాటి సాంబశివరావు రష్యాకు చెందిన 'ట్రాన్స్‌ట్రారు' కంపెనీతో ముడి వేసుకుని అంతర్జాతీయ కోటాలో టెండరు సంపాదించారు గాని పని మాత్రం చెల్లింపులు రాలేదంటూ మందకొడిగా నడిపించారు. లాభదాయకంగా చేయగల మట్టిపని తర్వాత కాంక్రీటు దశకు వచ్చేసరికి చేతులెత్తేశారు. వారిని మార్చడానికి కేంద్రం ఒప్పుకోలేదని సబ్ కాంట్రాక్టరును నియమించేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం చేసింది. దీనిపై ప్రత్యేకంగా చంద్రబాబు నాసిక్ వెళ్లి కేంద్ర నీటి పారుదల మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి వచ్చారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రచారం వస్తుంది గనక పాత రేటుకే చేసేందుకు 'నవయుగ' ఒప్పుకుందని చంద్రబాబు ధన్యవాదాలు చెప్పినా విద్యుత్ కేంద్ర నిర్మాణంలో ఎక్కువ లాభం వచ్చేలా సర్దుబాటు చేశారు. ఆ సమయంలో ఎక్కువగా కేంద్రీకరించిన పట్టిసీమ, పురుషోత్తమపట్నం నిర్మాణం నిధుల మళ్లింపు అని బిజెపి నేతలు విమర్శించారు. పునరావాస వ్యయం ఎక్కువ చూపించి టిడిపి నేతలు కాజేస్తున్నారనీ వైసిపి, బిజెపి ఆరోపణలు కురిపిస్తూ వచ్చాయి. ఇన్నిటి మధ్యనా బిజెపి తోనే నడిచిన టిడిపి తీరా ఎన్నికలు దగ్గర పడ్డాకే పోలవరంకు సహాయం రాలేదని పల్లవి పున:ప్రారంభించింది. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు దీక్ష తతంగం తలపెడితే కేంద్రం పెంచిన వ్యయం రూ. 47 వేల కోట్ల మేర్లకు అంగీకరిస్తున్నట్టు ఒక సూచన వదిలింది. అదే ఘనత అని టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వంటి వారు చెబుతుంటారు గాని తుది నిర్ణయం జరిగిందా అనేది చెప్పరు. ఇప్పటికైనా తమకు ఏదైనా లిఖిత పూర్వక సమాచారం వచ్చిందేమో చెబితే బావుంటుంది. ఇందుకు సంబంధించి ఇంకా చాలా ముందు వెనకలూ వివాదాల వివరాలున్నా స్థలాభావం అడ్డు వస్తుంది.
వైసిపి హయాంలోనూ అదే తంతు
2019 మే నెలలో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రహసనం మరోలా సాగుతోంది. వైసిపి నేతలు పోలవరం నిధుల విడుదలపై కేంద్రం సహాయ నిరాకరణ కన్నా టిడిపి పై పాత ఆరోపణలకే సమయం కేటాయించారు. అప్పటి వరకూ జరిగింది కేవలం రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమని చెబుతూ వచ్చారు. 2019 జూన్‌లో ఆ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర మంత్రి రతన్‌లాల్ కటారియా తాము రూ. 33 వేల కోట్ల పునరావాస వ్యయం ఆమోదించినట్టు చెబితే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. వీరూ టిడిపి లాగే కాంట్రాక్టర్లను మార్చాలన్నారు. దానికి 'రివర్స్ టెండరింగ్' పేరు పెట్టారు గాని పరమార్థం 'రీ టెండరింగ్' మాత్రమే. రివర్స్ టెండరింగ్ ప్రకటనతో కేంద్రం విభేదించింది. దీనివల్ల మరింత ఆలస్యం అవుతుందని అభ్యంతరం చెప్పింది. కాని ముఖ్యమంత్రి జగన్ పోలవరంలో 'నవయుగ'ను తప్పించి 'మెఘా' కంపెనీకి అంతకుముందు కన్నా తక్కువకు కాంట్రాక్టు ఇచ్చారు. దీనిపై 'నవయుగ' కోర్టుకు వెళ్లినా అనుకూల తీర్పు రాలేదు. ఆ సంస్థపై సిబిఐ దాడులు కూడా జరిగాయి. విద్యుత్ ప్రాజెక్టు, డ్యాం నిర్మాణంలో మొత్తం రూ. 800 కోట్ల పైన రివర్స్ ద్వారా మిగిల్చినట్టు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలను పైకి చెప్పకుండా అనుకూల ప్రచారం చేసుకుంది. అరకొరగా విదిలించిన నిధులను చూపించడం పైనే కేంద్రీకరించింది. 2019 డిసెంబరులో లోక్‌సభలో సంబంధిత మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ 2014 నాటి అంచనాల మేరకు నిర్మాణ వ్యయానికే తాము కట్టుబడి వున్నామని రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం పూర్తి చేస్తే నిర్మాణం అయిపోతుందని చల్లగా చెప్పారు. మొత్తం లక్షా 5 వేల కుటుంబాలకు పునరావాసం అవసరం కాగా ఇప్పటికి 3422 కుటుంబాలకే జరిగినట్టు కూడా మంత్రి ప్రకటించారు. తాము అడిగిన వివరాలు పాక్షికంగానే వచ్చినట్టు చెప్పారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పెంటపాటి పుల్లారావు పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్ లోనూ కేంద్రం అంతా బాగానే వుందని టిడిపి హయాంలో సమాచారం ఇస్తే అది తమకు కితాబు అన్నట్టు టిడిపి చెప్పుకుంది. ఇంత ప్రతికూల సమాధానాలు వస్తున్నా వైసిపి ప్రభుత్వం ఎంత మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించింది లేదు. 2020 సెప్టెంబరులో తమ ప్రతినిధి వర్గం కలిసినప్పుడు రూ. నాలుగు వేల కోట్లు విడుదలవుతున్నట్టు చెప్పడం పైనే ఆనందపడిపోయారు. అది 2014 లెక్కల ప్రకారం ఇచ్చే 20+ కోట్ల విడుదలలో మిగిలినదానికి ముగింపు అని గుర్తించలేదు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించినట్టు కూడా నీటి పారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. రూ. 47 వేల కోట్ల ఖర్చుకు కేంద్రం ఒప్పుకున్నట్టు ఈ ప్రభుత్వ హయాంలోనూ సంకేతాలు వచ్చాయి. వాస్తవం ఏమంటే అవన్నీ జల్‌శక్తి శాఖ చెప్పినవి తప్ప ఆర్థిక శాఖ ఆమోదం రాలేదు. అప్పుడు గొప్పగా చెప్పిన వారు ఇప్పుడు ఆ శాఖ నిరాకరించిన తర్వాత 'టిడిపి దే తప్పంతా' అని సరిపెట్టడం, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనడం హాస్యాస్పదం. ఈ సమాచారం వచ్చాక సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కూడా కేంద్రంతో ఘర్షణ పడకుండా చర్చలతో రూ. 47 వేల కోట్ల మొత్తం రాబట్టాలని అధికారులకు సూచించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ ఎంతసేపటికీ గత రాష్ట్ర ప్రభుత్వ తప్పులేగాని కేంద్రం పేరెత్తింది లేదు. ఈ సమయంలో జరగాల్సింది అన్ని పార్టీలూ సంఘాలు కలసి కేంద్రంపై ఒత్తిడి తేవడం తప్ప టిడిపి, వైసిపి లు తమను తాము పొగుడుకుంటూ అవతలి వారిని నిందించినందువల్ల ఒరిగేది లేదు. బిజెపి కోరుకునేదే అది. గతంలో తప్పులనూ అక్రమాలను అరికట్టవచ్చు గాని ఆ పేరుతో మొత్తానికి ఎసరు పెట్టడం అన్యాయం. జాతీయ ప్రాజెక్టు అంటూ రాష్ట్రంపై నెట్టి కేంద్రం తప్పుకోవడం రాజ్యాంగ విరుద్ధం. గత టిడిపి ప్రభుత్వం కమిషన్ల కోసం నిర్మాణ బాధ్యత తీసుకుందన్న వైసిపి నేతలూ ఆ ఏర్పాటును కొనసాగిస్తున్నారే గాని వదులుకోలేదు. కేంద్రంపై ఒత్తిడీ లేదు. అంటే చరిత్ర పునరావృతం అవుతుందని ప్రజలు తెలుసుకోవలసి వుంటుంది. ఈ లెక్కన పోలవరం పూర్తికీ పునరావాస కల్పనకూ మరెంత సమయం పట్టేది ఊహించవలసిందే.
తెలకపల్లి రవి










