ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీస్‌శాఖలో ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఏదో ఒక రూపంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాల్సిన ప్రభుత్వాలు గత మూడేళ్లుగా కొత్త రిక్రూట్‌మెంట్‌లు ఏవీ చేపట్టక పోవడంతో ఖాళీల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ప్రస్తుతం పోలీస్‌శాఖను వేధిస్తున్న ప్రధాన సమస్య ఖాళీలే. రాష్ట్రంలో మొత్తం అన్ని ఫోర్స్‌లు కలసి 78,433 మంది పోలీసులు వుండాల్సినచోట, 60,092 మందే అందుబాటులో వున్నారు. అంటే 37శాతం ఖాళీలతో పోలీస్‌శాఖ విధినిర్వహణలో సతమతమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అందరి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పోలీసులకు కూడా వీక్లీ ఆఫ్‌లను ప్రకటించి గత ఏడాది డిసెంబర్ నుంచి అమలు చేస్తోంది. వీక్లీ ఆఫ్‌లు అమలు చేస్తుండటంతో పోలీస్ స్టేషన్ల నిర్వహణ మరింత భారంగా మారింది. పోలీస్‌శాఖలో రెగ్యులర్ ఖాళీలు 18,341 కాగా, వీక్లీ ఆఫ్‌ల అమలుతో 10,773 కొత్త ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు పోలీస్‌శాఖలో మొత్తం 78,433 పోస్ట్‌లలో 29,114 ఖాళీలు వున్నాయి.
పోలీస్ స్టేషన్లలోనే కాదు ఎపిఎస్‌పి బెటాలియన్లలోనూ పోలీస్ కొరత వేధిస్తోంది. రెగ్యులర్‌గా విఐపి సెక్యూరిటీ ఇవ్వాల్సిన ఎపిఎస్‌పి పోలీసుల స్థానంలో పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న లోకల్ పోలీస్‌లను వినియోగిస్తున్న పరిస్థితి వుంది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల కొరత పోలీస్‌ల మధ్యకూడా విభేదాలను సృష్టిస్తోంది. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకోసం పోలీసులు సెలవులు అడిగినపుడు ఇవ్వలేని సందర్భంలో పోలీస్‌స్టేషన్లలోనే అధికారులతో వాగ్వివాదానికి దిగుతున్న సంఘటనలు నిత్యం ఏదో ఒక స్టేషన్‌లో జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 2018 తర్వాత అసలు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లను చేపట్టని పరిస్థితి వుంది. 2018లో 2,700 మందిని కొత్తగా రిక్రూట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను అటకెక్కించేశారు. ఈ ప్రభుత్వం గ్రామాల్లో పోలీస్ స్టేషన్లకు సహాయకారులుగా గ్రామ సచివాలయాల్లో పనిచేసేందుకు గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులుగా తీసుకున్న 15వేల మందిని మహిళా పోలీస్‌లుగా గుర్తిస్తూ వారిని పూర్తిస్థాయిలో పోలీస్‌లుగా గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. పోలీస్ నియమకాలకు వుండే నిబంధనల కింద తీసుకోని వారిని పోలీసులుగా ఎలా గుర్తిస్తారని కోర్టు చెప్పడంతో ఆ ప్రక్రియలో పోలీసుల సంఖ్యను పెంచుకునే అవకాశం లేకుండా పోయింది. పోలీస్‌శాఖలో ఖాళీల కొరత శాంతిభద్రతలపై పడే అవకాశం వున్నందున తక్షణం పోలీస్‌శాఖలో ఖాళీలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.










