Jan 24,2021 23:33

హాజరైన పారిశుధ్య కార్మికులు మాట్లాడుతున్న సిహెచ్‌ బాబూరావు

ప్రజాశక్తి - తుళ్లూరు : కార్మికుల పనిభద్రత, వేతనాల పెంపు అంశాలపై పోరాటాని కొనసాగిస్తామని, కేసులకు భయపడబోమని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్‌ బాబురావు స్పష్టం చేశారు. తుళ్లూరులో ఆదివారం నిర్వహించిన పారిశుధ్య కార్మికుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. సిఐటియు అండతో పెండింగ్‌ జీతాలతో పాటు పనినీ కార్మికులు నిలబెట్టుకున్నారని, వారి పోరాట పటిమను రాష్ట్రమంతా చూసిందని అభినందించారు. ఎలైట్‌ ఏజెన్సీ కొత్తగా తీసుకున్న 30 మంది కార్మికులకు వెంటనే జీతాలతోపాటు వారికీ పని భద్రత కల్పించాలని, కార్మికులను ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజధాని ఏరియా పారిశుధ్య కార్మికుల సంఘం గౌరవాధ్యక్షులు ఎం.రవి మాట్లాడుతూ కార్మికులపై అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా బారినపడిన వారిని ఆన్‌డ్యూటీగా పరిగణించి జీతం చెల్లించాలని కోరారు. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్‌ వికటించి ఆశావర్కర్‌ మృతి అంశంలో ఆందోళనలో అరెస్టులను ఖండించారు. సభలో రాజధాని పారిశుధ్య కార్మికుల సంఘం కార్యదర్శి ఆర్‌.వేణు, నాయకులు వి.వెంకటేశ్వరరావు, వి.వీర్లంకయ్య పాల్గొన్నారు.